Job Opportunities With Journalism Courses : జర్నలిజం పీజీ రెండో సంవత్సరం చదువుతూ, వచ్చే ఏడాది బీఈడీ/ఎల్‌ఎల్‌బీల్లో ఏ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు బాగుంటాయా అనే అనుమానంతో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ కథనం.
మీరు ప్రస్తుతం చదువుతున్న జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హతతో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. జర్నలిజంలో ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచుకుంటే మీడియా సంస్థల్లో, డిజిటల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్, కంటెంట్ రైటింగ్ రంగాల్లో ఉపాధి లభిస్తుంది. మీకు జర్నలిజం ఆధారిత ఉద్యోగం ఇష్టం లేకపోతే ప్రత్యామ్నాయ కోర్సుల గురించి ఆలోచించడం మంచిది అంటున్నారు నిపుణులు.
ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తుల్లో మీకేది ఇష్టం? ఏ రంగంలో మీరు సంతోషంగా ఉంటారు? బోధన నైపుణ్యాలున్నాయా? న్యాయవాద వృత్తిలో రాణించడానికి అవసరమైన సూక్ష్మ పరిశీలన, వాదనా పటిమ, తార్కికంగా ఆలోచించగలిగే సామర్థ్యాలు ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోతే జీవితకాలం ప్రైవేటుగా పనిచేయగలరా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేయడం మంచిది.
- ఎల్‌ఎల్‌బీ చేస్తే జ్యుడీషియల్ సర్వీసెస్, లీగల్ అడ్వైజర్, నోటరీ, ప్రభుత్వ రంగ/ ప్రైవేటు సంస్థల్లో పనిచేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం పొందలేనట్లయితే లాయర్‌గా ప్రాక్టీస్ చేసుకొనే వెసులుబాటుంది.
- భావప్రకటన సామర్థ్యం, ఓపిక, వినగలిగే నైపుణ్యం, విశ్లేషణ, రాత నైపుణ్యం, న్యాయ చట్టాల అవగాహన, ఆత్మవిశ్వాసం, ప్రశ్నించే సామర్థ్యం, నైతికత, నిబద్ధత, నెట్‌వర్కింగ్, సమయ నిర్వహణ లాంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. న్యాయవాదిగా రాణించాలంటే చాలా పోటీని తట్టుకోవాలి.
- బోధన నైపుణ్యాలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్, ప్రేరణ, సాంకేతిక పరిజ్ఞానం, నైతికత, సహనం లాంటి లక్షణాలుంటే బోధన రంగంలో రాణించవచ్చు. బీఈడీ విద్యార్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలుంటాయి.
- ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రాకపోతే ప్రైవేటు, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో కూడా బోధనావకాశాలు పొందవచ్చు. మీకు బోధనపై ఆసక్తి ఉంటే జర్నలిజంలో పీహెచ్‌డీ చేసి, జర్నలిజం విభాగంలో అధ్యాపకుడిగా స్థిరపడవచ్చు. ఎల్‌ఎల్‌బీ తరవాత, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ చేసి న్యాయ కళాశాలల్లో అధ్యాపక వృత్తి చేపట్టవచ్చు.
జర్నలిజం, ఎల్‌ఎల్‌బీ, బీఎడ్ ఈ కోర్సులు అన్నీ ఉపాధికి అవకాశం ఉన్నవే. ఆసక్తి, నైపుణ్యాలు ఉన్న రంగంలో స్థిరపడటానికి అవసరమైన కోర్సు చదివే ప్రయత్నం చేయండని కెరియర్ కౌన్సెలర్ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వివరించారు.
ఇంటర్లో బైపీసీ చేశారా? - ఆ తరువాత ఏ కోర్సుల్లో చేరడం బెస్ట్ !