Sitaare Zameen Par Boycott : బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమా 'సితారే జమీన్ పర'కు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు #BoycottSitaareZameenPar అనే పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
'సితారే జమీన్ పర్' ట్రైలర్ విడుదల నేపథ్యంలోనే ఆమిర్ ఖాన్ పెట్టిన పోస్ట్ చర్చకు దారి తీసింది. భారత్ - పాక్ ఉద్రిక్తతల వేళ మౌనంగా ఉన్న ఆమీర్ ఖాన్, ఈ సినిమా ట్రైలర్ విడుదలకు కొన్ని గంటల ముందు 'ఆపరేషన్ సిందూర్' గురించి పోస్ట్ చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. 'ఎంతో కీలకమైన ఈ విషయం గురించి మీరు చాలా త్వరగా మాట్లాడారు కదా?' అని కామెంట్స్ పెట్టారు. సినిమా ప్రమోషన్స్ కోసమే ఆయన ఇప్పుడు స్పందించారన్నారు.
అయితే, ఆమిర్ ఖాన్ ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2022లో 'లాల్ సింగ్ చద్దా' సినిమాకి కూడా ఇలానే జరిగింది. 2020లో 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఖాన్ తుర్కియే ప్రథమ మహిళ ఎమినే ఎర్డోగన్‌ను కలిసినప్పటి వివాదం. ఆ సమయంలో అమిర్ ఆమెను కలవడం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఎందుకంటే తుర్కియే, భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. అప్పటి వివాదం ఇప్పుడు మళ్లీ మొదలైంది.
తుర్కియే-పాకిస్థాన్ సంబంధం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్‌పై ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఈ ఘటన తర్వాత పాక్-భారత మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తుర్కియే బహిరంగంగా పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చింది. పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నందున, భారత సోషల్ మీడియా వినియోగదారులు తుర్కియేకు సంబంధించిన ఎయిర్‌లైన్స్, ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునివ్వడం ప్రారంభించారు.
'లాల్ సింగ్ చడ్డా' తర్వాత ఆమిర్ ఖాన్ నటిస్తోన్న సినిమా ఇది. 2018లో విడుదలైన స్పానిష్ చిత్రం 'ఛాంపియన్స్'ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారు. దివ్య నిధి శర్మ కథ అందించగా, ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్నారు.