Sridevi Success Story :తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు అందాల తార శ్రీదేవి. బాలనటిగా సినీ కెరీర్‌ను ప్రారంభించి, టాప్ హీరోయిన్ అనిపించుకున్నారు. అటు గ్లామర్ పాత్రలతో పాటు, ఇటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ మెరిశారు. అంతేకాదు, అలనాటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణలతో నటించిన శ్రీదేవి ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లతోనూ ఆడి పాడి అలరించారు.
మూడేళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ
మూడేళ్లకే బాలనటిగా తెరంగేట్రం చేశారు శ్రీదేవి. 1967 తమిళ చిత్రం 'కంధన్ కరుణై'లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నీ ఇండస్ట్రీల్లోనూ రాణించారు. స్టార్ హీరోలతో సమానంగా పేరు సంపాదించుకున్నారు. అలాగే అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కథానాయికల్లో ఒకరుగా నిలిచారు.
అందంగా కనిపించేందుకు!
అయితే శ్రీదేవి తెరపై అందంగా, నాజుగ్గా కనిపించేందుకు డైటింగ్ చేసేవారట. దీంతో పలు సినిమాల షూటింగ్ సమయంలో స్పృహ తప్పిపడిపోయేవారట. అయితే తన అందం, అభినయంలో శ్రీదేవి కొన్ని దశాబ్దాలపాటు చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగారు. ఆమెను చూసేందుకే ప్రేక్షకులు సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అకస్మాత్తుగా విషాదం
2018 ఫిబ్రవరి 24న అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె హోటల్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తుపడి మరణించారు. ఆమె హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగారు. అలాగే పలువురు శ్రీదేవి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టి అగ్రహీరోలందరి సరసన నటించారు శ్రీదేవి. తన నటనతో అన్ని భాషల్లోని సినీప్రియులను అలరించి ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. భారతీయ చిత్రసీమను ఏలిన కొద్ది మంది కథానాయికల్లో శ్రీదేవి ఒకరు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కి 2018లో రిలీజైన 'జీరో' సినిమాలో ఆఖరిసారిగా శ్రీదేవి కనిపించారు. 2017లో వచ్చిన 'మామ్' ఆమె ప్రధాన పాత్రలో నటించిన చివరి సినిమా.