Social Media Posts Can Fired A Job : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం సోషల్ మీడియా వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటీవల ఓ ఉద్యోగి లింక్డ్‌ఇన్ పోస్టుకు లైక్ కొట్టి ఉద్యోగాన్ని పొగొట్టుకున్నాడు. అందుకే ఎంప్లాయిస్ సోషల్ మీడియాను వాడేటప్పుడు, అందులో పోస్టులు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చట్టాలు ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇటీవలే ఓ ఉద్యోగి రెడ్‌ఇట్‌లో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. కంపెనీని విమర్శించే పోస్టుకు లైక్ కొట్టినందుకు తన ఉద్యోగమే ఊడిపోయిందని అతను తీవ్ర ఆవేదన వెల్లబుచ్చాడు. ఈ పోస్ట్ లైక్ కొట్టడం తన వ్యక్తిగతమైనప్పటీ, సదరు కంపెనీ సీఈఓ ఉద్యోగిపై వేటు వేశారు. దీనిని బట్టి ఉద్యోగులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే? యజమానులు తమ ఉద్యోగుల సోషల్ మీడియా కార్యకలాపాలపై కచ్చితంగా నిఘా ఉంచుతారు.
అభ్యంతరకరమైన వ్యాఖ్యలు
ఉద్యోగులు సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రసంగాలు, వివక్షపూరిత వ్యాఖ్యలు వంటి అనుచితమైన కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదు. ఇలాంటి పోస్టులు పెడితే మీ ఉద్యోగం ఊడే ప్రమాదం ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కుగా ఉన్నప్పటికీ, అన్ని విషయాల్లో అలా కుదరదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అభ్యంతరకరమైన, అనుచితమైన కంటెంట్‌ను నిరోధించడానికి, నెటిజన్ల వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించడానికి అమెరికా, ఈయూ, భారత్‌లో కొన్ని చట్టాలు ఉన్నాయి. అవేంటంటే?
- అమెరికా : అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణలో వాక్ స్వాతంత్ర్యం గురించి ఉంది. ఇది సోషల్ మీడియాలో ఉద్యోగులు చేసే అనుచిత పోస్టులకు వర్తించదు. ప్రైవేట్ కంపెనీలు కూడా ఉద్యోగికి అండగా నిలవవు. కంపెనీపై చెడు ప్రభావం పడిలోపే ఉద్యోగులను తొలిగిస్తాయి.
- యూరోపియన్ యూనియన్ : ఈయూలో కూడా భావప్రకటన హక్కు ఉంది. అయితే ఈ హక్కు ఇతరుల హక్కులను దెబ్బతీసినప్పుడు పనిచేయదు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్రసంగం, వివక్షాపూరిత ప్రవర్తన చూపే ఉద్యోగులను తొలగించడానికి యజమానులకు హక్కులను ఇచ్చాయి అక్కడి న్యాయస్థానాలు.
- భారత్ : ఇండియాలోని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల సోషల్ మీడియా కార్యకలాపాలను నియంత్రించే నిర్దిష్ట చట్టం అనేది లేదు. ఏదేమైనప్పటికీ, ఉద్యోగులు తమ పోస్ట్‌లో కంపెనీ పాలసీల గురించి తప్పుగా రాసినా, ద్వేషపూరిత ప్రసంగాలు, పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెట్టినా, ఐటీ చట్టం 2000 ప్రకారం సదరు ఉద్యోగిని తొలగించవచ్చు.
గోప్యత, కంపెనీ పాలసీలను ఉల్లంఘించడం
సోషల్ మీడియాలో కంపెనీ గోప్యమైన సమాచారాన్ని పంచుకోవడం అనేది తీవ్రమైన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులను సంస్థలు వెంటనే తొలగించవచ్చు. చాలా మంది ఉద్యోగులు, తెలిసి లేదా తెలియకుండా కంపెనీ కార్యకలాపాలు, క్లయింట్ వివరాలు, వ్యాపార వ్యూహాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తారు. ఇలాంటి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కంపెనీలకు అధికారం ఉంటుంది.
కంపెనీ డేటా, రహస్యాలను కాపాడే చట్టాలు
- అమెరికా : అమెరికాలో డిఫెండ్ ట్రేడ్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం, కంపెనీ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగులపై కంపెనీ యజమానులు దావా వేయచ్చు.
- యూరోపియన్ యూనియన్ : ఈయూలో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) ప్రకారం, వ్యక్తిగత డేటా లేదా వాణిజ్య రహస్యాలను బహిర్గతం చేసే ఉద్యోగులను తొలగించొచ్చు. అలాగే జరిమానా సైతం వేయవచ్చు.
- భారత్ : భారత కాంట్రాక్ట్ చట్టం ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై నాన్-డిస్ క్లోజర్ అగ్రిమెంట్లు అప్లై అవుతాయి. కనుక సదరు ఉద్యోగులపై కంపెనీలు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
యజమానులపై ఉద్యోగి వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో ఉద్యోగులు తమ యజమాని గురించి, సహోద్యోగుల గురించి అసభ్యకరమైన లేదా ప్రతికూల పోస్టులు చేయకూడదు. అలా చేస్తే ఉద్యోగం ఊడే ప్రమాదం ఉంది.
- యునైటెడ్ కింగ్ డమ్ : యూకేలో కంపెనీ పబ్లిక్ ఇమేజ్‌కు హాని కలిగించే వ్యాఖ్యలు చేసే ఉద్యోగులను యజమానులు తొలగించవచ్చు. యూకే కోర్టులు ఇటువంటి తొలగింపులను సమర్థిస్తాయి.
- ఆస్ట్రేలియా : యజమానుల గురించి నెగిటివ్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉద్యోగిపై వేటు పడుతుంది.
- భారత్ : యజమానికి పరువుకు నష్టం కలిగిస్తే ఉద్యోగిపై వేటు పడుతుంది. అలాగే చట్టపరంగానే శిక్ష పడుతుంది.
పని వేళల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం
- అమెరికా : పని వేళల్లో ఎక్కువగా సోషల్ మీడియా వాడితే ఉద్యోగులను కంపెనీలు తొలగించవచ్చు.
- ఈయూ : యూరోపియన్ యూనియన్‌లో కూడా సోషల్ మీడియాను అధికంగా వాడితే వేటు తప్పుదు.
- భారత్ : కంపెనీలు పనివేళల్లో వ్యక్తిగత సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసే నిబంధనలను ఉద్యోగ ఒప్పంద పత్రాల్లో చేర్చవచ్చు.
కంపెనీ ప్రతిష్ఠను దిగజార్చే ఫొటోలు
- యునైటెడ్ స్టేట్స్, కెనడా : యజమానుల ప్రతిష్ఠను దెబ్బతీసే లేదా కంపెనీ విధానాలను ఉల్లంఘించే అనుచితమైన పోస్టులను ఉద్యోగులు సోషల్ మీడియాలో పెట్టకూడదు. అలా చేస్తే ఉద్యోగిని తొలగించే హక్కు యజమానికి ఉంటుంది.
- యూరోపియన్ యూనియన్ : కంపెనీ లేదా యజమాని ప్రతిష్ఠను దెబ్బతిసేలా పోస్టు చేస్తే ఉద్యోగిపై వేటు తప్పదు.
- భారత్ : సోషల్ మీడియాలో ఉద్యోగులు అనుచితమైన చిత్రాలను పోస్ట్ చేస్తే, ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
యజమానులు, ఉద్యోగుల కోసం చట్టాలు
- ఉద్యోగి హక్కులు : ఉద్యోగులు తమ సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి కొన్ని చట్టపరమైన రక్షణలను కలిగి ఉంటారు. ఉద్యోగిని అక్రమంగా తొలగిస్తే కార్మిక చట్టాల ఆధారంగా న్యాయస్థానంలో పోరాడవచ్చు.
- యజమాని హక్కులు : యజమానులు తమ ప్రతిష్ఠ, వ్యాపార రహస్యాలను రక్షించుకోవడానికి చట్టబద్ధంగా అర్హులు. చాలా దేశాల్లో కంపెనీ పాలసీలను ఉల్లంఘించినా, సున్నిత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఉద్యోగిపై యజమాని వేటు వేయవచ్చు. అయితే, ఉద్యోగి తొలగింపు అనేది పూర్తిగా చట్టం ప్రకారం జరగాల్సి ఉంటుంది.