ETV Bharat / business

పూచీకత్తు లేకుండా ఎడ్యుకేషన్ లోన్ కావాలా? ఈ కంప్లీట్ గైడ్​ మీ కోసమే!

ఎలాంటి ఆస్తులు తనఖా పెట్టకుండా విద్యారుణం పొందాలా?- ఈ పూర్తి వివరాలు తీసుకోండి.

Education Loan
Education Loan (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 25, 2025 at 12:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

Education Loan Without Collateral : నేటి కాలంలో విద్య అనేది ఒక అంగడి సరకు అయిపోయింది. డబ్బు ఉంటే గానీ ఉన్నత విద్య అభ్యసించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే చాలా మంది విద్యా రుణాల కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే బ్యాంకులు ఈ విద్యా రుణాలను మంజూరు చేయడానికి ఏదైనా హామీ చూపించమని అడుగుతాయి. సామాన్య ప్రజలకు ఇది సాధ్యమయ్యేది కాదు. మరి మీరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారా? అయితే డోంట్ వర్రీ. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం ఉంది. అది ఎలాగో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

ప్రస్తుతం అనేక బ్యాంకులు, వాణిజ్య సంస్థలు ఎలాంటి హామీ లేకుండా విద్యారుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే వీటి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇందుకోసం ఏమేమి కావాలి? అనేది ఇప్పుడు చూద్దాం.

తాకట్టు అవసరం లేకుండానే విద్యారుణాలు
బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు తీసుకోకుండా ఇచ్చే విద్యా రుణాలను 'అన్​సెక్యూర్డ్​ ఎడ్యుకేషన్ లోన్స్' అని అంటారు. అలా కాకుండా రియల్​ ఎస్టేట్ ఆస్తులు, ఫిక్స్​డ్ డిపాజిట్లు లేదా ఇతర ఆస్తులు తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాలను 'సెక్యూర్డ్​ లోన్స్' అని అంటారు.

రుణార్హతలు ఏమిటి?
బ్యాంకులు విద్యారుణం మంజూరు చేసే ముందు కచ్చితంగా దరఖాస్తుదారుడి అకడమిక్​ ట్రాక్ రికార్డ్, కోర్స్, విద్యా సంస్థ ర్యాంకింగ్​, సహ-దరఖాస్తుదారుని ఆదాయం, క్రెడిట్ స్కోర్​లను చూస్తాయి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే తాకట్టు లేకుండా రుణాలు మంజూరు చేస్తాయి.

ఈ కోర్సులకు మాత్రమే రుణాలు!
బ్యాంకులు కేవలం కొన్ని రకాల కోర్స్​లకు, కొన్ని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే పూచీకత్తులేని విద్యా రుణాలు మంజూరు చేస్తాయి. అవి :

  • పోస్ట్ గ్రాడ్యుయేట్​, అండర్​ గ్రాడ్యుయేట్​ ప్రోగ్రామ్​లు
  • ఎంబీబీఎస్​, ఎంఎస్​, ఎంబీఏ మొదలైన ప్రొఫెషనల్ కోర్సులు
  • భారతదేశంలో, ప్రపంచంలో అత్యంత మంచి గుర్తింపు ఉన్న విద్యాసంస్థలు, ప్రసిద్ధ కళాశాలలు

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో, కళాశాలల్లో సీటు సంపాదించిన విద్యార్థులు
  • 18-35 ఏళ్ల వయస్సున్న విద్యార్థులు
  • స్థిరమైన ఆదాయం కలిగిన సహదరఖాస్తుదారులు (తల్లిదండ్రులు లేదా సంరక్షకులు)
  • కొన్ని బ్యాంకులు- అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చేరాలనుకునే విద్యార్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్​, ఎగ్జామ్ స్కోర్​ను కూడా చూస్తాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రస్తుతం దేశంలో చాలా బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు పూచీకత్తు లేకుండా రుణాలు అందిస్తున్నాయి. వాటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాలి.

మన దేశంలోనే ఉన్నత చదువులు అభ్యసించేవారికి, బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా గరిష్ఠంగా రూ.7.5 లక్షల వరకు విద్యారుణం అందిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చేరేవారికి రూ.40 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేస్తున్నాయి.

కావాల్సిన పత్రాలు ఇవే!

  • విద్యా సంస్థ మీకు ఇచ్చిన అడ్మిషన్ లెటర్​
  • మీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు
  • మీ ఎంట్రాన్స్​ ఎగ్జామ్ ర్యాంక్​ కార్డ్​ లేదా సర్టిఫికెట్​ ​
  • మీ సహదరాఖాస్తుదారుని ఇన్​కం ఫ్రూఫ్​, ఐటీ రిటర్నులు
  • మీ, మీ సహదరఖాస్తుదారుని కేవైసీ పత్రాలు
  • యూనివర్సిటీ ఫీజు, హ్యాండ్​బుక్​/ రూల్స్​

ఆన్​లైన్​/ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు!
విద్యా రుణం కోసం మీరు నేరుగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా నేరుగా బ్యాంక్​కు వెళ్లి, వారితో మాట్లాడి, ఫారమ్​ను పూరించి ఇవ్వవచ్చు.

రుణ ఆమోదం!
మీరు విద్యారుణం కోసం దరఖాస్తు చేశాక, బ్యాంకులు వాటిని నిశితంగా పరిశీలిస్తాయి. మీ ఆర్థిక స్థితిగతులు, మేధస్సును అంచనా వేస్తాయి. మీకు అన్ని అర్హతలు ఉంటే, రుణాలు మంజూరు చేస్తాయి. అయితే యూనివర్సిటీ ఫీజు షెడ్యూల్​కు అనుగుణంగా బ్యాంకులు ఈ నిధులు మంజూరు చేస్తాయి.

జర జాగ్రత్త!
విద్యారుణం తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ ఆర్థిక స్థితిగతుల గురించి ఓ అంచనాకు రండి. సరైన బ్యాంకును ఎంచుకోండి. లోన్​ డాక్యుమెంట్లను కచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. హాయిగా ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు.

నోట్​ : ఈ ఆర్టికల్​లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

గుడ్ న్యూస్​- ఇకపై నేరుగా ఏటీఎం, యూపీఐ నుంచి పీఎఫ్ విత్​డ్రా!

ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలా? 5 గోల్డెన్ పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ ఇవిగో!