Super Rich Indians Migration : సూపర్ రిచ్ భారతీయుల ఆలోచనా ధోరణిపై నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వారిలో దాదాపు 22 శాతం మంది భారతదేశాన్ని వదిలి వెళ్లాలని భావిస్తున్నారట. భారత్‌లోని జీవన స్థితిగతులు, వ్యాపార వాతావరణంతో పోలిస్తే విదేశాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని వారు తెలిపారు. తాజాగా కోటాక్ ప్రైవేట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంయుక్తంగా 150 మంది అల్ట్రా హై నెట్‌వర్త్ శ్రీమంతులను సర్వే చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
తాము అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈలలో స్థిరపడాలని భావిస్తున్నామని సదరు సూపర్ రిచ్ వ్యక్తులు తేల్చి చెప్పారు. యూఏఈలోని గోల్డెన్ వీసా స్కీం ఆకట్టుకునేలా ఉందన్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతీ ఐదుగురు భారతీయ అల్ట్రా హై నెట్‌వర్త్ శ్రీమంతుల్లో ఒకరు విదేశాలకు వలస వెళ్లిపోయేందుకు ప్లాన్‌ను రెడీ చేసుకుంటున్నట్లు తేలింది. తమ భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే, వీలు కుదిరితే విదేశాల్లో సెటిల్ అయిపోవాలనే ఆలోచన వారి మనసుల్లో ఉందట.
వలసలకు ప్రధాన కారణాలివే!
మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు, అత్యుత్తమ విద్యా రంగం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని కోరుకుంటూ ఈ శ్రీమంతులు వలస వెళ్తున్నారని సర్వే నివేదిక తెలిపింది. వారంతా తమ పిల్లలకు అత్యుత్తమ ఉన్నత విద్యను అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సర్వేతో స్పష్టమైంది. "భారత్‌తో పోలిస్తే విదేశాల్లో వ్యాపారాలు చేయడం చాలా సులభతరం. అందుకే మేం ఆ దేశాలకు ప్రాధాన్యం ఇవ్వదలిచాం" అని సూపర్ రిచ్ భారతీయులు సూటిగా చెప్పారు.
ప్రొఫెషనల్సే ఎక్కువ
- భారత్ నుంచి విదేశాలకు వలస వెళ్లాలని భావిస్తున్న వారిలో వ్యాపారవేత్తల కంటే ప్రొఫెషనల్సే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.
- వయోవర్గం వారీగా పరిశీలిస్తే మన దేశంలోని అల్ట్రా హై నెట్‌వర్త్ శ్రీమంతుల్లో 36-40 ఏళ్లలోపు వారు, 61 ఏళ్లకుపైబడిన వారు విదేశాలకు వలస వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తితో ఉన్నారు.
- 2023 సంవత్సరం నాటికి భారత్‌లో దాదాపు 2.83 లక్షల మంది అల్ట్రా హై నెట్‌వర్త్ శ్రీమంతులు ఉన్నారు. వీరి సగటు నికర విలువ రూ.25 కోట్లకు పైమాటే. వీరందరి సంపదను కలుపుకుంటే దాదాపు రూ.2.83 లక్షల కోట్ల దాకా ఉంటుంది.
- 2028 నాటికి భారత్‌లో అల్ట్రా హై నెట్‌వర్త్ శ్రీమంతుల సంఖ్య 4.30 లక్షల మందికి చేరుకోనుందని సర్వే నివేదిక అంచనా వేసింది. ఆ సమయానికి వీరందరి వద్ద రూ.359 లక్షల కోట్ల సంపద ఉంటుందని పేర్కొంది.
- భారత్ నుంచి ఏటా సగటు 25 లక్షల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్తుంటారు.
పౌరులు వెళితే సంపద వెళ్లిపోదు!
"సూపర్ రిచ్ భారతీయుల్లో పలువురు వలస వెళ్లినంత మాత్రాన పెద్ద సమస్య ఉండదు. వారు తమతో పాటు మొత్తం డబ్బును తీసుకెళ్లలేరు. నివాసాన్ని మార్చినంత మాత్రాన డబ్బంతా దేశం దాటుతుందని భావించకూడదు. భారత పౌరులు దేశం నుంచి సంవత్సరానికి సగటున రూ.2.14 కోట్లు (2.50 లక్షల డాలర్లు) మాత్రమే తీసుకెళ్లగలరు. ప్రవాస భారతీయులు మన దేశం నుంచి ఏటా సగటున రూ.8.50 కోట్ల (1 మిలియన్ డాలర్లు) దాకా తీసుకెళ్లొచ్చు" అని కోటక్ మహీంద్రా బ్యాక్ ప్రెసిడెంట్ గౌతమీ గవాంకర్ తెలిపారు.