Kannappa Glimpses Released : ఈ రోజు బుధవారం ప్రముఖ తెలుగు హీరో, రాజకీయ నాయకులు డా.ఎం.మోహన్‌బాబు పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా 'కన్నప్ప' మూవీ టీమ్ ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇందులో మోహన్‌బాబు పోషించిన 'మహదేవ శాస్త్రి' పాత్రను పరిచయం చేసింది. తన కుమారుడు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప'ను మెహన్‌బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.
గ్లింప్స్‌లో మోహన్‌బాబు లుక్, సాంగ్ అద్భుతంగా ఉన్నాయి. పొడవైన జుట్టు, నుదుటిన విభూది, కాషాయ వస్త్రాలు, జపమాలలు ధరించి మహదేవ శాస్త్రి నడిచొస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
'ఢమ ఢమ విశ్వలింగ, దిమి దిమి విష్ఫు లింగ' అనే పాటతో గ్లింప్స్ మొదలవుతుంది. ఈ పాటను పాపులర్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. పాట వింటుంటే మహదేవ శాస్త్రి పాత్ర ఎలా ఉంటుంది? అతడికి శివుడిపై ఎంత భక్తి ఉందో అర్థమైపోతుంది. 'కనుబొమ ముడిచితే ఉగ్ర శాస్త్రి, కంగువ తెరచితే రుద్ర శాస్త్రి' వంటి లైన్లు పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటుందో చెబుతున్నాయి. వీడియోలో కనిపించే న్యూజిలాండ్ లొకేషన్లు కొత్తగా ఉన్నాయి. గ్లింప్స్‌లో మోహన్‌బాబు మేకప్ వేసుకోవడం, సినిమా షూటింగ్ దృశ్యాలు కూడా కనిపించాయి.
భారీ తారాగణం
మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. మంచి విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా 'కన్నప్ప' తీస్తున్నారు. 'మహాభారత' సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్నారు. కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు. పవర్‌ఫుల్ రోల్ 'రుద్ర'గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు. పార్వతీదేవిగా కాజల్, ఇతర ప్రధాన పాత్రల్లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం కనిపించనున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా దాదాపుగా పూర్తయింది. ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ టీమ్ ప్రకటించింది.