Elon Musk World First Trillionaire : ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కుబేరులు ఉన్నా అందరూ ప్రస్తుతానికి బిలియనీర్లే తప్ప, వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ ట్రిలియనీర్ (కనీసం ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లు) ఘనతను చేరుకోలేదు. ఈ కిరీటాన్ని అందుకోబోయే మొదటి వ్యక్తి మాత్రం స్పేస్ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కాబోతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఆ ఘనత సాధించబోతున్నారని పేర్కొంది. ఆ తరువాతి ఏడాది గౌతమ్ అదానీ ఆ జాబితాలో చోటు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం 2033లో ఆ ఘనతను కైవశం చేసుకోనున్నారని ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ అనే సంస్థ తన నివేదికలో అంచనా వేసింది.
ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ 237 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. ట్రిలియనీర్‌గా అవతరించాలంటే ఏడాదికి మాస్క్ సంపద సగటున 110 శాతం వృద్ధి చెందాల్సి ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. అలాగే, ఈ జాబితాలో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్న అదానీ సంపద 100 బిలియన్ డాలర్లు కాగా, ట్రిలియనీర్ జాబితాలో చేరే రెండో వ్యక్తిగా ఆయన నిలవనున్నారని నివేదిక అంచనా వేసింది. పోర్టులు, విద్యుత్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో కొనసాగుతున్న ఆయన, సగటున 123 శాతం వార్షిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని తెలిపింది.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ప్రస్తుత సంపద 111 బిలియన్ డాలర్లు కాగా, ట్రిలియనీర్ జాబితాలో చేరాలంటే మాత్రం ఆయన 2033 వరకు వేచి చూడాల్సిందేనని నివేదిక తెలిపింది. అలాగే, అంబానీకి చెందిన వ్యాపార విభాగం రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ పరంగా 2035 నాటికి ఆ ఘనతను సాధించగలదని అంచనా కట్టింది. తైవాన్‌కు చెందిన సెమీ కండక్టర్ తయారీ సంస్థ టీఎస్‌ఎంసీ (ప్రస్తుత విలువ 893.7 బిలియన్ డాలర్లు) 2025 నాటికే ఈ ఘనతను అందుకోనుంది. దీంతో పాటు బెర్క్‌షైర్ హాథ్‌వే, ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ, టెక్నాలజీ కంపెనీ బ్రాడ్‌కామ్, ఆటోమొబైల్ సంస్థ టెస్లా కూడా త్వరలోనే ఈ ఘనతను అందుకోబోతున్నాయని నివేదిక వెల్లడించింది.
ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు ట్రిలియనీర్ హోదాను సాధించలేదని, ఎలాన్ మస్క్, గౌతమ్ అదానీ, ఎన్విడియా వ్యవస్థాపకుడు జన్‌సెన్ హాంగ్, ఇండోనేషియా వ్యాపారవేత్త ప్రజాగో పెంగెస్తు, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నాల్డ్ ఆర్నాల్ట్, ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ వంటి వారు త్వరలో ఆ ఘనతను సాధించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అల్ఫాబెట్, అమెజాన్, సౌదీ ఆరామ్‌కో, మెటా వంటి సంస్థలు ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నాయి.