Polytechnic Diploma Courses Career Opportunities : పదో తరగతి తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో పాటు, చక్కని జాబ్‌ను ఆశించేవారు డిప్లొమా కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. వీటిని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అందిస్తున్నాయి. ఇటీవలే తెలంగాణలో సాంకేతిక విద్య శిక్షణ సంస్థలు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్)-2025 కు సంబంధించిన ప్రకటనలు విడుదల చేశాయి.
సులువుగా ఉపాధి మార్గాలు పొందాలనుకునే వారికోసం : పదో తరగతి పాస్ అయిన వారు, ప్రస్తుతం పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నవారు పాలిసెట్‌కు(డిప్లొమాలో ప్రవేశాలకు అర్హత పరీక్ష) దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పట్టున్నవారు పరీక్షలో రాణించగలరు. సీటు పొందడం సులువే అయినప్పటికీ మేటి విద్యాసంస్థల్లో, కోరిన బ్రాంచీలో చేరేందుకు ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో, పరిమిత వ్యవధిలో, సులువుగా ఉపాధి పొందాలనుకునేవారికి పాలిటెక్నిక్ డిప్లొమాలనేవి చాలా మంచి ఆప్షన్.
ఇవీ కోర్సులు : ప్రస్తుత కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందుతోన్న ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్(ఏఐఅండ్ఎంఎల్), కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్‌వర్కింగ్, వెబ్ డిజైనింగ్, 3డీ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీ మీడియా టెక్నాలజీ కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లొమాలో భాగంగా అందిస్తున్నారు.
ఇంకా ఏమేం కోర్సులున్నాయంటే : సివిల్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్,, కంప్యూటర్, మెటలర్జికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్,పెట్రో కెమికల్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ ఇలా 30కిపైగా బ్రాంచీలను తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలల్లో 3 ఏళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.
ఏయే ఉద్యోగాలు? : మహారత్న, నవరత్న, మినీరత్న, ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూలు) డిప్లొమాతో ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నారు. రైల్వేల్లో జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టులకు ఈ డిప్లొమాతో పోటీపడవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) జేఈ ఉద్యోగాలకూ వీరు కూడా అర్హులే. రాష్ట్ర స్థాయిలో విద్యుత్తు పంపిణీ సంస్థలు, రహదారులు, భవనాలు పంచాయతీరాజ్, నీటిపారుదల తదితర శాఖల్లో డిప్లొమాతో పుష్కలమైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
ప్రైవేటు రంగంలో : ఆటోమొబైల్, ఫార్మా కంపెనీలు, పవర్ ప్లాంట్లు,నిర్మాణ పరిశ్రమ, ఇంజినీరింగ్ సంస్థల్లో వీరు సులువుగానే నిలదొక్కుకోవచ్చు. రైల్వేలో లోకో పైలట్ ఉద్యోగాలకు కొన్ని బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు కూడా పోటీపడొచ్చు. భారత వైమానిక దళంలో ఎక్స్, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్ పోస్టులకు డిప్లొమాతో పోటీ పడవచ్చు. అనుభవం, తగిన నైపుణ్యాలు ఉన్నవారు సింగపూర్, మలేసియా, దుబాయ్, యూఏఈ లాంటి దేశాల్లో అవకాశాలు పొందుతున్నారు.
పాలిసెట్ పరీక్ష విధానం : పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఏపీ పాలీసెట్‌లో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగిటివ్ మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 2 గంటలు. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి పదో తరగతి సిలబస్ ప్రకారం ప్రశ్నలు వస్తాయి. తెలంగాణ పాలిసెట్‌తో రెగ్యులర్ పాలిటెక్నిక్ కోర్సులతోపాటు అగ్రికల్చర్ డిప్లొమాలు, వెటర్నరీ అండ్ హార్టికల్చర్ డిప్లొమాల్లోకి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? : ఆన్‌లైన్ విధానంలో
- ఫైన్ లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 19
- అప్లికేషన్ ఫీజు : ఎస్సీ, ఎస్టీలకు రూ.250. మిగిలిన అందరికీ రూ.500.
- పరీక్ష తేదీ: మే 13
- అధికారిక వెబ్‌సైట్ : https://polycet.sbtet.telangana.gov.in/#!/index
కొత్తగా ఉద్యోగంలో చేరారా? - ఈ టిప్స్ పాటిస్తే ప్రమోషన్ పక్కా!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - పీజీ చేస్తూ బ్యాంక్ జాబ్ ట్రైనింగ్!