Parliament Passes Banking Laws Bill : ఇక నుంచి బ్యాంకు ఖాతాదారులంతా నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు. బ్యాంకు ఖాతాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)కూ ఈ రూల్ వర్తిస్తుంది. ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024కు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. దీన్ని రాజ్యసభలో మెజారిటీ ఓట్లతో ఆమోదించారు. 2024 డిసెంబరులోనే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
లాకర్ రూల్స్
లాకర్ల నిర్వహణ విషయంలో పాత పద్ధతిలోనే ఒకరికి మించి నామినీలను ప్రాధాన్యతా క్రమంలో కలిగి ఉండొచ్చు. బీమా పాలసీలలోనూ ఇదే తరహాలో నామినీలు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. బిల్లులోని మరో సవరణ విషయానికి వస్తే, బ్యాంకులు ప్రతీ రెండో శుక్రవారం, నాలుగో శుక్రవారం బదులుగా ఇక నుంచి ప్రతినెలా 15వ తేదీన, 30వ తేదీన రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కంపెనీలలోని డైరెక్టర్ల కనీస వాటా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచాలని బిల్లులో ప్రతిపాదించినట్లు తెలిసింది. డైరెక్టర్ హోదాలో ఉన్నవారు కంపెనీలో సగటున 10 శాతం ఈక్విటీ షేర్లను కలిగి ఉండొచ్చని ప్రపోజ్ చేశారు. సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలనే మరో ప్రతిపాదన కూడా బిల్లులో ఉందని సమాచారం. కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా ఉండేవారు, రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులోనూ సభ్యుడిగా వ్యవహరించేందుకు వెసులుబాటును కల్పించే ప్రతిపాదన కొత్త చట్టంలో ఉందని అంటున్నారు. ఆడిటర్లకు వేతనాల చెల్లింపులో బ్యాంకులకు స్వేచ్ఛను కల్పించే నిబంధన సైతం చట్టంలో ఉంది.
రుణాల ఎగవేతదారులను వదలం : నిర్మల
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వివరాలను వెల్లడించారు. "దేశంలోని బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో కట్టుబడి ఉంది. గత ఐదేళ్లలో బ్యాంకు మోసాలతో ముడిపడిన 112 కేసుల దర్యాప్తును ఈడీ చేపట్టింది. వీటిలో రుణ ఎగవేత కేసులూ ఉన్నాయి. రుణాలను 'రైట్ ఆఫ్' చేయడం అంటే మాఫీ చేసినట్టు కాదు. ఆ అప్పులను వసూలు చేసేందుకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటాయి" అని ఆర్థికమంత్రి వెల్లడించారు. బ్యాంకుల రుణ ఎగవేతలు, మొండి అప్పుల విషయంలో విపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఈమేరకు బదులిచ్చారు.
ప్రభుత్వ బ్యాంకులకు రూ.1.41 లక్షల కోట్ల లాభాలు
"గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మునుపెన్నడూ లేని రీతిలో దాదాపు రూ.1.41 లక్షల కోట్ల లాభాలను ఆర్జించాయి. 2025-2026లో అదే లాభాల పరంపర కొనసాగుతుంది" అని సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.