
దీపావళికి టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మరింత చీప్‌గా ఫ్లైట్ టికెట్స్!
దీపావళి టూర్‌కు వెళుతున్నారా? అయితే ఈ క్రెడిట్ కార్డులపై ఓ లుక్కేయండి!

Published : October 12, 2025 at 4:27 PM IST
Best Travel Credit Cards India 2025 : మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ క్రమంలో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు, ఇంకొందరు టూర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కొందరు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునేందుకు విమానంలో ప్రయాణించేకు ఆసక్తి చూపిస్తారు. అయితే పండగ సీజన్లో విమాన టికెట్ ధరలు భారీగా ఉంటాయి. కానీ ఈ 6 రకాల క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే మీరు విమాన టికెట్లపై డిస్కౌంట్లు పొందొచ్చు. తద్వారా తక్కువ డబ్బులతో ఫ్లైట్ జర్నీ చేయొచ్చు. మరెందుకు ఆలస్యం, ఫ్లైట్ టికెట్లపై ఆఫర్లను ఇస్తున్న ఆ ఆరు క్రెడిట్ కార్డులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తక్షణ అవసరాల కోసం అందరూ క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే ఒకవేళ మీరు ఎక్కువ విమాన ప్రయాణం చేసేవాళ్లు అయితే, కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై బంపర్ ఆఫర్లను అందిస్తున్నాయి. అవి ఇచ్చే రివార్డు పాయింట్లతో మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని డిస్కౌంట్ పొందొచ్చు.
1. యాక్సిస్ అండ్ అట్లాస్ క్రెడిట్ కార్డు
ఎక్కవగా విమాన ప్రయాణాలు చేసేవారికి ఈ క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. విమానయాన సంస్థతో సంబంధం లేకుండా మీరు చేసే ప్రతి ప్రయాణానికి ఇది రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ప్రతి ప్రయాణానికి 5 ఎడ్జ్ మైళ్లను ఇస్తుంది. ఇక్కడ 1 ఎడ్జ్ మైల్ ఒక రూపాయికి సమానం. అదనంగా, మీరు కార్డ్ జారీ చేసిన 37 రోజుల్లోపు మొదటి లావాదేవీని నిర్వహిస్తే ఈ కార్డు వినియోగదారులు 2,500 ఎడ్జ్ మైళ్లను పొందొచ్చు.
2. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్
ఈ కార్డుతో కొంత ఖర్చు చేసిన తర్వాత రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక ఏడాదిలో రూ.1.90 లక్షలు ఖర్చు చేసినప్పుడు, మీరు ప్లాటినం ట్రావెల్ కలెక్షన్‌లో రీడీమ్ చేసుకోగల 15,000 సభ్యత్వ రివార్డ్ పాయింట్లను పొందే అర్హత పొందుతారు. అలాగే మీరు ఒక ఏడాదిలో రూ.4 లక్షలు ఖర్చు చేస్తే, అదనంగా 25,000 రివార్డ్ పాయింట్లను దక్కించుకుంటారు.
3. ఎస్బీఐ కార్డు మైల్స్ ఎలైట్
ఈ కార్డు వెల్కమ్ గిఫ్ట్‌గా 5000 ట్రావెల్ క్రెడిట్‌లను అందిస్తుంది. మీరు ప్రయాణంలో ఖర్చు చేసే ప్రతి రూ.200కి 6 ట్రావెల్ క్రెడిట్‌లను పొందుతారు. ఈ ట్రావెల్ క్రెడిట్‌లను ఎయిర్ మైల్స్/హోటల్ పాయింట్లు లేదా ట్రావెల్ బుకింగ్‌లుగా మార్చవచ్చు.
4. హెచ్డీఎఫ్సీ 6ఈ రివార్డ్స్ ఇండిగో క్రెడిట్ కార్డ్
ఈ కార్డ్ ఇండిగో యాప్/వెబ్ సైట్‌లో విమాన బుకింగ్‌లపై ప్రతి రూ.100 ఖర్చుకు 2.5 రివార్డ్‌లను అందిస్తుంది. అలాగే రూ.1,500 విలువైన ఒక కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్ వోచర్ కూడా లభిస్తుంది. రివార్డ్‌లు ప్రతి నెలా చివరిలో ఇండిగో ఖాతాకు బదిలీ అవుతాయి.
5. యాక్సిస్ బ్యాంక్ హారిజన్ క్రెడిట్ కార్డ్
యాక్సిస్ బ్యాంక్ ట్రావెల్ ఎడ్జ్ పోర్టల్, డైరెక్ట్ ఎయిర్‌లైన్ వెబ్సైట్లలో ఖర్చు చేసే ప్రతి రూ.100 పై 5 ఎడ్జ్ మైళ్లను అందిస్తుంది. అదనంగా, కార్డ్ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో మొదటి చేసిన ట్రాన్సాక్షన్ పై 5000 ఎడ్జ్ మైళ్లు క్రెడిట్ అవుతాయి.
6. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమిరేట్స్ స్కైవార్డ్స్ క్రెడిట్ కార్డ్
ఈ క్రెడిట్ కార్డ్ విమాన టికెట్లతో రీడీమ్ చేసుకోగల ఖర్చులపై స్కైవార్డ్స్ మైళ్లను అందిస్తుంది. అంతేకాకుండా కార్డ్ హోల్డర్లు విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌కు అర్హులు.

