Akkineni Akhil Reception: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే నాగార్జున ఇంట్లో అఖిల్ పెళ్లి సన్నిహితుల మధ్య ఎలాంటి హాడావిడి లేకుండా ముగిసింది. తాజాగా అఖిల్, జైనబ్ పెళ్లి రిషెప్షన్ ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. రిసెప్షన్లో అఖిల్, జైనబ్ ఎలిగెంట్‌గా కనిపించారు.

అఖిల్ మ్యారేజ్ రిసెప్షన్‌కు అనేక మంది సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రముఖ రాజకీయవేత్త వెంకయ్యనాయుడు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లిలో ఎలాంటి హడావుడి లేకపోయినా, వివాహ విందు మాత్రం కళకళలాడింది. మహేశ్ బాబు - నమ్రత, రామ్‌చరణ్, సుకుమార్, నాని, నిఖిల్, యశ్, సూర్య, సుదీప్, అడవి శేష్, వెంకీ అట్లూరి, దగ్గుబాటి వెంకటేష్, అల్లరి నరేష్, సుధీర్ బాబుతోపాటు నిర్మాతలు దిల్‌రాజు, అశ్వనీదత్, అల్లు అరవింద్, కె.ఎల్.నారాయణ సహా పలువురు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
జైనబ్ ఎవరంటే?
జైనాబ్ చిత్రకారిణి. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కూడా మంచి పేరుంది. మన దేశంలోనే కాక దుబాయ్, లండన్‌లోనూ ప్రదర్శనలిచ్చినట్లు తెలిసింది. ఆమె హైదరాబాద్‌లో పుట్టి ముంబయిలో స్థిరపడ్డట్లు సమాచారం. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జునకు మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉంది. జైనబ్‌కు రెండేళ్ల క్రితం అఖిల్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇంట్లో పెద్దలని ఒప్పించి ఇద్దరి కుటుంబాల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది.
అక్కినేని ఇంట వరుస పెళ్లి బాజాలు
అక్కినేని నాగచైతన్య గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నారు. ఆయన వివాహానికి కొద్ది రోజుల ముందే అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. దీందో ఇద్దరు అన్నదమ్ముల పెళ్లి ఒకే వేదికపై జరుగుతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. జూన్ 6వ తేదీన తెల్లవారుజామున అఖిల్, జైనబ్ మెడలో మూడు ముళ్లు వేశారు.