ETV Bharat / health

"చనుబాలతో తల్లీబిడ్డలిద్దరికీ మేలు" - ఏ వయసు వరకు పాలు ఇవ్వొచ్చు? - నిపుణుల సమాధానమిదే!

-తల్లిపాలతో పిల్లల మెదడు చురుగ్గా - ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ ఉంటుందంటున్న నిపుణులు!

Breastfeeding Benefits
Breastfeeding Benefits (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : August 10, 2025 at 10:26 AM IST

|

Updated : August 10, 2025 at 10:37 AM IST

5 Min Read
Choose ETV Bharat

Breastfeeding Benefits to Mother And Child : బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం. సకల పోషకాల మిళితమైన ఈ పాలు పసిపిల్లల్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. కానీ, ప్రస్తుతం కొంతమంది తల్లులు ఉద్యోగం, ఇతర కారణాల వల్ల చంటి పిల్లలకు పాలివ్వడం కొన్ని నెలల్లోనే ఆపేసి డబ్బా పాలను పట్టిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇటు బిడ్డ ఆరోగ్యానికి, అటు తల్లికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే తప్పనిసరిగా పిల్లలకు చనుబాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అసలు తల్లిపాల వల్ల పిల్లలకు, తల్లికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? పాలు ఏ వయసు వరకు ఇవ్వొచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

బిడ్డకు కలిగే ప్రయోజనాలు :

ఎప్పుటికప్పుడు తాజాగా : ఏ వయసు వారైనా సరే, ఆహార పదార్థాలు ఎంత తాజాగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే! ఇదే నియమం పిల్లలకూ కూడా వర్తిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిపాలు బిడ్డకు ఎప్పటికప్పుడు తాజాగా, వారికి కావాల్సిన ఉష్ణోగ్రత(Temperature) వద్ద లభిస్తాయని, అవి తాగడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని చెబుతున్నారు.

జీర్ణవ్యవస్థ పదిలం : బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల వరకూ తల్లి వక్షోజాల్లో ఉత్పత్తయ్యే పాలను 'ముర్రు పాలు' అని అంటారు. ఇవి శిశువుకి ఎలాంటి అలర్జీ, ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయని చెబుతున్నారు. అలాగే ఈ పాలు శిశువు జీర్ణవ్యవస్థను పటిష్టపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, కాబట్టి బిడ్డకు ఈ పాలు పట్టించడం వారి ఆరోగ్యానికి, ఎదుగుదలకు మంచిదంటున్నారు.

"30 ఏళ్ల నాటి పిండం ఇపుడు శిశువుగా" ఎలా సాధ్యమైందంటే?! - ఆసక్తి రేపుతున్న వైద్య పరిశోధనలు!

అపార తెలివితేటలు : తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల మెదడు చురగ్గా పని చేస్తుందని WHO అధ్యయనంలో పేర్కొంది. అలాంటి వారు చదువులో బాగా రాణిస్తారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి పిల్లలు బాగా చదవాలన్నా, భవిష్యత్తులో అభివృద్ధి సాధించాలన్నా పుట్టిన బిడ్డకి దాదాపు 6 నెలల పాటు తల్లిపాలను అందించడం తప్పనిసరని సూచిస్తున్నారు.

పోషకాల ఖజానా : తల్లి పాలలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రోట్లు వంటి ఎన్నో పోషకాలతో పాటు శిశువు శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయని వివరించారు. ఇవన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా తల్లిపాలు అనేవి శిశువుల్లో సులభంగా జీర్ణమవుతాయని, దీంతో పిల్లలకు మలబద్ధకం, జీర్ణసంబంధిత సమస్యలు లాంటివి కాకుండా జాగ్రత్తపడచ్చని తెలిపారు.

వయసుకు తగ్గ బరువు : ఎదిగే బిడ్డ వయసుకు తగ్గ బరువు పెరిగేలా చేయడంలోనూ తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. తల్లిపాలు తాగే పిల్లలకు ఉబ్బసం, ఊబకాయం, టైప్ 1 డయాబెటిస్, ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ (SIDS) వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని, అంతేకాకుండా చెవి ఇన్ఫెక్షన్లు, కడుపులో పురుగులు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందని Centers for Disease Control and Prevention అధ్యయనంలో పేర్కొంది.

ఆర్నెళ్ల తర్వాత కూడా : శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారమంటున్నారు. ఆరు నెలలు దాటిన తర్వాత చాలామంది తల్లులు పిల్లలకు పండ్లు, సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది తల్లులు పాలు ఇవ్వడం ఆపేస్తుంటారని, ఫలితంగా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందకుండా పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, పిల్లలకు ఆరు నెలలు దాటిన తర్వాత కూడా ఆహార పదార్థాలతో పాటు మధ్య మధ్యలో తల్లిపాలు కూడా ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. కనీసం సంవత్సం వరకైనా తల్లిపాలను కొనసాగించడం తల్లీబిడ్డలిద్దరికీ మేలని సలహా ఇస్తున్నారు.

దృఢమయ్యే అనుబంధం : తల్లి, బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల వారిద్దరి మధ్య బలమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుందని nhs.uk అధ్యయనంలో పేర్కొంది. బిడ్డ తల్లిపాలు తాగుతున్న క్రమంలో తల్లి ప్రేమ, ఆప్యాయతను చవిచూస్తారని, అలాగే తల్లి ఒడిని మించిన సురక్షితమైన ప్రదేశం మరెక్కడా లేదనే భావన వారిలో కలుగుతుందని వివరించారు. ఈ భావాలన్నీ పిల్లలకు తల్లిపై, తల్లికి పిల్లలపై ఉండే ప్రేమను మరింతగా పెంచి వారిద్దరి మధ్య బంధాన్ని పటిష్టం చేస్తాయని పేర్కొన్నారు.

ఈ ప్రయోజనాలు కూడా :

  • తల్లిపాలు వల్ల భవిష్యత్తులో క్యాన్సర్లు, గుండె సంబంధిత సమస్యల ముప్పు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • తల్లిపాలు అనేవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
  • చనుబాలు తాగి పెరిగిన పిల్లల శరీరంపై అన్ని రకాల వ్యాక్సిన్లు బాగా పని చేస్తాయని పలు అధ్యయనాలు వెల్లడైంది.
  • తల్లిపాలు తాగిన పిల్లలకు పెరిగి పిల్లలు డయాబెటిస్ బారిన పడే ముప్పూ తక్కువగా ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

తల్లికీ ఎంతో మంచిది! :

  • బిడ్డ పాలు తాగుతున్నప్పుడు తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడి ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుందని, ఇది పాలు పడడానికి కాకుండా గర్భాశయం త్వరగా సంకోచించడానికీ దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కాన్పు తర్వాత రక్తస్రావమూ తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రసూతి మరణాల్లో చాలావరకు రక్తస్రావం ఆగకపోవడమే ప్రధాన కారణమట.
  • ప్రసవం తర్వాత ఎదురయ్యే ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన లాంటి సమస్యలు బిడ్డకు పాలివ్వడం వల్ల తగ్గు ముఖం పడతాయి.
  • శిశువుకు పాలివ్వడం వల్ల ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువును సులభంగా తగ్గుతారట. ఎలాగంటే, బిడ్డకు పాలు పట్టే క్రమంలో తల్లి శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయని, తద్వారా తల్లులు ఈజీగా బరువు తగ్గేయచ్చట.
  • పాలు పట్టడం వల్ల టైప్2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని clevelandclinic అధ్యయనంలో పేర్కొంది.
  • అంతేకాకుండా పిల్లలకు పాలివ్వడం వల్ల నిద్ర హాయిగా పడుతుందని, చక్కటి మానసిక ఆరోగ్యానికీ, భావోద్వేగాల నియంత్రణకూ ఈ పద్ధతి తోడ్పడుతుందట
  • బిడ్డకి పాలు పడుతున్నప్పుడు పీరియడ్స్ కాస్త ఆలస్యంగా వస్తుందని, తద్వారా ఆ వెంటనే గర్భం ధరించే అవకాశమూ చాలా వరకు తగ్గుతుందంటున్నారు.
  • బిడ్డకు పాలిచ్చే తల్లులకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ముప్పు తక్కువని, గుండె జబ్బులు, ఎముకలు గుల్లబారే అవకాశం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆందోళనకరంగా ప్రసూతి మరణాలు - కారణాలపై అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే!

"IVF సంతానం" - పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? - నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా?

Last Updated : August 10, 2025 at 10:37 AM IST