Stock Market Today 11th April 2025 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. డొనాల్డ్ ట్రంప్ చైనా మినహా మిగతా దేశాలకు 90 రోజుల పాటు టారిఫ్‌ల నుంచి రిలీఫ్ ఇవ్వడం, ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడమే ఇందుకు కారణం.
అమెరికన్ ప్రభుత్వం భారత్‌పై విధించిన 26 శాతం ప్రతీకార సుంకాలను ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే జులై 9 వరకు ఈ అదనపు సుంకాల బెడద తప్పుతుంది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లకు మంచి జోష్ అందించింది. దీనితో సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతం మేర లాభపడ్డాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1310 పాయింట్లు లాభపడి 75,157 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 429 పాయింట్లు వృద్ధి చెంది 22,828 వద్ద స్థిరపడింది.
- లాభపడిన షేర్లు : టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, రిలయన్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, టైటాన్
- నష్టపోయిన షేర్లు : ఏసియన్ పెయింట్స్, టీసీఎస్
గ్లోబల్ మార్కెట్స్
అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదరింది. అమెరికా ఉత్పత్తులపై 125 శాతం మేర సుంకాలు పెంచుతూ చైనా తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనితో గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఏసియన్ మార్కెట్లలో టోక్యోకు చెందిన నిక్కీ 225 ఇండెక్స్, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ నష్టపోయాయి. షాంఘై ఎస్‌ఎస్‌ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ మాత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం రూ.4,358 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. గురువారం శ్రీ మహవీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయిన సంగతి తెలిసిందే.
రూపాయి విలువ
శుక్రవారం రూపాయి విలువ 61 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.86.07గా ఉంది.
ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.32 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 63.53 డాలర్లుగా ఉంది.