ETV Bharat / education-and-career
తపాలాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు - ప్రతిభ చూపితే ఉపకారవేతనాలు
దీన్‌దయాళ్ స్పర్శ్ యోజనకు దరఖాస్తులు ఆహ్వానం - తపాలశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు - ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాది రూ.6000 ఉపకార వేతనం - ఈ నెల 13న తుదిగడువు

Published : September 3, 2025 at 7:14 PM IST
All About Deen Dayal Sparsh Yojana Scholarship : విద్యార్థులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తపాలా శాఖ ‘దీన్ దయాళ్ స్పర్శ్ యోజన’కు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి స్కాలర్షిప్లను అందజేయనున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 6-9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కీం కింద లబ్ధి పొందేందుకు అర్హులు. విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ (ఫిలాటలీ) అభిరుచిని(హ్యాబిట్)ను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదువులో ప్రతిభను చాటడంతో పాటు ఫిలాటలీని అభిరుచిగా కొనసాగిస్తున్న విద్యార్థులకు అర్హత పరీక్షను నిర్వహించి అందులో ప్రతిభను చాటిన వారికి స్కాలర్షిప్లను అందజేయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ యాజమాన్యాలకు చెందిన 1,926 ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2,38,024 మంది ఉన్నారు.
ఎవరు అర్హులంటే : దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్లను పొందడానికి 2024-25 అకాడమిక్ ఇయర్లో విద్యార్థులు వారు చదివిన తరగతుల్లో వార్షిక పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలు 55 శాతం, బీసీ, ఓసీలు 60 శాతం మార్కులను సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం (పిలాటలీ)తో కలిగే ఉపయోగాలకు సంబంధించి పోటీలను నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తులను పూర్తి చేసి సమీపంలోని తపాలా కార్యాలయంలో(పోస్టాఫీసులో) అందజేయాలి. విద్యార్థులు తపాలా కార్యాలయాల నుంచి దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీల దరఖాస్తు పత్రాలను పొందవచ్చు. విద్యార్థులు చదువుతున్న పాఠశాల హెడ్మాస్టర్ నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకొని పోస్టాఫీసుకు వెళ్లి రూ. 200 చెల్లించి ఫిలాటలీ డిపాజిట్ (పీడీ) ఖాతాను తీసుకోవాలి.
ఏవిధంగా ఎంపిక చేస్తారంటే? : దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ పరీక్షను రెండు దశల్లో(2 స్జేజ్ల్లో) నిర్వహించనున్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక్కో తరగతి నుంచి 10 మంది వంతున 40 మందిని స్కాలర్‌షిప్‌నకు ఎంపిక చేస్తారు. మొదటి దశ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 5 మార్కులు, చరిత్రకు 5, జాగ్రఫీకి 5, సైన్స్‌లో 5, క్రీడలు, సంస్కృతి, పర్సనాలిటీ అంశాలకు సంబంధించి 5 మార్కులు, లోకల్ ఫిలాటలీకి 10, నేషనల్ ఫిలాటలీకి 15 వంతున 50 మార్కులు కేటాయించారు. మొదటి దశలో ప్రతిభను చాటి ఎంపికైన విద్యార్థులను రెండో స్టేజ్‌కు ఎంపిక చేస్తారు. ఈ రెండో దశలో విద్యార్థులు ప్రాజెక్టును తయారు చేయాల్సి ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చే అంశాలపై ఉత్తమ ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులను ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు.
రూ.6 వేల ఉపకార వేతనం : పరీక్షలో ప్రతిభను చాటి ఎంపికైన విద్యార్థులకు ఏడాది పాటు నెలకు రూ.500 వంతున రూ.6 వేల స్కాలర్షిప్ను చెల్లిస్తారు. ఎంపికైన విద్యార్థుల పేరుతో ప్రత్యేకంగా సేవింగ్స్ అకౌంట్‌ను తెరిపించి ఉపకార వేతనాల నగదును ప్రతి నెలా జమ చేస్తారు. ఈ నెలాఖరున మొదటి దశ పరీక్ష నిర్వహించి అక్టోబరులో ఫలితాలను విడుదల చేస్తారు. అనంతరం రెండో దశ పోటీలకు అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు. తర్వాత ప్రాజెక్టును అక్టోబరు 30వ తేదీలోగా సమర్పించాలి. తుది ఫలితాలను డిసెంబరు నెలలో వెల్లడించనున్నారు. విద్యార్థులు ఈ పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ ఏఎంఓ షర్పుద్దీన్ తెలిపారు.
మొక్క నాటండి - నేషనల్ క్విజ్‌లో పాల్గొనండి
కేంద్ర ప్రతిభా పోటీలు : ఆన్లైన్లో పరీక్ష - పాసైతే నగదుతో పాటు ప్రతి నెలా స్కాలర్షిప్

