ETV Bharat / business

చైనాపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్- భారత్​కు గోల్డెన్ ఛాన్స్- ఇక మనదే 'బొమ్మల' రాజ్యం!

చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు- గోల్డెన్ ఛాన్స్​ను వినియోగించుకునేందుకు భారత్​ బొమ్మల ఎగుమతిదారులు సిద్ధం!

Indian Toy Industry US Market
Indian Toy Industry US Market (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : April 20, 2025 at 5:02 PM IST

1 Min Read
Choose ETV Bharat

Indian Toy Industry US Market : చైనా దిగుమతులపై అమెరికా విధించిన అధిక సుంకాల నుంచి వచ్చే సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భారతదేశ బొమ్మల ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనా వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ విధానాలవైపు చూస్తున్న అమెరికా కొనుగోలుదారుల ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు యూఎస్ మార్కెట్‌కు ఎగుమతి చేసే సామర్థ్యం ఉన్న సుమారు 40 సంస్థలను టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది.

ప్రస్తుతం సుమారు 20 కంపెనీలు అమెరికన్ మార్కెట్‌కు పెద్దమొత్తంలో బొమ్మలను ఎగుమతి చేస్తున్నాయని అధ్యక్షుడు అజయ్ అగర్వాల్ తాజాగా మీడియాకు తెలిపారు. "గత నెలలో యూఎస్ ఆధారిత బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు ఎంక్వైరీలు వచ్చాయి. యూఎస్ నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ కొన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదించాయి. వారి అవసరాలను తీర్చగల పరికరాల తయారీదారుల కోసం చూస్తున్నాం" అని అజయ్ అగర్వాల్ తెలిపారు.

అమెరికా మార్కెట్లో మన బొమ్మల ఉనికిని పెంచుకోవచ్చు!
"యూఎస్​లో బొమ్మలకు పెద్ద మార్కెట్ ఉంది. అలాంటిది చైనా ఇప్పుడు అధిక సుంకాలకు లోనైతే భారత్​కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే మన దేశానికి చెందిన 20 కంపెనీలు అమెరికాకు పెద్దమొత్తంలో బొమ్మలు ఎగుమతి చేస్తున్నాయి. ఇతర దేశాల కంటే తక్కువ రేట్లు ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే అమెరికా మార్కెట్లో మన బొమ్మల ఉనికిని పెంచుకోవచ్చు" అని అజయ్ అగర్వాల్ తెలిపారు.

భారతీయ బొమ్మల తయారీదారులకు సువర్ణావకాశం!
అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న తయారీదారులతో అసోసియేషన్ అతి త్వరలో ఒక సెమినార్ నిర్వహిస్తోందని చెప్పారు. ఇది భారతీయ బొమ్మల తయారీదారులకు సువర్ణావకాశమని, ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల మార్కెట్ అని ఆయన అన్నారు. ప్రభుత్వ మద్దతుతో దేశీయ బొమ్మల పరిశ్రమ తన ఎగుమతులను పెంచుకోగలదని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1 శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు.