Gratuity Rules : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమకు రావాల్సిన ప్రయోజనాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీ జీతంతోపాటు, ప్రావిడెంట్ ఫండ్, డియర్‌నెస్ అలవెన్స్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ సహా కొన్ని ఎర్నెడ్ లీవ్స్ ఉంటాయి. ఈ ప్రయోజనాల్లో అత్యంత ముఖ్యమైనది గ్రాట్యుటీ. అందుకే అసలు గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీన్ని పొందడానికి అర్హతలు ఏంటి? ఎలా లెక్కిస్తారు? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రాట్యుటీ అంటే ఏమిటి?
ఒక సంస్థలో నమ్మకంగా 5 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు సేవలందించినందుకు గాను తమ ఉద్యోగికి, సదరు సంస్థ ఇచ్చే డబ్బునే గ్రాట్యుటీ అంటారు. పదవీ విరమణ, రాజీనామా, నిర్దిష్ట సేవా కాలాన్ని పూర్తి చేసిన ఉద్యోగులకు సంస్థలు ఈ గ్రాట్యుటీని ఏకమొత్తంగా అందిస్తాయి. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 ప్రకారం కనీసం 10 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు గ్రాట్యుటీని చెల్లించాల్సి ఉంటుంది.
గ్రాట్యుటీని పొందడానికి అర్హతలేంటి?
- ఉద్యోగి సర్వీస్ టైమ్ : ఉద్యోగులు ఒక సంస్థలో 5 లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతరంగా పనిచేస్తే, వారు గ్రాట్యుటీని పొందేందుకు అర్హులు అవుతారు. అయితే ఉద్యోగి సంస్థలో పనిచేస్తున్నప్పుడు చనిపోయినా, శాశ్వత వైకల్యానికి గురైనట్లయితే ఈ నిబంధన వర్తించదు.
- ఏయే ఉద్యోగులకు : గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కర్మాగారాలు, గనులు, తోటలు, దుకాణాలు, ఇతర సంస్థలలోని ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తిస్తుంది. అలాగే రిటైర్మెంట్, ఉద్యోగానికి రాజీనామా, తొలగింపు, శాశ్వత వైకల్యం వచ్చినా గ్రాట్యుటీని పొందొచ్చు.
గ్రాట్యుటీని ఎలా లెక్కించాలి?
ఉద్యోగి చివరిగా పొందిన జీతం, సర్వీస్ ఆధారంగా గ్రాట్యుటీని లెక్కిస్తారు. గ్రాట్యుటీ చట్టం కింద కవర్ అయిన ఉద్యోగులకు ఒకలా, కవర్ అవ్వని ఎంప్లాయిస్‌కు మరోలా ఉంటుంది. ఒక ఉద్యోగి సంవత్సరం పాటు కంపెనీలో పనిచేస్తే అతనికి 15 రోజుల వేతనం గ్రాట్యుటీగా లభిస్తుంది.
గ్రాట్యుటీ ఫార్ములా
ఉద్యోగి చివరిగా డ్రా చేసిన జీతం (బేసిక్ శాలరీ + డియర్ నెస్ అలవెన్స్) X 15 X పూర్తి చేసిన సర్వీస్ సంవత్సరాల సంఖ్య /26
ఉదాహరణ : రమేశ్ అనే ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం (ప్రాథమిక వేతనం + డియర్‌నెస్ అలవెన్స్) రూ.50,000 అనుకుందాం. అతడు ఓ కంపెనీలో 10 ఏళ్లు పనిచేశాడనుకుందాం. అప్పుడు అతడికి ఎంత గ్రాట్యుటీ వస్తుందో చూద్దాం.
రమేశ్ గ్రాట్యుటీ = (50,000 X 15 X 10) / 26 = రూ.2,88,461
గ్రాట్యుటీ చట్టం 1972 కింద కవర్ కాని ఉద్యోగులకు గ్రాట్యుటీ ఎంత వస్తుంది?
ఉద్యోగి చివరిగా డ్రా చేసిన జీతం (బేసిక్ శాలరీ + డియర్ నెస్ అలవెన్స్) X 15 X పూర్తి చేసిన సర్వీస్ సంవత్సరాల సంఖ్య /30
గ్రాట్యుటీపై పన్ను
ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ మొత్తంపై పన్ను ఉండదు. ప్రస్తుత చట్టం ప్రకారం రూ.20 లక్షల దాకా అందుకునే గ్రాట్యుటీ సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంది.
యజమాని గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద కవర్ కానట్లైతే
మీరు పనిచేస్తున్న సంస్థ గ్రాట్యుటీ చట్టం కింద కవర్ అవ్వకపోయినట్లైతే, మీరు కింద ఇచ్చిన మూడు ఎంపికలలో ఏదైనా ఒక పన్ను మినహాయింపును పొందవచ్చు. వాటిలో ఏది తక్కువగా ఉంటే దాని మినహాయింపు పరిగణనలోకి వస్తుంది.
1. అందుకున్న వాస్తవ గ్రాట్యుటీ
2. రూ.20 లక్షలు
3. సూత్రాన్ని ఉపయోగించి లెక్కించిన గ్రాట్యుటీ
మరిన్ని ముఖ్య విషయాలు
గ్రాట్యుటీని ఉద్యోగి జీతం నుంచి తీయరు. సంస్థ దానికి నిధులు సమకూరుస్తుంది. ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఏదైనా సంస్థలో పనిచేస్తే ప్రసూతి సెలవులు, పెయిడ్ లీవ్స్ ఉంటాయి. ఉద్యోగులు గ్రాట్యుటీ ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యుడిని నామినీగా పెట్టుకోవచ్చు. ఉద్యోగి సంస్థలో పనిచేస్తుండగా మరణం లేదా వైకల్యం వస్తే ఐదు సంవత్సరాల సర్వీస్ నిబంధన ఉండదు. నామినీకి గ్రాట్యుటీని అందిస్తారు.
కొత్తగా జాబ్లో చేరారా? ఈ బేసిక్ రైట్స్ గురించి తెలుసుకోవడం మస్ట్!
మిడ్ కెరీర్‌లో ఉన్నారా? శాలరీ హైక్ కోసం HRతో డిస్కస్ చేయాలా? బెస్ట్ స్ట్రాటజీస్ ఇవే!