Hrithik Roshan Krrish 4 Direction : ప్రముఖ బాలీవుడ్ కథానాయుకుడు హృతిక్ రోషన్ మెగా ఫోన్ పట్టనున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన 'క్రిష్' సిరీస్ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పటికే రిలీజైన మూడు భాగాలు భారీ విజయాన్ని అందుకోగా నాలుగో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ ఈ బిగ్గీ గురించి అప్‌డేట్ పంచుకున్నారు హృతిక్ తండ్రి, డైరెక్టర్ రాకేశ్ రోషన్. 'క్రిష్ 4'కు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు.
"25 సంవత్సరాల కిత్రం నిన్ను(హృతిక్ రోషన్) నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం చేశాను. ఇప్పుడు మళ్లీ 25 సంవత్సరాల తర్వాత ఆదిత్యచోప్రా, నేను కలిసి నిన్ను దర్శకుడిగాగా పరిచయం చేస్తున్నాం. డైరెక్టర్‌గానూ నువ్వు ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. ప్రతిష్టాత్మకమైన 'క్రిష్ 4 సినిమాకు నువ్వు దర్శకత్వం వహించడం చాలా సంతోషంగా ఉంది" అని రాకేశ్ రోషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు ఈ స్టార్ హీరోకు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. ఈ సినిమాపై అప్‌డేట్స్ కోరుతూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
గత కొంత కాలంగా 'క్రిష్ 4' చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ సిరీస్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాకేశ్ రోషనే దీనికి కూడా దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం లేదని రాకేశ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ మూవీకి దర్శుకుడు ఎవరని బీటౌన్‌లో పెద్ద చర్చ జరిగింది. రాకేశ్ తాజా పోస్ట్‌తో దీనిపై స్పష్టత వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో క్రిష్ 4 తెరకెక్కించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.