ETV Bharat / health

కుడి వైపున "తలనొప్పి" ఎందుకు వస్తుందో తెలుసా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

-తల కుడి వైపున నొప్పికి కారణాలు - నిపుణులు చెప్తున్న సమాధానాలు ఇవే!

pain on the right side of head
pain on the right side of head (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 7, 2025 at 10:45 AM IST

4 Min Read
Choose ETV Bharat

What Causes Pain on the Right Side of Head: తలనొప్పి అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే సర్వసాధారణమైన నొప్పి రూపాలలో ఒకటి. చాలా మందికి తల రెండు వైపులా నొప్పి ఉన్నప్పటికీ, కొందరికి కుడి వైపున మాత్రమే ఉంటుంది. దీనినే కుడివైపు తలనొప్పి అంటారు. ఈ తలనొప్పి తేలికపాటి నుంచి తీవ్రమైన నొప్పి వరకు ఉండవచ్చని అంటున్నారు. కుడివైపు తలనొప్పి రకం, ట్రిగ్గర్‌లు, తీవ్రతను గుర్తించడం సమర్థవంతమైన నిర్వహణకు, సకాలంలో చికిత్సకు, దీర్ఘకాలిక నొప్పిని నివారించడానికి చాలా అవసరమంటున్నారు. ఈ క్రమంలో తలనొప్పి అనేది కుడి వైపు మాత్రమే ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం!

కుడివైపు తలనొప్పి అంటే : తల కుడి వైపున, తల చర్మం, పుర్రె అడుగు భాగం, కళ్లు, దవడ లేదా మెడ ప్రాంతాలలో కలిగే నొప్పి లేదా అసౌకర్యం. తలనొప్పి తీవ్రత, వ్యవధి, ఫ్రీక్వెన్సీలో మారవచ్చని, కానీ మెదడు కణజాలంలో నొప్పి గ్రాహకాలు లేకపోవడం వల్ల ఇది నేరుగా మెదడు వలన రాదని నిపుణులు చెబుతున్నారు. ఈ నొప్పి తల చుట్టుపక్కల రక్త నాళాలు, నరాలు, కండరాలు, ఇతర కణజాలాల నుంచి ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎడమవైపు మైగ్రేన్ ఉన్నవారితో పోలిస్తే కుడివైపు మైగ్రేన్ ఉన్నవారికి తక్కువ నొప్పి ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా, మైగ్రేన్ లక్షణాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, కుడివైపు తలనొప్పి మొత్తం భారాన్ని కొద్దిగా తగ్గిస్తుందంటున్నారు.

headache
తలనొప్పి (Getty Images)

"BP" ఎప్పుడు చెక్ చేసుకోవాలో తెలుసా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

కుడివైపును ప్రభావితం చేసే తలనొప్పి రకాలు :

మైగ్రేన్ తలనొప్పి : ఇది కేవలం తలనొప్పి మాత్రమే కాదని, చాలా సంక్లిష్టమైన మెదడు సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ఇది కొందరికి ఒక వైపుననే వస్తుందని, మరికొందరికి రెండు వైపులా ఉండొచ్చని పేర్కొన్నారు. మైగ్రేయిన్ దాడి చేసినప్పుడు వికారం, వాంతి, మూడ్ మారటం, తీవ్రమైన అలసట వంటి ఇతర లక్షణాలూ ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో వెలుగు, చప్పుడు, వాసనలనూ భరించలేకపోవచ్చని, ఇది కొద్ది గంటల నుంచి రోజుల వరకూ ఇబ్బంది పెడుతుందని పేర్కొన్నారు. మెదడులో జ్ఞానేంద్రియాలకు సంబంధించిన నాడులు అతిగా స్పందించటం వల్ల మైగ్రేయిన్​కు దారితీస్తుందని వివరించారు.

క్లస్టర్ తలనొప్పి : హఠాత్తుగా తలెత్తే ఇందులో నొప్పి చాలా ఎక్కువగా ఉంటుందని, రోజూ ఒకే సమయానికి లేదా రోజు విడిచి రోజు వస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా వారాల కొద్దీ వేధిస్తుంటుందని, నొప్పి కనీసం అరగంట వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ తలనొప్పి రోజులో చాలాసార్లూ రావొచ్చని తెలిపారు. క్లస్టర్ తలనొప్పి సమయంలో కన్ను ఎర్రబడటం, ముక్కు కారటం, కంటి చుట్టూ వాపు లాంటి లక్షణాలు కనిపిస్తాయని mayoclinic అధ్యయనంలో పేర్కొంది.

headache
తలనొప్పి (Getty Images)

టెన్షన్ తలనొప్పి : పేరుకు తగ్గట్టుగానే చాలా వరకూ మానసిక ఒత్తిడితో ప్రేరేపితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడికి లోనైనప్పుడు మెడ, ముఖం, మాడు, దవడ కండరాలు బిగుతుగా అవుతాయని, ఇది నొప్పికి దారితీస్తుందని వివరించారు. అంతేకాకుండా, నిద్రలేమి, ఒంట్లో నీటి శాతం తగ్గటం, శరీర భంగిమ అస్తవ్యస్తం కావటమూ దీనికి దోహదం చేయొచ్చని తెలిపారు. ఈ తలనొప్పి, కొందరికి కొద్ది గంటల నుంచి రోజుల వరకూ ఉంటే, మరికొందరిని విడవకుండా వేధించొచ్చని అంటున్నారు. నెలలో 15 కన్నా ఎక్కువ రోజులు తలనొప్పి వస్తుంటే దీర్ఘకాల సమస్యగా భావిస్తారని, అంటే ఎక్కువ రోజులు దీంతోనే సతమతమవుతుంటారని వెల్లడించారు. కొన్ని టెన్షన్ తలనొప్పులు అలసట, భావోద్వేగ ఒత్తిడి లేదా మెడ లేదా దవడ కండరాలు లేదా కీళ్లకు సంబంధించిన సమస్యల వల్ల ప్రేరేపించబడతాయని Harvard Health Publishing అధ్యయనంలో పేర్కొంది.

హెమిక్రానియా కంటిన్యూవా : ఈ తలనొప్పి తలలో ఒక వైపు 24 గంటల పాటు నిరంతర నొప్పిని కలిగిస్తుందని clevelandclinic అధ్యయనంలో పేర్కొంది. ఈ రకమైన తలనొప్పికి వైద్య పర్యవేక్షణలో ప్రిస్క్రిప్షన్ మందులు వాడితే, వెంటనే ఉపశమనం లభిస్తుందని వివరించారు.

సాధారణ కారణాలు : కుడివైపు తలనొప్పికి జీవనశైలి, నరాల సంబంధిత, వైద్య, పర్యావరణ కారకాలు అనేక రకాలుగా కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

జీవనశైలి కారకాలు :

  • ఒత్తిడి, ఆందోళన
  • అలసట లేదా నిద్ర లేకపోవడం
  • భోజనం చేయకుండా ఉండటం లేదా రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు
  • మెడ, భుజాలలో కండరాల ఒత్తిడి
  • అధిక కెఫెన్ వినియోగం

ఔషధ సంబంధిత తలనొప్పి : నొప్పి నివారణ మందులు లేదా మైగ్రేన్ చికిత్స మందుల అతి వినియోగం వల్ల తలనొప్పి రావచ్చు.

headache
తలనొప్పి (Getty Images)

నరాల సంబంధిత కారణాలు :

  • ఆక్సిపిటల్ న్యూరల్జియా : ఆక్సిపిటల్ నరాలు దెబ్బతినడం వల్ల తల వెనుక, మెడలో తీవ్రమైన నొప్పి.
  • టెంపోరల్ ఆర్టెరైటిస్ : తల, మెడలోని ధమనులు ఉబ్బడం వల్ల తీవ్రమైన నొప్పి, దవడ నొప్పి, అలసట.
  • ట్రైజెమినల్ న్యూరల్జియ : తీవ్రమైన, సూదితో పొడిచినట్లు ఉండే ముఖ నొప్పి, సాధారణంగా ఒక వైపు మాత్రమే ఉంటుంది.

ఇతర వైద్య కారణాలు :

  • జన్యుపరమైన అంశాలు
  • అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా
  • పళ్లు కొరకడం, దవడ బిగించడం

ఇన్‌ఫెక్షన్లు, అలెర్జీలు : సైనస్ ఇన్‌ఫెక్షన్లు కళ్ల వెనుక, బుగ్గ ఎముకల వెనుక ఒత్తిడి, నొప్పిని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

  • అకస్మాత్తుగా లేదా తీవ్రంగా ఉంటే.
  • సమయం గడిచే కొద్దీ తీవ్రమవుతుంటే.
  • దృష్టి మార్పులు, తిమ్మిరి లేదా బలహీనత వంటి నరాల లక్షణాలతో కూడి ఉంటే.
  • సాధారణ చికిత్సకు స్పందించకపోతే.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ "అల్లం" తింటే ఏమవుతుంది? - నిపుణుల సమాధానమిదే!

చేతులు, కాళ్లలో 'ఈ లక్షణాలు' కనిపిస్తున్నాయా? - లివర్ డేంజర్​లో ఉందని అర్థమట!