Top 8 Govt Jobs With Big Salaries : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలా మంది కల. మనదేశంలో నేటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు అత్యంత ఆదరణ ఉంది. సర్కారీ నౌకరీల కోసం లక్షలాది మంది ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. డబ్బులు ఖర్చుపెట్టి కోచింగ్‌లు సైతం తీసుకుంటారు. ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగ భద్రతే గవర్నమెంట్ జాబ్‌కు ఇంతటి క్రేజ్‌ను సాధించిపెడుతోంది. జీతం, నివాస వసతి, వైద్య సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాలు ఆకర్షణీయంగానే ఉంటాయి. మనదేశంలో భారీగా జీతం లభించే టాప్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగాలు, వాటి వేతనాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ సివిల్ సర్వీసులు
ఎక్కువ జీతం, సామాజిక ప్రతిష్ఠ, అధికార శక్తి ఇవి మూడూ కావాలా? అయితే మీరు ఇండియన్ సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధం కావాలి. దీనికి సంబంధించిన పరీక్షలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఏటా నిర్వహిస్తోంది. అభ్యర్థులకు నిర్దిష్ట వయోపరిమితి ఉంటుంది. వివిధ దశల్లో జరిగే అన్ని పరీక్షల్లోనూ అత్యుత్తమంగా రాణించే వారినే సివిల్ సర్వీసులకు ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లను కేటాయిస్తారు. భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో సివిల్ సర్వీసు అధికారులే కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వాల విధానాల రూపకల్పనలో చక్రం తిప్పేది వీరే. కెరీర్ ఆరంభంలోనే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నెలవారీ జీతం రూ.56,100 వరకు ఉంటుంది. కెరీర్ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ వేతనం క్రమంగా పెరుగుతూపోతుంది. టాప్ ర్యాంకుకు చేరాక నెలవారీ వేతనం గరిష్ఠంగా దాదాపు రూ.2.50 లక్షల వరకు పెరుగుతుంది.
జ్యుడీషియల్ సర్వీసులు
మన దేశంలో న్యాయవ్యవస్థ అత్యున్నతమైంది. ఇందులోని వివిధ విభాగాల్లో సేవలు అందించే వారికి మంచి గౌరవం, విలువ లభిస్తాయి. లా కోర్సు పూర్తి చేసిన వారు జూనియర్ సివిల్ జడ్జి, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లుగా అవకాశాలను పొందొచ్చు. వీటి భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఏటా వెలువడుతుంటాయి. అయితే పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో భారీ పోటీ ఏర్పడుతుంటుంది. ఉద్యోగ భద్రత, ఉదారంగా సెలవులు, పదవీ విరమణ ప్రయోజనాలు, అధికారిక క్వార్టర్లు వంటివి ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వారికి లభిస్తాయి. కెరీర్ ఆరంభంలో ప్రతినెలా రూ.28వేల నుంచి రూ.45వేల దాకా వేతనం లభిస్తుంది. నిర్దిష్ట పే స్కేల్ ప్రకారం వేతనం క్రమంగా పెరుగుతుంది. కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), ఇతర భత్యాలు కూడా లభిస్తాయి. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కెరీర్ ఆరంభంలో ప్రతినెలా రూ.30వేల నుంచి రూ.45వేల దాకా శాలరీ అందుతుంది. అనుభవం బాగా పెరిగిన తర్వాత గరిష్ఠంగా రూ.13 లక్షల దాకా వార్షిక ప్యాకేజీని అందుకుంటారు.
రక్షణ సర్వీసులు
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో సేవలు అందించే అధికారులు భారత రక్షణ సర్వీసుల పరిధిలోకి వస్తారు. త్రివిధ దళాల్లో లెఫ్టినెంట్ హోదాలో కెరీర్‌ను ప్రారంభించే వారికి ప్రతినెలా రూ.56,100 దాకా జీతం ఇస్తారు. ర్యాంకు, అనుభవం, సామర్థ్యం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది. కెరీర్‌లో పతాక స్థాయికి చేరిన తర్వాత వీరికి ప్రతినెలా రూ.1.50 లక్షల దాకా జీతం లభిస్తుంది. నెలవారీ జీతంతో పాటు వివిధ భత్యాలు, పింఛను, ఉచిత నివాస వసతి మొదలైనవి లభిస్తాయి.
ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). ఇందులో గ్రేడ్-బీ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా క్రేజ్ ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే ప్రతినెలా రూ.55,200 దాకా శాలరీ లభిస్తుంది. మంచి ఇంక్రిమెంట్లు, వివిధ భత్యాలు కూడా ఇస్తారు. కాస్త సీనియర్ అయ్యాక నెలవారీ జీతం రూ.1 లక్ష దాకా చేరుతుంది. ఉద్యోగ భద్రత ఉంటుంది. కెరీర్‌లో ఉన్నత హోదాలు పొందే దిశగా బాటలు పడతాయి.
ప్రభుత్వ కాలేజీ లెక్చరర్/ప్రొఫెసర్
ఒకవేళ మీరు పుస్తకాల పురుగైతే తప్పకుండా ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్ లేదా ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి గౌరవంతో పాటు ఆకర్షణీయమైన వేతనం, చక్కటి పని-జీవన సమతుల్యత లభిస్తాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ప్రభుత్వ లెక్చరర్ లేదా ప్రొఫెసర్ నెలవారీ వేతనం రూ.57,700 దాకా ఉండాలి. అనుభవం, పదోన్నతులతో కాలక్రమంలో ఈ నెలవారీ వేతనం రూ.1.44 లక్షల దాకా చేరుతుంది.
ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసులు
ఐఈఎస్ అంటే ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసులు. వీటికి ఎంపికయ్యే వారికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో టెక్నికల్, మేనేజ్‌మెంట్ హోదాలు లభించే అవకాశం లభిస్తుంది. ఆయా విభాగాల్లో సరికొత్త సాంకేతికతలను వినియోగంలోకి తేవడంలో, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మెరుగుపర్చడంలో ఐఈఎస్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. కెరీర్ ఆరంభంలో వీరి నెలవారీ వేతనం రూ.56,100 దాకా ఉంటుంది. దాదాపుగా సివిల్ సర్వీసు అధికారుల రేంజులోనే వీరి శాలరీలు కూడా ఉంటాయి.
డీఆర్‌డీఓ, ఇస్రోలలో సైంటిస్టులు, ఇంజినీర్లు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లు విశ్వ విఖ్యాతిని గడించాయి. భారత ప్రభుత్వం ఈ రెండు సంస్థలకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాముఖ్యతని ఇస్తుంటుంది. డీఆర్‌డీఓ అనేది భారతదేశ సేనలకు అవసరమైన అధునాతన టెక్నాలజీలను తయారు చేసి అందిస్తుంటుంది. ఇస్రో అనేది భారత్ తరఫున అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు చేస్తుంటుంది. వీటిలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సహా మరెన్నో టెక్నికల్ పోస్టులు భర్తీ అవుతుంటాయి. వీటికి ఎంపికయ్యే వారికి ఎల్-10 పే స్కేల్‌ను అమలు చేస్తారు. కెరీర్ ఆరంభంలో ప్రతినెలా రూ.56,100 దాకా శాలరీ ఇస్తారు. ఇతర భత్యాలతో పాటు నివాస వసతి, వాహన వసతి వంటివి లభిస్తాయి.
పీఎస్‌యూలలో ఎగ్జిక్యూటివ్‌లు
మనదేశంలో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఇండియన్ ఆయిల్, భెల్ వంటి ఎన్నో ప్రఖ్యాత ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూలు) ఉన్నాయి. కనీసం వాటిలో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాన్ని పొందినా జాక్ పాట్ కొట్టినట్టే. మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వ రంగ సంస్థలు భర్తీ చేస్తుంటాయి. వీటికి ఎంపికైతే నివాస వసతి, రవాణా వసతి, పింఛన్ ప్రయోజనం, కరువు భత్యం(డీఏ) వంటివన్నీ లభిస్తాయి. కెరీర్ ఆరంభంలో ప్రతినెలా రూ.25వేల నుంచి రూ.50వేల దాకా జీతం ఇస్తారు. సీనియారిటీ పొందాక నెలవారీ జీతం రూ.1 లక్ష వరకు పెరుగుతుంది.
యాభై సార్లు రక్తం ఎక్కించుకుని - ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
ఇండియన్ నావల్ అకాడమిలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు - ఎంపికైతే రూ.లక్షల్లో జీతం