ETV Bharat / education-and-career
వాయిదా అలవాటు నుంచి బయటపడాలని అనుకుంటున్నారా? – ఆచరణలో పెట్టాల్సిన మార్గదర్శకాలు ఇవే!
వాయిదా అలవాటును వాయిదా వేయకుండా - సమయ నిర్వహణతో సరిగ్గా ఎలా చదువుకోవాలంటే? -

Published : September 15, 2025 at 9:58 AM IST
How to Study Properly With Time Management : మనం చదవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. వాటిని క్రమ పద్ధతిలో నేర్చుకోవాలని చక్కని ప్రణాళిక కూడా వేసుకుంటాము. కానీ దాన్ని కచ్చితంగా అమలు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూనే ఉంటాం. వాస్తవానికి సక్రమంగా నేర్చుకోవడానికి ఉండే ప్రధానమైన ఆటంకం వాయిదా వేయడమేనని ప్రధానంగా చెప్పుకోవచ్చు.
చేయాల్సిన పనులను నేడు, రేపూ అంటూ గడువు తేదీ వరకూ వాయిదా వేయడం, ఆ తరువాత చదవడానికి టైం లేదని కంగారు పడటం మనలో చాలామంది చేసే పని ఇదే. దీనివల్ల చివరి నిమిషంలో విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అవరోధంగా మారుతున్న పరిస్థితులు, అందుకు కారణాలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒత్తిడిని అధిగమిస్తేనే : ఒక పనిని వెంటనే మొదలుపట్టడానికైనా, రోజుల తరబడి వాయిదాలు వేస్తూ వెళ్లడానికైనా ఒక కారణం అంటూ ఉంటుంది. కాబట్టి ముందుగా అసలైన కారణాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేయాలి. సాధారణంగా విపరీతమైన ఒత్తిడికి గురికావడం, లేదా సరైన ప్రేరణ లేకపోవడం వల్ల చేయాల్సిన పనులను వాయిదా వేస్తుంటాం. ఒత్తిడిని ఎంత త్వరగా అధిగమిస్తే అంత త్వరగా వాయిదాల నుంచి బయటపడవచ్చు.
దశల వారీగా పూర్తి చేసే ప్రయత్నం : ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని సాధించడం పెద్ద సమస్యగా కనిపిస్తుంది. అలాంటప్పుడు పెద్ద లక్ష్యాన్ని చిన్నగా విభజించుకుని దాన్ని దశల వారీగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక దశను విజయవంతంగా పూర్తి చేసిన సంతోషంలో మరోదాన్ని వెంటనే ప్రారంభించే అవకాశం ఉంటుంది.
ఆలోచనలకే పరిమితం కాకూడదు : ఏ పనిని అయినా పూర్తి చేయడమనేది ప్రధానం కాదు. నిర్ణీత గడువులోగా చేశామా లేదా అనేది చాలా ముఖ్యం. అందుకే కచ్చితమైన గడువును తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా కానప్పుడు నేడు, రేపు అంటూ వాయిదాలు వేస్తూనే ఉంటాం. అలాగే లక్ష్యాలు ఎప్పుడూ ఆలోచనలకే పరిమితం కాకూడదు. నిజానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
సెల్ ఫోన్‌ను దూరంగా ఉంచండి : చదవడానికి ఎవరైనా సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాన్నే ఎంచుకుంటారు. అయితే ఇలాంటప్పుడు సెల్ ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకోవడం మంచిది. నోటిఫికేషన్లు రావడం వల్ల దృష్టి వాటి మీదకు మళ్లే అవకాశం ఉంది. అలాగే చదువుదామని కూర్చున్న టైంలోనే సరదాగా బయటకు వెళదామని స్నేహితులు కాల్ చేయవచ్చు. ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టుకుని మరో రూమ్లో ఉంచడం ఉత్తమం. చదవడం పూర్తైన తరువాత ఎవరి నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వచ్చిందీ చూసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశం అస్సలు ఉండదు.
వివరంగా జాబితాను తయారు చేసుకోవాలి : చదవాల్సినవి ఎన్నో ఉన్నా వాటిలో వెంటనే చదవాల్సినవి కొన్నే ఉంటాయి. మరికొన్నింటిని కొన్ని రోజుల తరువాత చదివినా ప్రమాదం ఉండే అవకాశం ఉండదు. అలాంటి సమయంలో వివరంగా జాబితాను తయారు చేసుకోవాలి. అలాగే ప్రొడక్టవిటీ, టైమర్లు యాప్‌లను వాడటం వల్ల దారి తప్పకుండా ఉండే అవకాశం ఉంది. టైం వృథా కాకుండా అనుకున్న సమయానికే పనులను పూర్తి చేయగలుగుతారు.
అరగంటసేపు విరామం : ఏకధాటిగా కొన్ని గంటల పాటు చదవడం వల్ల క్రమంగా ఆసక్తి ఉండకపోవచ్చు. విసిగిపోవడం వల్ల కొన్నింటిని మర్నాటికి వాయిదా వేసే అవకాశం లేకపోలేదు. అరగంటసేపు చదివిన తరువాత చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. దీనివల్ల అలసట, విసుగు దరిచేరకుండా పునరుత్తేజంతో చదవగలుగుతారు.
సరైన సమయం : విద్యార్థులందరికీ చదివే టైం ఒకే విధంగా ఉండదు. కొందరు రాత్రంతా మేల్కొని చదవగలుగుతారు గానీ తెల్లవారు జామున లేచి చదవలేరు. మరికొందరు వేకువ జామునే లేవగలరు గానీ రాత్రి ఎక్కువ సేపు మెలకువగా ఉండలేరు. కాబట్టి ఎవరికి అనువైన టైంని వాళ్లు ఎంచుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.
ఇలాంటి మెలకువలు పాటిస్తే వాయిదా అలవాటును నియంత్రించుకోవటం సులువు అవుతుంది!
విద్యార్థులు రూ.12వేల స్కాలర్షిప్ పొందే అవకాశం - ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో ప్రతిభ చూపితే చాలు!
తపాలాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు - ప్రతిభ చూపితే ఉపకారవేతనాలు

