CDSE Exam Notification 2025 : రక్షణ రంగంలో మేటి ఉద్యోగాలు ఆశించేవారూ, సాధారణ డిగ్రీతో అత్యున్నత ఉద్యోగాన్ని పొందాలనుకునేవారూ రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో సీడీఎస్‌ఈ(కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్) ఒకటి. ఇందులో విజయవంతమైనవారు ప్రతి నెలా స్టైపెండ్‌ను అందుకుంటూ శిక్షణ పొందవచ్చు. ఆ వెంటనే లెవెల్-10 హోదాతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025(2) ప్రకటన ఇటీవలే వెలువడింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సి) ఏడాదికి 2 సార్లు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) అవివాహిత పట్టభద్రులకు చాలా చక్కని అవకాశం. నిబద్ధతతో కృషిచేస్తే కొన్ని ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకోవచ్చు. గత రిజల్ట్స్ ప్రకారం పరీక్ష, ఇంటర్వ్యూలలో 45 శాతం మార్కులు పొందినవారు తప్పనిసరిగా ఏదో ఒక సర్వీసుకు సెలక్ట్ అవుతున్నారు.
పరీక్షలో : పేపర్‌కు 100 మార్కులు చొప్పున ఇంగ్లిష్, జి.కె, మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. గణితంలో 100, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ఆన్సర్ తప్పైతే ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. ఎగ్జామ్‌లో అర్హత సాధించేందుకు ప్రతి పేపర్‌లోనూ కనీస మార్కులు (20 లేదా 25 శాతం) పొందాల్సి ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్ పేపర్ రాయాల్సిన అవసరం లేదు. అర్హత మార్కులు పొంది మెరిట్‌లో ఉన్నవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇంటర్వ్యూ : పరీక్షతో సమానంగా ఇంటర్వ్యూ విభాగానికీ 300 మార్కులుంటాయి. ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారికి ఈ విభాగం 200 మార్కులకు ఉంటుంది. 5 రోజులపాటు కొనసాగే ముఖాముఖిలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో అర్హత సాధిస్తేనే సెకండ్ స్టేజ్‌కు అనుమతిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు(మెడికల్ ఎగ్జామినేషన్) నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్ ప్రాతిపదికన ట్రైనింగ్‌లోకి తీసుకుంటారు.
శిక్షణ : ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ) వీటిలో ఏ విభాగంలో చేరినప్పటికీ శిక్షణా కాలంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ను చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి సెలక్టయిన వాళ్లకు ఇండియన్ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్‌లో 18 నెలల పాటు శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలల పాటు కేరళలోని ఎజిమాలలో ట్రైనింగ్ నిర్వహిస్తారు. ఎయిర్ ఫోర్స్(వైమానిక) అకాడెమీకి ఎంపికైనవారికి 18 నెలల పాటు పైలట్ శిక్షణ బీదర్, ఎలహంక, హాకీంపేట ప్రాంతాల్లో ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో 11 నెలలు పాటు శిక్షణలో పాల్గొంటారు.
ఉద్యోగంలో : ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది. పేర్లలో తేడా ఉన్నప్పటికీ ఈ మూడూ సమాన హోదా (లెవెల్ 10) కొలువులే. వీరికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. మిలిటరీ సర్వీస్ పే కింద అదనంగా రూ.15,500 కూడా చెల్లిస్తారు. పైలట్లకు రూ.25 వేలు ఫ్లయింగ్ అలవెన్సు అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతభత్యాలను అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సంబంధిత విభాగాలకు అత్యున్నతాధికారి, త్రివిధ దళాలకు అధిపతీ కావచ్చు.
ముఖ్య వివరాలు : ఖాళీలు: 453. విభాగాల వారీ.. ఐఎంఏ-100 ఖాళీలు, ఐఎన్‌ఏ-26 ఖాళీలు, ఏఎఫ్‌ఏ-32 ఖాళీలు, ఓటీఏ మెన్ -276 ఖాళీలు, ఓటీఏ విమెన్ -19 ఖాళీలు.
విద్యార్హత: మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉంటే చాలు. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు బీఈ/బీటెక్(ఇంజినీరింగ్) అవసరం. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
వయసు: ఇండియన్ మిలిటరీ అకాడెమీ(ఐఎంఏ), నేవల్ అకాడెమీలకు(ఐఎన్‌ఏ) జులై 2, 2002 - జులై 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు. ఎయిర్ ఫోర్స్ అకాడెమీ పోస్టులకు జులై 2, 2002 - జులై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయసులో 2 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జులై 2, 2001 - జులై 1, 2007 మధ్య జన్మించినవారు కూడా అర్హులు.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 17.06.2025
అప్లికేషన్ ఫీజు : రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
పరీక్ష తేదీ : 14.09.2025
వెబ్‌సైట్ : https://upsconline.nic.in/
ఉచిత విద్యతో పాటు ఉన్నత ఉద్యోగం కావాలా? - ఎన్డీఏ పరీక్షతో మీ కల సాకారం!
స్పోర్ట్స్ కోటాలో CISF హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు - అప్లై చేశారా?