Can Tubectomy be Done During a C-section : పిల్లలు ఇక చాలు అనుకున్న దంపతులు.. మళ్లీ గర్భం రాకుండా ఆపరేషన్ చేయించుకుంటారు. పురుషులైతే వేసెక్టమీ, మహిళలైతే ట్యూబెక్టమీ శస్త్ర చికిత్స చేయించుకుంటారు. అయితే.. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో చాలా మందికి చాలా సందేహాలు కలుగుతుంటాయి. ఇలాంటి ఓ సందేహమే ఓ మహిళకు కలిగింది. దీని పరిష్కారం కోసం గైనాకాలజిస్ట్ని సలహా కోరుతున్నారు. ఇంతకీ ఆమె సందేహం ఏంటి? దానికి నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
నాకు ఇప్పుడు ఏడో నెల. అయిదేళ్ల క్రితం సిజేరియన్ ద్వారా బాబు పుట్టాడు. ఈ రెండో సంతానం తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నాను. అయితే.. డెలివరీ సమయంలోనే చేయించుకుంటే మంచిదా? లేదంటే కొన్నాళ్లు ఆగాలా? అని అడుగుతున్నారు.
ఈ ప్రశ్నకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వై.సవితాదేవి సమాధానం ఇస్తున్నారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఏ సమయంలో చేసుకుంటే మంచిదో వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
డెలివరీ సమయంలో ట్యూబెక్టమీ చేయించుకోవచ్చా అనేది.. మీ దంపతులిద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి. ఒకే టైమ్లో రెండూ చేయించుకోవడం వల్ల అనస్తీషియా తీసుకోవడం, కాన్పు తర్వాత విశ్రాంతి, ఆస్పత్రి ఖర్చులు ఇవన్నీ కలిసి వస్తాయి.
సిజేరియన్‌తోపాటు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసినప్పుడు.. అది ఫెయిలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీ బిడ్డ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. పాపకు మొదటి ఏడాది కీలకం. ఎందుకంటే నవజాత శిశువుల మరణాల సంఖ్య మనదేశంలో ఇంకా అధికంగానే ఉంది. కాబట్టి, కాన్పు తర్వాత సంవత్సరం ఆగి, టీకాలన్నీ పూర్తయి, బిడ్డకు ఎలాంటి లోపాలూ లేవని, ఆరోగ్యం అంతా బాగుందని నిర్ధారించుకుని, అప్పుడు ట్యూబెక్టమీ చేయించుకుంటే మంచిది. - డాక్టర్ వై.సవితాదేవి (గైనకాలజిస్ట్)
మీరు మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ కావడం, శస్త్రచికిత్స చేసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ.. ట్యూబెక్టమీ చికిత్సకు ఒక్క పూట ఆస్పత్రిలో ఉంటే సరిపోతుంది. కుట్లు కూడా లేకుండా నాభిలో నుంచి చిన్న రంధ్రం చేసి అక్కడి నుంచి ఆపరేషన్ చేసేస్తారు. కాబట్టి, ఏం చేయాలనేది మీ దంపతులిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవడం మంచిదని డాక్టర్ వై.సవితాదేవి సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :