ETV Bharat / health

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - కిడ్నీ ఫెయిల్యూర్​ వార్నింగ్స్ కావొచ్చట!

- కిడ్నీ ఫెయిల్ అయిన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్న నిపుణులు

Warning_Signs_of_Kidney_Disease
Warning_Signs_of_Kidney_Disease (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : April 10, 2025 at 9:25 PM IST

4 Min Read
Choose ETV Bharat

Warning Signs of Kidney Disease : రక్తం నుంచి వ్యర్థపదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం వల్ల రోగాల బారిన పడడంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కిడ్నీ సమస్యను ముందుగానే గుర్తించడం వల్ల మరణం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కిడ్ని వ్యాధిని సూచించే 10 హెచ్చరిక సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. National Library of Medicine కూడా పలు లక్షణాలను పేర్కొంది.

రాత్రి సమయంలో తరచూ మూత్రవిసర్జన : మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన మొదటి సంకేతాల్లో ఒకటి తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం. మరి ముఖ్యంగా రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి చాలా సార్లు మేల్కొంటునట్లయితే అది మూత్రపిండాల వ్యాధి లక్షణం కావచ్చనని నిపుణులు అంటున్నారు. మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేసి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. మూత్రపిండాల్లో ఏవైనా సమస్యలు ఉండడం వల్లనే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లేలా చేస్తాయని చెబుతున్నారు. అందుకే ఇలా జరిగితే మూత్రపిండాలు వ్యర్థాలను సరిగ్గా ఫిల్టర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయని భావించాలని తెలిపారు.

కిడ్నీ
కిడ్నీ (Getty images)

పాదాలు లేదా కాళ్లలో వాపు : మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన మరొక లక్షణం వాపు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు అవి అదనపు సోడియం ద్రవాన్ని, నీరును ఫిల్టర్ చేయలేవు. ఇది క్రమంగా ద్రవ నిలుపుదలకు దారితీస్తుంది. ఫలితంగా పాదాలు లేదా కాళ్లలో వాపు వస్తుందని Mayo Clinic పేర్కొంది. ముఖ్యంగా దిగువ భాగాల్లో ముఖ్యంగా బూట్లు లేదా సాక్స్ వేసుకునే ప్రదేశంలో సాధారణంగా కంటే గట్టిగా ఉన్నట్లు మీకు అనిపిస్తే అది మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావచ్చని అంటున్నారు.

నిరంతర అలసట, బలహీనత : అలసట అనేక అనారోగ్య పరిస్థితులకు సాధారణ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు మీ శరీరం వ్యర్థ, విష పదార్థాలతో నిండిపోవచ్చు. ఫలితంగా ఇది శక్తి లేకపోవడం, అలసటకు దారి తీస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా మీరు నిరంతర అలసటగా అనిపిస్తుందా? అయితే మీ కిడ్నీ వ్యర్థాలను సమర్థవంతంగా ఫిల్టర్ చేయడం లేదని సంకేతం.

కిడ్నీ
కిడ్నీ (Getty images)

మూత్రంలో రక్తం : మీ మూత్రంలో రక్తం కనిపించడం అనేది మూత్రపిండాలు దెబ్బతిన్నాయనడానికి తీవ్రమైన సంకేతమని నిపుణులు తెలిపారు. మూత్రంలో రక్తం వస్తే మూత్ర నాళానికి నష్టం జరిగిందని అంటున్నారు. ఇది మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావచ్చని వివరించారు. మీరు మూత్రాన్ని విసర్జించినప్పుడు గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగు లేదా రక్తం గడ్డకట్టడాన్ని గమనించినట్లయితే వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మూత్రంలో రక్తం అనేది మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన అత్యంత ఆందోళనకరమైన హెచ్చరిక సంకేతాల్లో ఒకటని National Kidney Foundation పేర్కొంది. దీన్ని విస్మరించకూడదని సలహా ఇస్తోంది.

నురుగతో కూడిన మూత్రం : నురుగుతో కూడిన మూత్రం రావడాన్ని ప్రోటీన్యూరియా అని పిలుస్తారు. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు ప్రోటీన్​లను సమర్థంగా ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. ఫలితంగా అల్బుమిన్ వంటి ప్రోటీన్లు మూత్రంలోకి లీక్ అవుతాయి. దీనివల్ల మూత్రంలో నురగు ఎక్కువగా కనిపిస్తుంది.

శ్వాస ఆడకపోవడం : మూత్రపిండ వ్యాధి ఊపిరితిత్తుల్లో ద్రవాలు పేరుకుపోవడానికి దారితీస్తాయి. దీంతో శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలు ఎదురైవుతాయి. ఇది కిడ్నీ వ్యాధి చివరి దశలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొందరిలో ఈ సమస్య ప్రారంభ దశల్లో కూడా సంభవించవచ్చు. శరీరం నుంచి వ్యర్థాలు, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయలేకపోతే అవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోతాయి. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని Mayo Clinic ప్రచురించింది. ముఖ్యంగా విశ్రాంతి తీసుకునేటప్పుడు లేదా పడుకునేటప్పుడు శ్వాస ఆడకపోవడం ఇబ్బందిగా ఉంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కిడ్నీ
కిడ్నీ (Getty images)

వికారం, వాంతులు : కిడ్నీ వ్యాధి సమస్య ఉన్నవారిలో వికారం, వాంతులు సర్వసాధారణం. ఇవి సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోతాయి. ఇది వికారం, వాంతులు వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఒకవేళ ఈ వ్యాధి ముదిరితే ఈ లక్షణాలు కాలక్రమేణా తీవ్రమవుతాయి. ఎటువంటి సృష్టమైన కారణం లేకుండా మీకు నిరంతరం వికారం, వాంతులు అవుతున్నట్లయితే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని భావించాలని చెబుతున్నారు.

బరువు తగ్గడం : ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం మూత్రపిండాల వ్యాధికి ముందస్తు సంకేతాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ఆకలి తగ్గడానికి దారితీస్తుంది. దీంతో శరీరం అనేది అదనంగా పోషకాలను గ్రహించలేకపోవచ్చు. దీనివల్ల అనుకోకుండా బరువు తగ్గవచ్చు. ఆకలి తగ్గిపోవడం, వేగంగా బరువు తగ్గడం లాంటి సమస్యలు కనిపిస్తాయని వివరించారు.

చర్మం దురద, పొడిబారడం : ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతుంటే అది మూత్రపిండాల వ్యాధికి లక్షణం అవుతుందని అంటున్నారు. మూత్రపిండాలు వ్యర్థాలను సరిగ్గా ఫిల్టర్ చేయడంలో విఫలమవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీని వల్ల చర్మం పొడిబారడం, దురద వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవడం వల్ల మీరు మరింత తీవ్రమైన చర్మ సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు.

కిడ్నీ
కిడ్నీ (Getty images)

అధిక రక్తపోటు : మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు ఇవి రక్తపోటును నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇందుకు డాక్టర్ల వద్ద చికిత్స తీసుకున్నా కూడా రక్తపోటు స్థిరంగా పెరిగితే మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయటం లేదని సంకేతం కావచ్చని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఒంటి కాలిపై ఎంత సేపు ఉండగలరు? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మీకు 'ఫన్ యోగా' తెలుసా? ఇలా చేస్తే నవ్వుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమట!