Bigg Boss 9 Sanjana Galrani: "డ్రగ్స్ కేసులో అరెస్ట్ - లిమ్కా బుక్‌లో చోటు" - సంజనా గల్రానీ గురించి తెలుసా?
- బుజ్జిగాడు సినిమాతో ఫేమ్ - సీక్రెట్‌గా పెళ్లి - ఈ ముద్దుగుమ్మ గురించి తెలుసా?

Published : September 27, 2025 at 5:27 PM IST
Sanjana Galrani Biography: సంజనా గల్రానీ ప్రస్తుతం ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్ సీజన్ 9లో అడుగుపెట్టిన ఈ హీరోయిన్ హౌజ్ మొత్తాన్ని చెడుగుడు ఆడేస్తుంది. ఇంట్లోకి వెళ్లిన రోజు నుంచే తన ఆట మొదలుపెట్టింది. కామనర్స్ ఫుడ్ పెట్టకపోవడంతో గుడ్డు దొంగతనం చేసి ఏం తెలియనట్టు కూర్చుంది. ఆ తర్వాత తన మైండ్ గేమ్, స్ట్రాటజీతో ఏకంగా బిగ్‌బాస్ తెలుగు 9కి తొలి కెప్టెన్‌గా నిలిచింది. ప్రస్తుతం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టిన బిగ్‌బాస్.. సంజనాను సీక్రెట్ రూమ్‌కు పంపించారు. ఈ క్రమంలోనే అసలు సంజనా ఎలా ఇండ్రస్టీలోకి వచ్చింది? ఏఏ సినిమాల్లో నటించింది సహా ఇతర వివరాలు చూద్దాం.
1989లో అక్టోబర్ 10న బెంగళూరులో స్థిరపడిన సింధి కుటుంబంలో జన్మించారు సంజన గల్రానీ. ఈమె చెల్లెలు నిక్కీ గల్రానీ కూడా నటి. అంతేకాకుండా ఆది పినిశెట్టి భార్య. సంజనా ఇంకో పేరు అర్చన. చదువుతున్న సమయంలో మోడలింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంజనా.. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంతో కలిసి చేసిన ఫాస్ట్ ట్రాక్ కమర్షియల్ యాడ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమాయకమైన ముఖం, చెరగని చిరునవ్వుతో దర్శక నిర్మాతల కళ్లలో పడ్డారు సంజన. తెలుగు చిత్రపరిశ్రమ ద్వారా నటిగా తొలి ఛాన్స్ అందుకున్నారు.
తెలుగులో ఎంట్రీ: 2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సొగ్గాడులో చిన్న పాత్ర ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు సంజన గల్రానీ. ఆ తర్వాత తమిళ్‌లో ఒరు కధల్ సేవిర్‌లో నటించారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో సంజన గల్రానీ లైఫ్ టర్న్ అయ్యింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో నటించారు. కానీ ఇవేవీ ఆమెకు స్టార్ తీసుకురాలేకపోగా.. సెకండ్ హీరోయిన్‌గా మిగిలిపోయారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు గడుస్తోంది. ప్రస్తుతం పొద ముండం అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా ఆమె యాక్టీవ్‌గా ఉంటారు. గతంలో బిగ్‌బాస్ కన్నడ, మలయాళంలో స్మార్ట్ షో, తెలుగు, కన్నడలలో, హిందీలో పలు షోలలో పార్టిసిపేట్ చేశారు. ఇదేకాదు 2015లో ఏకధాటిగా 104 గంటల పాటు సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో సంజన స్థానం సంపాదించారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్: శాండిల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజన పేరు తైరపైకి రావడంతో పాటు ఆమె అరెస్ట్ కావడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది. సుమారు రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. సినిమాల కంటే ఎక్కువ వివాదాలతోనే ఫేమ్ సంపాదించుకున్నారు ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, వేధింపులపై గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు సంజన. తనను కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో తీవ్రంగా వేధించాడని ఆరోపించింది. ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలో అజీజ్ పాషా అనే ఓ డాక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది సంజన. ప్రస్తుతం సంజనాకు ఇద్దరు పిల్లలు.
అందుకే బిగ్‌బాస్‌కు: ఇక బిగ్‌బాస్ స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత సంజనా ఎమోషనల్ అయ్యింది. 'నా పేరు అర్చన. ఏడో తరగతి చదువుతున్న సమయంలో మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. జాన్ ఇబ్రహీంతో ఓ యాడ్ చేశాను. అప్పుడు పూరీ జగన్నాథ్ నన్ను చూసి బుజ్జిగాడు సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను. ఒకరోజు సడన్‌గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? అని బాధపడ్డాను. ఆ రోజు గురించి తలుచుకుంటేనే బాధేస్తోంది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్‌చిట్ ఇచ్చింది. కానీ, అదెవరికీ కనిపించలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్‌బాస్‌కు వచ్చాను" అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది.
Bigg Boss 9 Demon Pavan: 'ఉద్యోగం వదిలి అథ్లెటిక్స్ ఆపై బిగ్‌బాస్‌లోకి' - ఈ కామనర్ గురించి తెలుసా?

