Zomato Name Change Eternal : ప్రముఖ ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీ జొమాటో (Zomato) తన కార్పొరేట్ నేమ్‌ని ఎటర్నల్(Eternal)గా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని కంపెనీ బోర్డు గురువారం ఆమోదించింది. అయితే పేరు మార్పుకు ఇప్పటికీ వాటాదారులు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర నియంత్రణ అధికారుల ఆమోదం అవసరం. కార్పొరేట్ నేమ్ మారినప్పటికీ, జొమాటో ఫుడ్ డెలివరీ బ్రాండ్, యాప్ అదే పేరుతో కొనసాగుతాయి. అంటే ఆన్‌లైన్‌లో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు జొమాటో పేరునే చూస్తారు.
జొమాటో సీఈఓ కీలక ప్రకటన
దీనికి సంబంధించి జొమాటో వ్యవస్థాపకులు, సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో- 'ఈరోజు మా బోర్డు ఈ మార్పునకు ఆమోదం తెలిపింది. పేరు మార్పునకు మద్దతు ఇవ్వాలని మా వాటాదారులను కూడా అభ్యర్థిస్తున్నాను. అందరి ఆమోదం లభించాక మా కార్పొరేట్ వెబ్‌సైట్ zomato.com నుంచి eternal.comకి మారుతుంది. మేము మా స్టాక్ టిక్కర్‌ను కూడా మారుస్తాం' అని తెలిపారు.
ఎటర్నల్ ఇప్పుడు జొమాటో కిందనున్న వివిధ వ్యాపారాలను చూసుకుంటుంది. దీని కింద జొమాటో (ఫుడ్ డెలివరీ సర్వీస్), బ్లింకిట్ (క్విక్ గ్రాసరీ డెలివరీ), డిస్ట్రిక్ట్ (బిజినెస్ వివరాలు ఇంకా వెల్లడించలేదు), హైపర్‌ప్యూర్ (రెస్టారెంట్‌లకు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ సరఫరా చేస్తుంది) లిస్ట్ అయి ఉంటాయి.
పేరు ఎందుకు మార్చారు?
జోమాటో ర్యాపిడ్ గ్రోసరీ డెలివరీ సర్వీస్ బ్లింకిట్‌ని కొనుగోలు చేయడం వల్ల కంపెనీ పేరు మార్చే ఆలోచన ప్రారంభమైందని గోయల్ పేర్కొన్నారు. బ్లింకిట్‌ని కొనుగోలు చేసినప్పుడు, కంపెనీ, బ్రాండ్/యాప్ మధ్య తేడాను గుర్తించడానికి అంతర్గతంగా ఎటర్నల్ (జోమాటోకు బదులుగా) ఉపయోగించడం ప్రారంభించామని తెలిపారు. జొమాటోకి మించి ఏదైనా మా భవిష్యత్తుకు కీలకంగా మారిన రోజు కంపెనీని ఎటర్నల్‌గా పబ్లిక్‌గా మార్చాలని కూడా అనుకున్నామని చెప్పారు. ఈ రోజు బ్లింకిట్‌తో మేము ఆ స్థాయికి చేరుకున్నామని భావిస్తున్నామని, అందుకే కంపెనీ పేరు మారుస్తున్నామని వివరించారు.