Preparing for Exams Again : పరీక్షల్లో విఫలమైతే, ఆశించిన మార్కులు రాకపోతే ఆ పరిస్థితి ఎంత దుర్భరంగా, అవమానకరంగా, బాధగా ఉంటుందో మీకేం తెలుసు? నలుగురిలో తలెత్తుకు తిరగలేకపోతున్నాం. అందరూ మమ్మల్నే వేలెత్తి చూపిస్తున్నట్టు, వెక్కిరిస్తున్నట్టుగా ఎంత బాధగా ఉంటుందో చెప్పలేం. ఇలా అనుకునేవాళ్లలో మీరూ ఉన్నారా! అయితే కచ్చితంగా ఇది మీరు చూడాల్సిందే.
ఇలాంటి సందర్భాల్లోనే బాధపడుతూ కూర్చోకుండా నిజాయతీగా మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో వాటిని తెలుసుకోవాలి. దాంతో ఇలాంటి జీవితంలో ప్రతికూల ఫలితాలు భవిష్యత్తులో తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభిస్తుంది.
- ఎందుకిలా జరిగిందని కారణాలను అన్వేషిస్తూ, అదే పనిగా నిరంతరం దాన్నే ఆలోచిస్తూ, సమయాన్ని అస్సలు వృథా చేయకూడదు. ప్రతికూలమైనటువంటి ఫలితం ఎలాగూ వచ్చింది. కాబట్టి ఇక దాన్నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన మీదే మీ దృష్టిని కేంద్రీకరించాలి.
- కొందరి విషయంలో తీవ్రమైన భయమే ఓటమికి అసలు కారణమవుతుంది. అలాంటివాళ్లు అర్థంకానీ సబ్జెక్టు విషయంలో భయపడుతూ కూర్చుంటారు గానీ చదివి దాని తలకెక్కించుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయరు.
- మీ బలాలు, బలహీనతల గురించి మీ కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు అవగాహన ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ల సలహాలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే మీరు ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో ఎక్కడెక్కడ స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవాలో తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
- ఒంటరిగా కూర్చుని విపరీతంగా కుమిలిపోవడం, బాధపడటం వల్ల ప్రతికూల ఆలోచనలు మరింత ఎక్కువై ఇబ్బందిపడతారు. సాధ్యమైనంత వరకూ నలుగురిలో ఉండటానికే ప్రయత్నం చేయాలి.
- చదువుకునే రూమ్‌లో అనవసర వస్తువులను పూర్తిగా తొలగించాలి. గాలి, వెలుతురు ఉండి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనసుకు ఆహ్లాదకరంగా, తృప్తిగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో కూర్చుని ఎంతసేపు చదివినా అలసటగా అనే ఫీలింగ్ ఉండదు.
- మళ్లీ పరీక్షలకు సిద్దమయ్యేప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నాలను కొనసాగించాలి. అనుకూల ఫలితాలు వచ్చినట్టు, అందరూ మిమ్మల్ని అభినందిస్తున్నట్టు ఊహించుకుని ముందుకు సాగాలి.
- ప్రతికూల ఆలోచనలు, వాయిదా వేయడం, బద్ధకం, సమయాన్ని వృథా చేయడం లాంటి చెడ్డ అలవాట్ల వల్లే పరీక్షల్లో విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని వదిలేస్తే భవిష్యత్తులో ఓటమి మీ దరిచేరదు.
- ఎన్నోసార్లు విఫలమై, మళ్లీ మళ్లీ వారి ప్రయత్నాలను కొనసాగించినవారెందరో ఉన్నారు. వాళ్లందరినీ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలి.
పరీక్షలో ఆశించిన మార్కులు రాలేదనో, ఫెయిలయ్యామనో కొందరు విద్యార్థులు అనాలోచితంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను అంతులేని దుఃఖంలో ముంచేస్తున్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చోని ఆలోచించాలి. జీవితం అన్నిటికంటే చాలా విలువైంది. దాన్ని గెలుపు బాట పట్టించడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తుంచుకోవాలి!
పది తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? - కోర్సు ఎంపిక కోసం ఈ టిప్స్ మీ కోసమే