ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలా? 5 గోల్డెన్ పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ ఇవిగో!
ఆర్థిక భవిష్యత్‌పై లెక్కలు వేసుకుంటున్నారా ? అప్పులు, పెట్టుబడులు, కొనుగోలు శక్తి గురించి ఆలోచిస్తున్నారా ? అయితే ఈ 5 రూల్స్ తెలుసుకోండి

Published : June 19, 2025 at 11:16 PM IST
Personal Finance Rules : రెక్కల గుర్రం లాంటి ద్రవ్యోల్బణానికి కళ్లెం పడుతోంది. మనదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తాజాగా ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సామాన్య ప్రజలకు ఇదొక గొప్ప వార్త. మరోవైపు దేశీయ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ సానుకూల పరిణామాల నడుమ సమర్ధమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం 5 చక్కటి రూల్స్‌ను ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడుల అంచనాల రూపకల్పన, వాటి వృద్ధి, అప్పుల నిర్వహణ వంటి వ్యవహారాలను సులభంగా చక్కబెట్టుకోవడానికి ఈ ఐదు రూల్స్ బాగా ఉపయోగపడతాయి.
1.రూల్ ఆఫ్ 72 : డబ్బులు డబుల్
డబ్బులు డబుల్ కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందరికీ ఆ కోరిక ఉంటుంది. ఇది నెరవేరే లెక్క తెలియాలంటే రూల్ ఆఫ్ 72 గురించి తెలుసుకోవాలి. మన పెట్టుబడి ఎంతకాలంలో డబుల్ అవుతుందో ఈ రూల్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలా అంటే.. మీ డబ్బులు డబుల్ కావడానికి ఎంత వార్షిక వడ్డీరేటు అవసరమో తొలుత తెలుసుకోండి. ఉదాహరణకు ప్రస్తుతం 8 శాతం వార్షిక వడ్డీరేటుతో డబ్బులు డబుల్ కావడానికి దాదాపు 9 సంవత్సరాల టైం పడుతుంది. 72తో వార్షిక వడ్డీరేటును భాగిస్తే ఎన్నేళ్లలో డబ్బులు డబుల్ అవుతాయో వెంటనే తెలిసిపోతుంది. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతుంది. ఆ ప్రభావాన్ని తట్టుకుంటూ పెట్టుబడి ఎంతమేర పెరుగుతుందనే అంచనాకు రావడానికి ఈ రూల్ బాగా దోహదపడుతుంది.
2. 100 మైనస్ ఏజ్
పెట్టుబడి పోర్ట్‌ఫోలియో అనేది మన ఆర్థిక సామర్థ్యాన్ని, ఆదాయ స్థాయిని బట్టి నిర్మితమవుతుంది. మన పేరుపై ఉన్న వివిధ రకాల పెట్టుబడి సాధనాలన్నీ పోర్ట్‌ఫోలియోలో అంతర్గత భాగంగా ఉంటాయి. షేర్లు (ఈక్విటీలు), మూచువల్ ఫండ్లు, బాండ్లు వంటివన్నీ పెట్టుబడి సాధనాలే. ‘‘100 మైనస్ ఏజ్’’ ఫార్ములా ద్వారా మన పోర్ట్‌ఫోలియోలో ఎంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించాలో తెలుసుకోవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం.. 100 నుంచి మీ వయసును మైనస్ చేయండి. మైనస్ చేశాక ఎంత విలువ మిగులుతుందో అంత శాతం మేర ఈక్విటీలను మీరు కలిగి ఉండొచ్చన్న మాట. ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు 30 ఏళ్లు అనుకుందాం. 100 నుంచి 30ని మైనస్ చేస్తే 70 మిగులుతుంది. అంటే మీరు 70 శాతం మేర ఈక్విటీలను కలిగి ఉండొచ్చు. మిగతా 30 శాతం మేర బాండ్లు, డిబెంచర్లు వంటివి కలిగి ఉండొచ్చు.
3. 40 శాతం ఈఎంఐ రూల్
మనలో చాలామంది ప్రతినెలా ఈఎంఐలను చెల్లిస్తుంటారు. శాలరీ పడగానే అందులో కొంత భాగాన్ని ఈఎంఐ పేమెంట్ కోసం వదిలేస్తుంటారు. కొంతమందికైతే ఇలాంటి ఈఎంఐలు పెద్దసంఖ్యలో ఉంటాయి. దీంతో ప్రతినెలా వాటిని కట్టేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఒక వ్యక్తి నెలవారీ నికర ఆదాయం (నెట్ ఇన్‌కమ్)లో ఈఎంఐలు అనేవి 40 శాతానికి మించకూడదని అంటారు. ఈ రూల్ ప్రకారం ఎవరైనా సరే అతిగా అప్పులు చేయకూడదు. నెలవారీ ఆదాయం నుంచి 40 శాతానికి మించి అప్పులకు చెల్లించకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్రతినెలా రూ.1 లక్ష ఆదాయం వస్తోందని అనుకుందాం. ఈ రూల్ ప్రకారం అతడికి ప్రతినెలా రూ.40వేల దాకా ఈఎంఐలు ఉండొచ్చు. ఈఎంఐల జాబితాలోకి వ్యక్తిగత రుణాలు, ఇంటి నిర్మాణ రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, వాహన రుణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల రుణాలు వంటివన్నీ వస్తాయి.
4. రూల్ ఆఫ్ 70
ఇంతకుముందు మనం రూల్ ఆఫ్ 72 గురించి తెలుసుకున్నాం. ఒకరకంగా చెప్పాలంటే దానికి కజిన్ లాంటిదే రూల్ ఆఫ్ 70. ప్రతీ మనిషికి ఒక నిర్దిష్ట కొనుగోలు శక్తి ఉంటుంది. ఆదాయ స్థాయులు, సంపద స్థాయులు ఆధారంగా వ్యక్తుల కొనుగోలు శక్తి నిర్ణయమవుతుంది. ఆదాయం, సంపద ఎక్కువగా ఉన్నవారు భారీగా కొనుగోళ్లు చేయగలరు. అందుకే వారి కొనుగోలు శక్తి ఎక్కువ. అవి తక్కువగా ఉన్నవారు అంతగా కొనుగోళ్లు చేయలేరు. ఫలితంగా వారి కొనుగోలుశక్తి తక్కువగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ మనుషుల కొనుగోలు శక్తిని ద్రవ్యోల్బణం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంటుంది. ఒక వ్యక్తి కొనుగోలు శక్తి, ద్రవ్యోల్బణం ప్రభావంతో ఎంతకాలంలో సగానికి సగం తగ్గిపోతుందో తెలియాలంటే రూల్ ఆఫ్ 70ని వాడుకోవాలి. ఈ ఫార్ములా ప్రకారం.. 70ని వార్షిక ద్రవ్యోల్బణం రేటుతో భాగించాలి. ఉదాహరణకు వార్షిక ద్రవ్యోల్బణం రేటు 5 శాతం ఉందని అనుకుందాం. 70తో 5ను భాగిస్తే 14 వస్తుంది. 14 ఏళ్లలో కొనుగోలు శక్తి సగానికి సగం తగ్గుతుందని దీనర్థం. ద్రవ్యోల్బణాన్ని మించిన వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగిన పెట్టుబడి సాధనాలను మదుపరులు వెతుక్కోవడానికి ఈ టూల్ దోహదం చేస్తుంది.
5. రూల్ ఆఫ్ 144 : డబ్బులు నాలుగు రెట్లు
డబ్బులు డబుల్ కాదు ఏకంగా నాలుగు రెట్లు అయితే భలేగుంటుంది కదూ!! మీ డబ్బులు నాలుగు రెట్లు కావడానికి ఎంత టైం పడుతుందో తెలియాలంటే రూల్ ఆఫ్ 144ను వాడాలి. మీకు కేవలం వార్షిక వడ్డీరేటు ఎంతో తెలిస్తే చాలు. ఉదాహరణకు మీ డబ్బులు 8 శాతం వార్షిక వడ్డీరేటుతో నాలుగు రెట్లు అవుతాయని అనుకుందాం. అలాంటప్పుడు 144ను 8తో భాగించండి. ఇందులో వచ్చే ఫలితం 18. అంటే 18 ఏళ్లలో మీ డబ్బులు నాలుగు రెట్లు అయిపోతాయి. దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికల రూపకల్పనలో ఈ సూత్రం బాగా ఉపయోగపడుతుంది.
ఈ రూల్స్ ఎందుకు ముఖ్యం ?
ఒక్కో వయో వర్గం వారికి ఒక్కో విధమైన పెట్టుబడి ప్రణాళికలు ఉంటాయి. వారందరి ఆర్థిక లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. కొందరికి దీర్ఘకాలిక విజన్ ఉంటే, ఇంకొందరికి స్వల్పకాలిక విజన్ ఉంటుంది. ప్రతీ ఒక్కరు వారివారి అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి ప్రణాళికలను రచించుకోవాలి. అలాంటప్పుడే ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవడం సులభతరం అవుతుంది. మనం పెట్టుబడి ప్రణాళికలను పర్సనలైజ్డ్‌గా రూపొందించుకునే క్రమంలో పైన చెప్పిన రూల్స్ ఉపయోగపడతాయి. పెట్టుబడి కేటాయింపులు, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు, రాబడులు, కొనుగోలు శక్తి వంటి వాటిపై రియల్ టైం అంచనాలను ఈ ఐదు ఫార్ములాలు అందిస్తాయి.

