గుడ్ న్యూస్- ఇకపై నేరుగా ఏటీఎం, యూపీఐ నుంచి పీఎఫ్ విత్‌డ్రా!
ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్- త్వరలో ఏటీఎం, యూపీఐ ద్వారా నేరుగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్!

Published : June 24, 2025 at 8:25 PM IST
PF Withdraw Through ATMs And UPI : ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను త్వరలో నేరుగా ఏటీఎం, యూపీఐల ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం రానుంది. అయితే ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోందని ఓ ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. దీని ద్వారా ఇకపై ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో కొంత భాగాన్ని స్తంభింపజేసి, మిగిలిన డబ్బును యూపీఐ, ఏటీఎం డెబిట్ కార్డులు మొదలైన వివిధ పద్ధతులు ఉపయోగించి విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారని ఆయన అన్నారు. అయితే ఈ వ్యవస్థను అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని, అందులో భాగంగా ప్రస్తుతం సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే, ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల పీఎఫ్ డబ్బులు పొందడానికి చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
ఆటో-సెటిల్మెంట్ మోడ్ కింద, దరఖాస్తు ఫారమ్ దాఖలు చేసిన 3 రోజుల్లో పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్‌ను ఎలక్ట్రానిక్‌గా పరిష్కరిస్తారు. కనుక మాన్యువల్ పనులు చేయాల్సిన పని తప్పుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆటో-సెటిల్మెంట్ మోడ్ పరిమితిని మంగళవారం రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల ఈపీఎఫ్ఓ చందదారులకు చాలా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విద్య, వివాహం, గృహ అవసరాలకు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కేవలం 3 రోజుల్లోగా తమ పీఎఫ్ డబ్బులు పొందగలుగుతారు.
కొవిడ్ సమయంలో
ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 7 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. అయితే కొవిడ్ సమయంలో వీరిలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. దీనితో వీరికి ఆర్థిక సాయం అందించడానికి ఈపీఎఫ్ఓ ముందస్తు క్లెయిమ్‌ల కోసం ఆటో-సెటిల్మెంట్ను ప్రవేశపెట్టింది. అయితే ఇది పొందాలంటే పీఎఫ్ ఖాతాదారులు ప్రత్యేకంగా క్లెయిమ్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఏటా ఈపీఎఫ్ఓ 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను పరిష్కరిస్తోంది. దీనికి చాలా సమయం పడుతోంది. అందుకే ఈ భారాన్ని తగ్గించడానికి ఈపీఎఫ్ఓ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
'ఈపీఎఫ్ఓకు ఎటువంటి బ్యాంకింగ్ లైసెన్స్‌లు లేవు. కనుక చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు' అని సదరు ఉన్నత అధికారి తెలిపారు. అయితే బ్యాంకులతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రూ.12 లక్షలు పెడితే రూ.40 లక్షలు రిటర్న్- భారీ లాభాలిచ్చే టాప్- 5 మిడ్‌క్యాప్ ఫండ్స్ ఇవిగో

