US Tariffs Effect On Global Trade : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సంకాల వల్ల ప్రపంచ వాణిజ్యం 3 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త కోక్-హామిల్టన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్య యుద్ధం వల్ల ఎగుమతులు (ఎక్స్‌పోర్ట్స్) అమెరికా, చైనా మార్కెట్ల నుంచి భారత్, కెనడా, బ్రెజిల్‌కు మారే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ గతవారం వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. దీనితో గ్లోబల్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన కాస్త వెనక్కు తగ్గారు. ఒక్క చైనా మినహా మిగతా దేశాలకు 90 రోజుల పాటు ఈ అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ట్రంప్ బెదిరింపులకు చైనా ఏమాత్రం లొంగలేదు. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125 శాతానికి పెంచింది. దీనితో రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ఉద్ధృతం అయ్యింది.
"ట్రంప్ వాణిజ్య విధానాలు, ఆర్థిక ఏకీకరణ వల్ల గణనీయమైన దీర్ఘకాలిక మార్పులు రావచ్చు. ప్రపంచ వాణిజ్యం 3 శాతం వరకు తగ్గవచ్చు."
- కోక్-హామిల్టన్, ఇంటర్నేషన్ ట్రేడ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
'ఉదాహరణకు మెక్సికో నుంచి అయ్యే ఎగుమతులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. యూఎస్, చైనా, యూరప్ సహా లాటిన్ అమెరికన్ దేశాలు కూడా దెబ్బతింటాయి. కానీ దీని వల్ల కెనడా, బ్రెజిల్, కొంత వరకు భారత్ లాభపడే అవకాశం ఉంటుంది. అదే విధంగా వియత్నాం ఎగుమతులు అమెరికా, మెక్సికో, చైనా నుంచి మళ్లించబడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా మార్కెట్లు (MENA), ఈయూ, కొరియాలకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది' అని ఆమె అన్నారు.
వస్త్ర పరిశ్రమను ఉదహరిస్తూ కోక్ హామిల్టన్ ఓ ఆసక్తికర అంశాన్ని చెప్పారు. 'అభివృద్ధి చెందుతున్న దేశాలకు, వాటి ఆర్థిక కార్యకలాపాలకు, ఉపాధికి వస్త్ర పరిశ్రమ ఎంతో కీలకం. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వస్త్రాల ఎగుమతిదారుగా బంగ్లాదేశ్ ఉంది. ట్రంప్ ఆ దేశంపై 37 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. ఇదే కనుక అమల్లోకి వస్తే 2029 నాటికి అమెరికాకు వార్షిక ఎగుమతుల్లో 3.3 బిలియన్ డాలర్ల నష్టం వస్తుంది.'
ముందస్తు ప్రణాళిక అవసరం
'కొవిడ్ లాంటి సంక్షోభాలు, వాతావరణ విపత్తులు, ప్రపంచ ఆర్థిక విధానాల్లో ఆకస్మిక మార్పులు లాంటివి అభివృద్ధి చెందుతున్న దేశాలను దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి సడెన్ షాక్‌లను తట్టుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు దీర్ఘకాలిక ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని కోక్-హామిల్టన్ సూచించారు. ఇందుకోసం వైవిధ్యీకరణ, విలువ జోడింపు, ప్రాంతీయ ఏకీకరణ అనే మూడింటికి ప్రాధాన్యత ఇవ్వాలని' ఆమె అన్నారు.
ప్రపంచ జీడీపీ తగ్గే ఛాన్స్!
'ట్రంప్ 90 రోజుల టారిఫ్ రిలీఫ్ ఇవ్వడానికి ముందు, చైనా-అమెరికాపై అదనపు సుంకాలు విధించక ముందు, ఫ్రెంచ్ ఆర్థిక పరిశోధన సంస్థ (CEPII) కొన్ని ప్రాథమిక అంచనాలు వేసింది. దీని ప్రకారం, 2040 నాటికి ఈ ప్రతీకార సుంకాల ప్రభావం వల్ల ప్రపంచ జీడీపీ .07 శాతం తగ్గవచ్చని అంచనా వేసిందని' కోక్-హామిల్టన్ తెలిపారు. రివెంజ్ టారిఫ్‌ల వల్ల అమెరికాతోపాటు మెక్సికో, చైనా, థాయిలాండ్ సహా దక్షిణాఫ్రికా దేశాలు కూడా బాగా ప్రభావితం అవుతాయని ఆమె చెప్పారు.
మరో వైపు చైనా కూడా ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. ట్రంప్ తమపై 145 శాతానికి సుంకాలు పెంచితే, తాము కూడా తగ్గేది లేదంటూ, అమెరికా ఉత్పత్తులపై చైనా 125 శాతానికి సుంకాలను పెంచింది. కానీ ఇది చివరి దశకు చేరుకుందని చైనా అంగీకరించింది. ఒకవేళ అమెరికా మళ్లీ ఏదైనా కవ్వింపు చర్యలు చేపడితే, దానిని ఎదుర్కొనేందుకు తమ వద్ద మరిన్ని సాధనాలు ఉన్నాయని చైనా చెబుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు రెండూ ఈ విధంగా వాణిజ్య యుద్ధానికి దిగడం వల్ల, వాటి మధ్య దాదాపు అన్ని ఉత్పత్తుల వాణిజ్యం ఆగిపోయే అవకాశం ఉందని కోక్-హామిల్టన్ అభిప్రాయపడ్డారు.
ఎంత కాలం ఇలా?
'ఈ ప్రతీకార సుంకాలు ఎంత కాలం అమలులో ఉంటాయనేది ఇప్పుడు అసలు ప్రశ్న. అయితే ఏదో ఒక సమయంలో అమెరికా, చైనాలు ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని తప్పక గుర్తిస్తాయి' అని కోక్-హామిల్టన్ అన్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ ఈ వాణిజ్య యుద్ధాన్ని ఆయన గాలికి వదిలిలేయడం లేదని ఏఎస్‌పీఐ అంతర్జాతీయ భద్రత, దౌత్య ఉపాధ్యక్షుడు డేనియల్ రస్సెల్ అన్నారు. 'బీజింగ్ సుంకాల ఆట నుంచి వైదోలుగుతోంది. ట్రంప్‌తో వాణిజ్య యుద్ధ చేసి గెలవాలని చైనా అనుకోవడం లేదు. బదులుగా దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనం కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తమ ఆర్థిక వ్యవస్థలో బఫర్ స్టాక్‌లను పెంచుకోవడం, దౌత్యపరంగా తన పలుకుబడిని విస్తరించడం, అమెరికా మిత్రదేశాలపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా బీజింగ్ పనిచేస్తోంది. ట్రంప్ తన మిత్రదేశాలను, భాగస్వాములను తీవ్రంగా విమర్శిస్తూ దూరం చేసుకుంటూ ఉంటే, జిన్‌పింగ్ ఆగ్నేయాసియాలో పర్యటిస్తూ తన ఆర్థిక సంబంధాలను పెంచుకునే పనిలో ఉన్నారు' అని రస్సెల్ పేర్కొన్నారు.
అమెరికా-చైనా ట్రేడ్ వార్తో భారత్‌కు లాభం - ఎలాగంటే?
ట్రంప్ రివెంజ్ టారిఫ్‌లకు బ్రేక్- 90 రోజుల తాత్కాలిక ఊరట- చైనాతో మాత్రం ఢీ