Benefits of Pomegranate Fruit : ఆరోగ్యంగా ఉండటానికి తాజా పండ్లు, కూరగాయలను తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తప్పకుండా తినాలని చెబుతుంటారు. అయితే, ఏడాది పొడవునా లభించే పండ్లు కొన్ని ఉంటాయి. అందులో దానిమ్మ ఒకటి. దీనిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే వారం రోజుల పాటు దానిమ్మ పండును తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాలు: ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, కె, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే వీటిని తినడం వల్ల శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయి.
దానిమ్మ వల్ల కలిగే హెల్త్ బెన్‌ఫిట్స్ :
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: అధ్యయనాల ప్రకారం, దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయి. కాలేయ క్యాన్సర్ ప్రారంభ దశలలో కణితి పెరుగుదలను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్కు దానిమ్మ సారం ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. 2017లో Journal of Nutrition and Cancerలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, దానిమ్మలోని పోషకాలు రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి.
డయాబెటిస్ నియంత్రణ: దానిమ్మలో ఉండే పునీకాలాజిన్ అనే యాంటీఆక్సిడెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: దానిమ్మలు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. దానిమ్మ పండ్లలో ఉండే పాలీఫెనోలిక్ సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
కిడ్నీల ఆరోగ్యం: 2014లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం' ప్రచురించిన నివేదిక ప్రకారం దానిమ్మ రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 58 మంది పెద్దలకు 8 వారాల పాటు రోజుకు 250 మి.లీ దానిమ్మ రసం అందించారు. అయితే దానిమ్మ రసం తాగిన వారిలో మూత్రంలో సిట్రేట్ స్థాయిలు పెరిగాయట. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
- గర్భిణీలు దానిమ్మ పండును తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డ మెదడు బాగా అభివృద్ధి చెందుతుందని నిపుణులంటున్నారు.
- రోజూ దానిమ్మ పండ్లను తినడం వల్ల కడపులో మంట తగ్గుతుందట.
- వారం రోజుల పాటు దానిమ్మను తినడం వల్ల శరీరంలో వాపు సమస్య తగ్గుతుందట.
- దానిమ్మ పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ గుణాలు వ్యాయామం చేసేటప్పుడు శక్తిని అందిస్తాయి. దీనివల్ల తొందరగా అలసట రాదని నిపుణులు చెబుతున్నారు.
- దానిమ్మ పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.
- దానిమ్మలు వయసు సంబంధిత మెదడు క్షీణత, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
- దానిమ్మలలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
- దానిమ్మలలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.
గమనిక : దానిమ్మ పండ్ల వల్ల చాలా ప్రయోజనాలున్నప్పటికీ, ఇందులో షుగర్, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు షుగర్, మూత్రపిండాల సమస్యలు ఉంటే వీటిని తినే ముందు డాక్టర్లను సంప్రదించడం మంచిది.
'దానిమ్మ'తో ఎన్ని ప్రయోజనాలో!.. అధిక బరువుకు చెక్.. షుగర్ ఉన్నవాళ్లు తినొచ్చా?
Mahashivratri Special : అక్కడి శివలింగం చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..?