Rs26 Lakhs Awarded To Employee : ఏ సంస్థ అయినా ఉద్యోగి పనిచేస్తేనే శాలరీ ఇస్తుంది. కానీ ఓ ఉద్యోగి ఒక్కరోజు పనిచేయకున్నా కంపెనీ నుంచి 4 నెలల 18 రోజుల శాలరీని అందుకున్నాడు. ఈ విధంగా అతగాడికి రూ.26 లక్షలు (ఇండియన్ కరెన్సీలో లెక్కిస్తే) లభించాయి. ఇంతకీ పనిచేయని ఉద్యోగికి శాలరీ ఎందుకు ఇచ్చారు? కంపెనీ ఎందుకలా చేసింది? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
అగ్రిమెంటు కాలంలోనూ ఉద్యోగం కరువు
ఓ వ్యక్తికి యూఏఈలోని అబుదాబిలో ఉన్న ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.1.69 లక్షల శాలరీ. 2024 నవంబరు 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు ఉద్యోగంలో పనిచేసేందుకు సదరు అభ్యర్థి, కంపెనీ మధ్య ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్టు జరిగింది. ఈ ఐదు నెలల వ్యవధిలో నెలకు రూ.1.69 లక్షలు చొప్పున మొత్తం రూ.5.65 లక్షల శాలరీ ఇచ్చేందుకు కంపెనీ ఒప్పుకుంది. అగ్రిమెంటు అమలు సమయం మొదలైపోయింది. అయినా ఉద్యోగంలో చేరమని కంపెనీ నుంచి ఉద్యోగికి కబురు అందలేదు. చాలా సార్లు కంపెనీని సదరు అభ్యర్థి సంప్రదించినా, ఉద్యోగం చేసేందుకు రమ్మనే ఆహ్వానం లభించలేదు.
అభ్యర్థి వాదన ఇదే!
దీంతో ఆందోళనకు గురైన అభ్యర్థి ఆ కంపెనీపై అబుదాబిలోని ఓ కోర్టులో దావా వేశాడు. అగ్రిమెంట్ కాలానికి సంబంధించిన శాలరీని కంపెనీ తనకు ఇవ్వడం లేదంటూ వాదనలు వినిపించాడు. తాను 8 రోజులే సెలవులో ఉన్నానని కోర్టుకు చెప్పాడు. మిగతా అన్ని రోజుల్లోనూ తాను ఉద్యోగం చేయడానికి సిద్ధంగానే ఉన్నా, కంపెనీయే వినియోగించుకోలేదని అభ్యర్థి ఆరోపించాడు. ఐదు నెలల పాటు పనిని కల్పిస్తామనే ఒప్పందాన్ని కుదుర్చుకొని మరీ, తనకు ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించలేదని వాపోయాడు.
కంపెనీ ఏం చెప్పింది!
కంపెనీ తన వాదనలు వినిపిస్తూ, సదరు అభ్యర్థి లీవ్ తీసుకున్నాడని, ఎన్నడూ విధులకు హాజరు కానేలేదని కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనకు బలాన్ని చేకూర్చే రికార్డులను కానీ, డాక్యుమెంట్లను కానీ కోర్టుకు కంపెనీ సమర్పించలేకపోయింది. ఆ అభ్యర్థి విధులకు గైర్హాజరు కావడంపై కంపెనీ కనీస విచారణ కూడా చేయించలేదని కోర్టు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కంపెనీ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. అగ్రిమెంట్ అమలులో కంపెనీయే విఫలమైందని స్పష్టం చేసింది. ఆ సంస్థ వేతన నివేదికలు, కాంట్రాక్టు ప్రతులు, కేస్ ఫైల్‌ల పరిశీలనలోనూ ఇదే అంశాన్ని గుర్తించామని తేల్చి చెప్పింది. కంపెనీ వల్ల వంచనకు గురైన ఉద్యోగికి 4 నెలల 18 రోజుల పని దినాలకుగానూ రూ.26 లక్షల శాలరీని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 8 రోజులు సెలవులు తీసుకున్నానని అభ్యర్థి స్వయంగా ఒప్పుకున్నాడు. దీంతో ఆ పనిదినాలను మినహాయించి, రూ.26 లక్షల శాలరీని చెల్లించాలని కంపెనీకి కోర్టు నిర్దేశించింది.
అగ్రిమెంటు వ్యవధిలో వేతనాన్ని ఎవరూ ఆపలేరు
ఉద్యోగిని రిక్రూట్ చేసుకున్నాక, విధుల్లోకి తీసుకోవడంలో జాప్యం చేయడం అనేది 2021 ఫెడరల్ డిక్రీ లా నంబర్ 33 ప్రకారం చట్ట విరుద్ధమని అబుదాబి కోర్టు పేర్కొంది. అగ్రిమెంట్ అమల్లోకి వచ్చాక, ఆ వ్యవధిలో వేతనాన్ని పొందే హక్కు ఉద్యోగికి వస్తుందని కోర్టు తెలిపింది. స్వయంగా ఉద్యోగే తనకు ఇక కంపెనీతో సంబంధం లేదని ప్రకటిస్తే తప్ప, అతడి వేతనాలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేసింది.
కొత్తగా జాబ్లో చేరారా? ఈ బేసిక్ రైట్స్ గురించి తెలుసుకోవడం మస్ట్!
Lay Off Compensation For Employees : ఉద్యోగం నుంచి తొలగించారా?.. ఈ పరిహారాలు మాత్రం వదులుకోకండి!