Pre Primary In Thirty Schools Per District : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 30 ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీ సెంటర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది. ప్రీ ప్రైమరీ(పూర్వ ప్రాథమిక విద్య) తరగతులను ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులు సుదీర్ఘంగా దీనిపై చర్చించారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సింటుంది? ఏ ఏ స్కూళ్లను ఎంపిక చేయాలి? ఇప్పుడు అంగన్‌వాడీ సెంటర్లో నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలో చర్చించారు.
తొలి దశలో జిల్లాకు 30 పాఠశాలల్లో : తొలి దశలో వచ్చే అకాడమిక్ ఇయర్ (2025-26) నుంచి జిల్లాకు 30 అంటే 33 జిల్లాలకు 990 ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఒక్కో దాంట్లో కనీసం 30 మంది పిల్లలకు ప్రవేశం కల్పిస్తారు. ఈనెల 15 లోపు ఆయా పాఠశాలలను మహిళా, శిశు సంక్షేమ శాఖ గుర్తించి సంబంధిత జాబితాను విద్యాశాఖకు అందజేయనుంది.
ప్రస్తుతం చిన్నారులకు అంగన్‌వాడీ టీచర్లు విద్యాబుద్ధులను నేర్పుతున్నారు. వారి విద్యార్హత ఇంటర్. దానికితోడు ఊళ్లోని వారే కావడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంగన్వాడీలకు పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ పంపినా ఒకటో తరగతికి వచ్చే సరికి ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టనున్న స్కూళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలను విద్యాశాఖ బలోపేతం చేయనుంది.
విద్యావలంటీర్లను నియమించేందుకు యోచన : ఇందుకోసం విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ యోచిస్తోంది. వారు ఇంటర్‌తోపాటు డీఈడీ(డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) చదివి ఉంటారు. ఇంకా టెట్(టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్) పాసై ఉంటారు. చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేరిట కిట్‌ను ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ కిట్‌లో బుక్స్‌తో పాటు టై, బొమ్మలు, బూట్లు లాంటివి ఉండొచ్చని సమాచారం. అంగన్వాడీల్లో చెప్పే టీచర్‌కు ట్యాబ్‌లు కూడా ఇస్తారు. సమగ్ర శిక్షా నిధులతో వాటని సమకూరుస్తారు. పిల్లలకు ఆట వస్తువులను కూడా విద్యాశాఖ తన నిధులతో ఇవ్వనుంది.
గుర్తింపు ఇస్తారా? : అంగన్‌వాడీ సెంటర్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రీ ప్రైమరీకి విద్యాశాఖ నుంచి గుర్తింపు లేనందువల్ల చిన్నారులకు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వరు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్లే స్కూళ్లకు లేదా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు ఏ శాఖ గుర్తింపు లేదు. ప్రస్తుతం విద్యాశాఖే ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తామని చెబుతున్నందున వయసు, అనుమతులు తదితర వాటిపై నియమ నిబంధనలు(రూల్స్‌ను) రూపొందిస్తుందా? గుర్తింపు ఇస్తుందా? అన్నది వేచిచూడాలి.
సర్కార్ కీలక నిర్ణయం - ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ!
అబ్బాయిలకు నిక్కర్లకు బదులు ప్యాంట్లు - ప్రభుత్వ పాఠశాలల్లోని ఆ తరగతి విద్యార్థులకు మాత్రమే!