Mark Zuckerberg To Sell Instagram : టెక్ దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు చిక్కులు ఎదురయ్యాయి. వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ను విక్రయించేలా మెటా అధినేత జుకర్‌బర్గ్‌ను యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ బలవంతం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. సామాజిక మాధ్యమ రంగంలో పోటీ లేకుండా చేసుకునేందుకు వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలు చేసేందనే అభియోగాలను మెటా సంస్థ ఎదుర్కొంటోంది. వాటిపై నేటి నుంచి అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్‌ను ఎదుర్కోబోతోంది.
గుత్తాధిపత్యం కోసం
అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ్టి (సోమవారం) నుంచి 37 రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది. మెటాపై యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (USFTC) ప్రశ్నల వర్షం కురిపించనుంది. మార్కెట్లో గుత్తాధిపత్యం ఆరోపణలపై విచారణ జరపనుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ ను విక్రయించాలని కంపెనీపై ఎఫ్‌టీసీ ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పోటీని తొలగించడానికి దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ను మెటా కొనుగోలు చేసిందని ఎఫ్‌టీసీ ఆరోపించింది. సామాజిక మాధ్యమ రంగంలో ఏకఛత్రాధిపత్యం కోసం ఆ కంపెనీ ప్రయత్నించిందని దుయ్యబట్టింది. ఈ సందర్భంగా కొన్ని అంతర్గత మెయిల్స్‌ను కమిషన్ ప్రస్తావించింది. అందులో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ఈ-మెయిల్ కూడా ఉంది. పోటీ పడడం కంటే వాటిని కొనుగోలు చేయడమే ఉత్తమమని జుకర్‌బర్గ్ ఆ సందేశంలో పేర్కొన్నారని, దాన్ని బట్టి వారి వ్యూహం ఏంటో అర్థమవుతోందని కమిషన్ వ్యాఖ్యానించింది. పర్సనల్ సోషల్ నెట్‌వర్కింగ్ సేవల్లో మెటాకు గుత్తాధిపత్యం ఉందా? లేదా? అనే అంశాన్ని మొదట కమిషన్ నిర్ణయించనుంది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మెటా
మరోవైపు ఎఫ్‌టీసీ విచారణపై మెటా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ కంపెనీ పెట్టుబడులు పెట్టకుంటే, ఆ యాప్స్‌నకు ఇంత ఆదరణ వచ్చేది కాదని మెటా న్యాయవాది తమ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు మెటాకు వ్యతిరేకంగా వస్తే కమిషన్ తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఫలితంగా మెటా- ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ను విక్రయించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ పరిణామాలు టెక్ ఇండస్ట్రీని కుదిపేస్తాయని పేర్కొంటున్నారు. ఆర్థికంగానూ మెటాకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఈ కంపెనీ ఆదాయంలో 50శాతం ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.