Tips for High Salary Jobs : ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. కాలంతో పోటీ పడుతోన్న సాంకేతిక విప్లవం ఉద్యోగ మార్కెట్ దశ, దిశను నిర్దేశిస్తోంది. దీంతో మార్కెట్ అవసరాల్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకొంటూ తగిన నైపుణ్యాలు నేర్చుకున్నవారే కెరీర్‌లో ముందుకుపోతున్నారు. నేటి ఉద్యోగ మార్కెట్లో విపరీతమైన పోటీని సైతం తట్టుకొని ఐటీ కంపెనీల్లో ఆకర్షణీయమైన వార్షిక వేతన ప్యాకేజీలతో జాబ్ లు సాధిస్తున్నారు. ఐతే, ఇది అంత తేలికైన విషయం కాదు. వ్యూహాత్మక ప్రణాళిక, నిరంతరం తమను తాము అప్‌డేట్ చేసుకోగలిగే నేర్పుతోనే సాధ్యమని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం నిపుణులు సూచిస్తున్న కొన్ని చిట్కాలు
- మూస పద్ధతులకు ఎప్పుడో కాలం పోయింది. ఏ రంగంలోనైనా నలుగురిలా కాకుండా వైవిధ్యంగా, కళాత్మకతతో చేసే పని వారికి మంచి గుర్తింపు వస్తోంది. నిరంతర అధ్యయనం, నూతన నైపుణ్యాలు నేర్చుకుంటేనే సృజనాత్మకంగా ఆలోచించగలరు. ఐటీ రంగంలో పని చేసేవారైతే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం చాలా అవసరం. అందువల్ల ఈ రంగంలో ఎక్కువ వేతనంతో ఉద్యోగం సాధించాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్న క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి ట్రెండింగ్ సాంకేతిక టెక్నాలజీలతో పాటు ప్రోగ్రామింగ్ భాషల్లో ప్రావీణ్యత సాధించడంపై ఫోకస్ పెట్టాల్సిందే.
- మీరు ఏ రంగంలోనైతే పని చేయాలనుకొంటున్నారో దానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రస్తుతం మీరు పని చేస్తున్న చోట స్వీకరించిన సవాళ్లు వంటివి మీ ప్రొఫైల్‌ను మరింత సమర్థంగా మారుస్తాయి. అలాగే, పలు ఈవెంట్‌లకు హాజరుకావడం, నిపుణులతో సంబంధాలను కొనసాగించడం వంటివి మీ నెట్‌వర్క్‌ను పెంచడమే కాదు మీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. తద్వారా మీ అవకాశాలు మరింతగా పెరిగేందుకు దోహదపడతాయి.
- ఏ జాబ్ లోనైనా టీమ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రధానం. ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకోవడం ద్వారా పని చేసే ప్రదేశంలో మీ బలం పెరుగుతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించే సామర్థ్యం, టీమ్‌ను లీడ్ చేయగలగడం, ఏదైనా అంశాన్ని నలుగురికీ కమ్యూనికేట్ చేసి అవసరం అయితే దానిపై చర్చించడం వంటి స్కిల్స్ మీ కెరీర్‌కు ఓ ఇంధనంలా పని చేస్తాయి.
- మీ రెజ్యుమెను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. ఎప్పటికప్పుడు మీరు నేర్చుకొనే నైపుణ్యాలు, సాధించిన విజయాలు మీ ప్రొఫైల్‌కు ఆకర్షణీయతను తీసుకొస్తాయి. దీనికి తోడు మీలో ఉన్న స్కిల్స్ ప్రదర్శించడం ద్వారా రెజ్యుమెను చూడగానే సదరు కంపెనీకి మీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంటర్యూకు సంబంధించిన ప్రిపరేషన్ బాగా చేయాలి. కేవలం టెక్నికల్ అంశాలపైనే కాకుండా బిహేవియరల్ ప్రశ్నలు మీ విశ్వాసాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి.
- మీరు పని చేయాలనుకొనే రంగంలో కొత్త ట్రెండ్స్ ఏం వస్తున్నాయో గమనించాలి. అందుకు కోర్సులను నేర్చుకోవడం, తగ్గ నైపుణ్యాలు, సర్టిఫికెట్లు పొందడం వంటి అలవాట్లు మీ కెరీర్‌ను మరింత ప్రకాశమంతంగా తీర్చిదిద్దుతాయి. మీరు అప్‌డేట్‌గా ఉంటేనే జాబ్ మార్కెట్లో పోటీని తట్టుకోగలిగే కెపాసిటీ మీ సొంతం అమవుతుంది.
ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్ టాప్- దేశంలో ఆ పరిస్థితి ఉన్నా ఆగని జాబ్ పోస్టింగ్స్!