Stock Market Investment Tips : స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో మార్కెట్లు స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద ఆవిరైపోతూ ఉంటుంది. కొన్ని రోజులకు మళ్లీ భారీ లాభాలు సంపాదించి పెడుతుంది. కనుక స్టాక్ మార్కెట్లో ఇలాంటి ఒడుదొడుకులు చాలా సహజం. అయితే ఇటీవలి కాలంలో మన దేశంలో చిన్న, మధ్య స్థాయి షేర్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ ఇవి ఏమాత్రం సహేతుకమైన రీతిలో పెరగడం లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఈ బుడగలు పేలితే, చిన్న మదుపరులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి!
స్టాక్ మార్కెట్లు చాలా అస్థిరంగా ఉంటాయి. కనుక పెట్టుబడిదారుల్లో భయాందోళనలు చెలరేగడం సహజం. పైగా స్టాక్ మార్కెట్లో నిత్యం పలు రకాల వదంతులు వ్యాపిస్తూనే ఉంటాయి. అయితే వీటిని ఆధారంగా చేసుకుని, మీ పెట్టుబడి నిర్ణయాలను తీసుకోకూడదు.
కొంత మంది ఆన్లైన్లో, యూట్యూబ్ ఛానళ్లలో ఆర్థిక నిపుణులమని చెప్పుకునే నకిలీ వ్యక్తుల విశ్లేషణలు విని, అత్యాశకు లేదా ఆందోళనకు గురవుతుంటారు. ఫలితంగా కొందరు అత్యాశతో రిస్క్ ఎక్కువ ఉన్న షేర్లలో పెట్టుబడులు పెడతారు. మరికొందరు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుని, భారీగా నష్టపోతూ ఉంటారు. అందుకే ఫేక్ వ్యక్తుల విశ్లేషణలను మీరు నమ్మకూడదు. సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్స్ సలహాలు మాత్రమే తీసుకోవాలి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు లాంటివి మీ దగ్గరున్న నగదు విలువను తగ్గిస్తాయి. అందుకే మీ డబ్బులు పెట్టుబడుల రూపంలో ఉంచాలి. అప్పుడే మంచి లాభాలు సంపాదించడానికి వీలవుతుంది. షేర్ మార్కెట్లను అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. వీటిని ఎవరూ నియంత్రించలేరు. కనుక పెట్టుబడుల విలువ తగ్గిపోగానే ఆందోళన చెందకూడదు. మీకు వచ్చిన సమాచారం ఎంత మేరకు సరైనదో, కాదో సరిచూసుకోవాలి. మార్కెట్లు పడిపోతున్నప్పుడు పెట్టుబడుల విలువ తగ్గడం సహజమనే విషయాన్ని తెలుసుకోవాలి. దీనికి తగ్గట్టుగా మీ ప్రణాళికలను వేసుకోవాలి.
2. దీర్ఘకాల పెట్టుబడులు
మీ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. వాటిని సాధించే వరకు పెట్టుబడులు కొనసాగిస్తూ ఉండాలి. చాలా మంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. ఇది సరికాదు. మార్కెట్లో ఎంత ఎక్కువ కాలం కొనసాగితే, నష్టభయం అంత తగ్గుతుంది. రాబడీ కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. క్రమానుగుత పెట్టుబడి విధానం (సిప్) పద్ధతిలో మదుపు చేస్తుంటే, మార్కెట్లో హెచ్చతగ్గులు వచ్చినా, దీర్ఘకాలంలో సగటు ప్రయోజనం పొందడానికి వీలవుతుంది.
3. పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలి!
నష్టభయం తగ్గాలంటే, మీ పెట్టుబడులను ఒకే చోట కాకుండా, పలు పథకాలకు కేటాయించాలి. రిస్క్, రివార్డ్ అధికంగా ఉండే పథకాలతోపాటు, సురక్షిత పథకాల్లోనూ మదుపు చేయాలి. అంటే ఈక్విటీ ఆధారిత పెట్టుబడులే కాకుండా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల లాంటి స్థిరాదాయ పథకాలను కూడా ఎంచుకోవాలి. అలాగే బంగారంపై కూడా 5-10 శాతం వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఇలా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ చూసుకుంటే, నష్టభయం తగ్గి, దీర్ఘకాలంలో మంచి లాభాలు సంపాదించే అవకాశం పెరుగుతుంది.
4. సమీక్షిస్తూ ఉండాలి!
పెట్టుబడులు పెట్టడమే కాదు, వాటిని తరచూ సమీక్షిస్తూ ఉండాలి. పనితీరు బాగాలేని పథకాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి. ఫండమెంటల్స్ బాగా ఉన్న పథకాల్లో పెట్టుబడులను కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను సమతౌల్యం చేసుకోవాలి.
మంచి యాజమాన్యం, పనితీరు బాగున్న సంస్థల షేర్లను తక్కువ ధరకు అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేయాలి. అప్పుడే మార్కెట్లు మళ్లీ పుంజుకున్నప్పుడు మీకు మంచి లాభాలు చేకూరుతాయి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
షేర్ మార్కెట్‌పై పూర్తి అవగాహన, ఎప్పటికప్పుడు పరిశీలించే సమయం ఉన్నప్పుడు మాత్రమే నేరుగా షేర్లలో పెట్టుబడులు పెట్టాలి. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
5. పెన్నీ స్టాక్స్ అతిగా కొనవద్దు!
చిన్న, మధ్య తరహా షేర్ల ధరలు కొంత కాలంగా బాగా పెరుగుతున్నాయి. కానీ ఈ పెరుగుదల ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదని సెబీ మదుపరులను హెచ్చరించింది. కనుక మదుపరులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీ మొత్తం పెట్టుబడిలో 15-20 శాతానికి మించి మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టకూడదు. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు రకాల తీసుకుంటే, స్టాక్ మార్కెట్లో మంచి రాబడులు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో వీటిని కారులో ఉంచొద్దు - చాలా ప్రమాదకరం!
నెలవారీ ఆదాయం కావాలా? పోస్టాఫీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.9వేలు ఇన్కమ్ పక్కా!