EPF Account Transfer Rules Update : ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే ప్రక్రియని సులభతరం చేసింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చాలా సందర్భాల్లో కంపెనీ ఆమోదం తెలపాల్సిన అవసరాన్ని తొలగించారు. దీని వల్ల పీఎఫ్ ఖాతా బదిలీ వేగంగా పూర్తవుతుంది.
గతంలో పీఎఫ్ మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే రెండు ఈపీఎఫ్‌ఓ ఆఫీసులు పని చేయాల్సి ఉండేది. అవి ఒకటి సోర్స్ ఆఫీస్ (ఫండ్స్ ఉంచిన చోటు), రెండు డెస్టినేషన్ ఆఫీస్ (ఫండ్స్ పంపాల్సిన చోటు). రెండు వైపులా ఆమోదాలు అవసరం కావడంతో సాధారణంగా ప్రక్రియ ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈపీఎఫ్‌ఓ కొత్త ఫామ్ 13 అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రక్రియను సులభతరం చేసే సాఫ్ట్‌వేర్ టూల్. సోర్స్ ఆఫీస్ ట్రాన్స్‌ఫర్‌ను ఆమోదించిన తర్వాత, ఫండ్స్ వెంటనే డెస్టినేషన్ ఆఫీస్‌లోని ఉద్యోగి కొత్త పీఎఫ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. ఈ కొత్త మార్పు లక్షలాది మంది ఈపీఎఫ్‌ఓ సభ్యుల పనులను మరింత సులభతరం చేయనుంది.
కొత్త వ్యవస్థ పీఎఫ్ సేవింగ్స్‌లో పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం, పన్ను పరిధిలోకి రాని మొత్తాన్ని కూడా వేరు చేస్తుంది. పీఎఫ్ వడ్డీలో పన్ను విధించాల్సిన మొత్తంపై టీడీఎస్ (TDS)ని కచ్చితంగా లెక్కిస్తుంది. దీని వలన 1.25 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుతుందని, ఏటా దాదాపు రూ.90,000 కోట్ల విలువైన ట్రాన్స్‌ఫర్లు వేగవంతం అవుతాయని అంచనా.
అలానే యూనివర్సల్ అకౌంట్ నంబర్లు (UANs) బల్క్ జనరేషన్ కోసం ఈపీఎఫ్‌ఓ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆధార్ లేకుండా కూడా సభ్యుల ఐడీలు, ఇతర వివరాలను ఉపయోగించి కూడా యూఏఎన్ నంబర్‌లు జనరేట్ చేయవచ్చు. ఇది సభ్యుల కొత్త ఖాతాలకు నిధులు త్వరగా జమ అయ్యేలా చేస్తుంది. అయితే సేవింగ్స్‌ని రక్షించడానికి, ఆధార్ లింక్ చేసే వరకు ఈ UANలు ఫ్రీజ్ అయ్యే ఉంటాయి.