Adani Hindenburg Row : అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బెర్గ్ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ గ్రూప్‌తో సంబంధం ఉన్న 310 మిలియన్ డాలర్ల స్విస్ ఖాతాలను అక్కడి ప్రభుత్వం జప్తు చేసిందంటూ హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అయితే వీటిని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధార వార్తలని తెలిపింది. కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది. వాటిని ఖండిస్తున్నామని చెప్పింది.
అదానీ గ్రూప్‌తో సంబంధముందని చెబుతున్న కంపెనీలపై చేపట్టిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఆరు స్విస్ ఖాతాల్లోని 310 మిలియన్ డాలర్ల (రూ.2,600 కోట్ల)కు పైగా నిధులను జప్తు చేసిందని స్విస్ వార్తా సంస్థ 'గోథమ్ సిటీ' తన కథనంలో పేర్కొంది. ఆ కథనానికి సంబంధించిన లింక్‌ను హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ), మారిషస్, బెర్ముడా వంటి పన్ను తక్కువగా ఉండే దేశాల్లోని ఆఫ్‌షోర్ ఫండ్‌లలో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈ సంస్థలే 2021లో అదానీ షేర్లలో పెట్టుబడులు పెట్టాయని దర్యాప్తు వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొందని హిండెన్‌బర్గ్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ వివాదాస్పదమైంది.
ఈ క్రమంలోనే హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. "ఆ నిరాధార ఆరోపణలను మేం నిస్సందేహంగా తిరస్కరిస్తున్నాం. అదానీ గ్రూప్ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ స్విస్ కోర్టు విచారణనూ ఎదుర్కోవడం లేదు. మా కంపెనీ ఖాతాలపై ఏ అధికారులు కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవట్లేదు. ఆ కథనంలో పేర్కొన్న ఉత్తర్వుల్లో కూడా మా గ్రూప్ కంపెనీల గురించి స్విస్ కోర్టు ప్రస్తావించలేదు" అని స్పష్టం చేసింది.
కుట్రపూరితంగానే ఆరోపణలు
"ఖాతాలకు సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. మా విదేశీ ఖాతాలు పారదర్శకమైనవి. చట్టాలకు అనుగుణంగా మేం వాటిని నిర్వహిస్తున్నాం" అని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు అసంబద్ధం, అహేతుకమైనవి అని అదానీ గ్రూప్ తమ ప్రకటనలో పేర్కొంది. తమ కంపెనీ పరువుకు భంగం కలిగించేందుకు కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది.