Shine Tom Chacko Arrested : డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాలు తీసుకున్న కేసులో విచారణకు హాజరైన అతడిని నాలుగు గంటల పాటు విచారించిన పోలీసులు.... అనంతరం అదుపులోకి తీసుకున్నారు. NDPS చట్టంలోని పలు సెక్షన్‌ల కింద చాకోపై కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే
కొన్ని గంటల్లోనే చాకోకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.
మాదకద్రవ్యాల వినియోగం కేసు కేరళ చిత్రసీమలో కలకలం సృష్టించింది. ఈ నెల 16న కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు చేయడానికి వెళ్లగా అంతకుముందే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అక్కడి నుంచి
పారిపోయాడు. ఆ సమయంలో మూడో అంతస్తులో ఉన్న చాకో కిటికీలోంచి రెండో అంతస్తులోకి దూకి పారిపోయినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, త్రిసూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.
కానీ అక్కడ టిమ్ చాకో లేకపోవడంతో కుటుంబ సభ్యలకు నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చాకో తన న్యాయవాదులతో కలిసి ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత పోలీసులు నాలుగు గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. NDPS చట్టంలోని సెక్షన్ 27, 29 కింద అతడిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నటుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం చాకోకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.
డ్రగ్స్ మత్తులో చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈనెల17వ తేదీన నటి విన్సీ కేరళ ఫిలిం ఛాంబర్‌తో పాటు కేరళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసింది. సూత్రవాక్యం సినిమా సెట్‌లో చాకో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు చాకోను విచారించడానికి కేరళ ఫిలిం ఛాంబర్ ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. షైన్ టామ్ చాకో ఇటీవల పలు తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. నేచురల్ స్టార్ నాని దసరా చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాకో, తర్వాత దేవర, డాకు మహరాజ్ వంటి చిత్రాల్లో నటించాడు.