ETV Bharat / education-and-career

సెల్​ఫోన్ల దెబ్బకు చదువులే కాదు, ఐక్యూ లెవల్స్ పడిపోతున్నాయ్!

ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​పైనే గడుపుతున్న ఈతరం - అధిక స్క్రీన్​టైమ్​తో నిద్రలేమి, డిప్రెషన్​ లాంటి సమస్యలు - మానవ మేధోశక్తిపై కూడా తీవ్ర ప్రభావం

Impact Of Excessive Screen Time on Humans
Impact Of Excessive Screen Time on Humans (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 27, 2025 at 7:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

Impact Of Excessive Screen Time on Humans : కొందరైతే ఎప్పుడు చూసినా స్మార్ట్‘ఫోన్‌లోనే తల’మునకలై ఉంటారు. సోషల్‌ మీడియాలో రీల్స్‌ని స్క్రోల్‌ చేస్తూ ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తోనే గడిపేస్తుంటారు. ఇలా అధికంగా స్క్రీన్‌టైమ్‌తో నిద్రలేమి, తద్వారా డిప్రెషన్ లాంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న విషయం విధితమే. అయితే, ఈ అలవాటు మనిషి మేధోశక్తి పైనా తీవ్ర ప్రభావం చూపుతూ ఐక్యూ లెవల్స్​ సైతం పడిపోతున్నట్లుగా తాజా పరిశోధనల్లో వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తున్నాయి.

ఏకాగ్రత లోపించడం, మెదడు పనితీరుపై ప్రభావం : ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవల మిషిగాన్ యూనివర్సిటీకి చెందిన ‘మానిటరింగ్‌ ది ఫ్యూచర్‌’ సర్వే నుంచి సేకరించిన డేటా ప్రకారం అధిక స్క్రీన్‌టైం ద్వారా టీనేజర్లు, యువకుల్లో కాగ్నిటివ్‌ సామర్థ్యంమనేది తగ్గుతున్నట్లుగా వెల్లడైంది. ఈ ప్రభావం ఒక్క మానవ మేధస్సు పైనే కాదు జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత లోపించడం, బేసిక్‌ రీజనింగ్‌ సామర్థ్యం దెబ్బతినడం లాంటి అనేక సమస్యలతో ఏకంగా మెదడు పనితీరులోనే మార్పులు వస్తున్నట్లుగా పేర్కొంది.

డిజిటల్​ స్క్రీన్​లకు అతుక్కుపోతున్న యువత : గతంలో బుక్స్​, చిన్న కథలను చదివే అలవాటు విపరీతంగా ఉండేది. కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌(స్మార్ట్​ఫోన్​) చేతిలోకి వచ్చాక ఆ పరిస్థితిలో తీవ్రమైన మార్పులొచ్చేశాయ్‌. ఇప్పుడు పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచేవారు క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి. యూఎస్‌లో నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ 2022లో జరిపిన అధ్యయనం ప్రకారం 2012లో 45శాతం మంది అమెరికన్లకు చిన్న కథలు, నవలలు చదివే అలవాటు ఉండేది. కానీ, 2021 నాటికి అది కాస్త 38శాతానికి తగ్గిపోయిందట. నేటి యూత్​ చదవడం, మానసికంగా ఉత్తేజితమయ్యే కార్యకలాపాల్లో పాల్గొనడం కన్నా డిజిటల్‌ స్క్రీన్‌లకు అతుక్కుపోవడం, మితిమిరీన స్క్రోలింగ్‌ వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ఇవీ ప్రతికూల ప్రభావాలు : రోజురోజుకీ మారుతోన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ మనిషి మెదడుకు శత్రువు అనుకోవాలా? అనే విషయాన్ని పరిశీలిస్తే సాంకేతికత మనిషి జీవితాన్ని ఎంతగానో సులభతరం చేసింది. కానీ, అదే సమయంలో సహజ మేధో సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ అనేక ప్రతికూల ప్రభావాలకు గురిచేస్తోందని మాత్రం చెప్పక తప్పదు. అధిక సమయం స్క్రీన్‌లకు అతుక్కుపోవడం ద్వారా మనిషి అంతకుముందు స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం ఇప్పుడు దెబ్బతింటుండటమనేది కలవరపెట్టే అంశం.

డిజిటల్‌ పరికరాలపై మానవుడు అధికంగా ఆధారపడటం వల్ల మెదడు పనితీరు తీవ్రంగా ప్రభావితమై లోతుగా ఆలోచించే, సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తు పెట్టుకొనే సామర్థ్యాన్ని కోల్పోతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రతిదీ ఒక స్వైప్ లేదా క్లిక్ దూరంలో ఉన్నప్పుడు మనం అంతగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయా విషయాలపై ఎక్కువగా ఆలోచించి గుర్తుపెట్టుకోవాల్సిన పనీ ఉండదు. తద్వారా సహజంగా మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం వల్ల మెదడు మొద్దుబారే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ట్రెండ్‌ అనేది కేవలం పాశ్చాత్య దేశాలు, అమెరికాలో మాత్రమే అనుకుంటే పరిపాటే.

అధ్యయనాల ప్రకారం : అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. 15 ఏళ్ల పిల్లలను పరీక్షించే గ్లోబల్ పిసా (ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్) స్కోర్‌లు దాదాపు 90 దేశాల్లో తగ్గుతున్నట్లుగా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో అనేక దేశాల్లో గతంతో పోల్చినట్లయితే గణితం, సైన్స్‌, రీడింగ్‌లలో తక్కువ స్కోర్‌లనేవి నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుక్​ రీడింగ్, లోతైన ఆలోచనలను సమష్టిగా పెంపొందించుకోవడంతో పాటు బోధనా పద్ధతులు, పనితీరులో మార్పులు చేయడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించే అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మీరు సెల్​ఫోన్​ అతిగా చూస్తున్నారా? - అయితే డూమ్‌ స్క్రోలింగ్‌ గురించి తెలుసుకోండి

మీ పిల్లలు స్మార్ట్​​ఫోన్లకు బందీ అవుతున్నారా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే బెటర్