Singapore Honours 4 Indians : సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడితో పాటు పలువురు పిల్లలను కాపాడిన భారతీయ కార్మికులను అక్కడి ప్రభుత్వం సత్కరించింది. వారి చేసిన కృషికి గుర్తుగా ఫ్రెండ్ ఆఫ్ ACE నాణేలను అందజేసింది. వారి ప్రాణాలు పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఆ నలుగురు కార్మికులను సత్కరించినట్లు ఆ దేశ మ్యాన్ పవర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇంద్రజిత్ సింగ్, సుబ్రహ్మణ్యం శరణ్‌రాజ్, నాగరాజన్ అన్బరసన్, శివస్వామి వియ్రాజన్ అనే నలుగురు కార్మికులను ఉపాధి కోసం సింగపూర్ వెళ్లారు. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్‌లో గల ఓ మూడంతస్తుల భవంతిలో గురువారం(ఏప్రిల్ 8) ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఆ నలుగురు పని చేస్తున్నరు. భవనం నుంచి పిల్లల అరుపులు వినపడటం, మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించిన ఆ నలుగురు వెంటనే రంగంలోకి దిగారు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి 10 నిమిషాల ముందే ఆ వలస కార్మికులు 10 మంది పిల్లలను ప్రాణాలతో కాపాడారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌తో సహా 20 మంది గాయపడ్డారు. వారిలో 15మంది పిల్లలే ఉన్నారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు.
ఇక ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు కాలిన గాయాలతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చూరింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మార్క్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పలువురు పోస్టులు పెట్టారు. ప్రస్తుతం గాయపడిన మార్క్ శంకర్ మూడు రోజుల చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు. బాలుడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి పోస్ట్ పెట్టారు.