Trump Effect On iPhones Making: చైనాపై అమెరికా విధిస్తున్న భారీ దిగుమతి సుంకాల ప్రభావం ప్రఖ్యాత ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్‌పైనా పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అమెరికాలోనే ఐఫోన్ల తయారీని ప్రారంభించే దిశగా యాపిల్ యోచించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అమెరికాలో యాపిల్ కంపెనీ మొట్టమొదటి ఐఫోన్ల తయారీ యూనిట్ ఏర్పడినట్లు అవుతుంది. చైనాతో వాణిజ్య యుద్ధంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నది కూడా అదే. చైనా గడ్డకు అమెరికా కంపెనీలు వలస వెళ్లకూడదనేది ఆయన ప్లాన్. అమెరికా నుంచి చైనాకు విదేశీ మారక ద్రవ్యం చేరకుండా చేయాలనే స్పష్టమైన స్కెచ్‌తో ట్రంప్ సర్కారు అడుగులు వేస్తోంది. ఒకవేళ యాపిల్, టెస్లా లాంటి దిగ్గజ కంపెనీలు చైనాను కాదని అమెరికాలోనే తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తే ట్రంప్ ప్రభుత్వ ప్రణాళిక విజయవంతం అయినట్టే.
తయారీ వ్యయంలో పెద్దతేడా
వాస్తవానికి 1990వ దశకం నుంచే చైనా కేంద్రంగా ఐఫోన్లను యాపిల్ కంపెనీ తయారు చేయిస్తోంది. తదుపరిగా భారత్‌లోనూ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసింది. చౌకగా మానవ వనరులు, తక్కువ ధరకే స్థలాలు, సహజ వనరులు లభిస్తుండటం వల్ల ఇప్పటివరకు ఐఫోన్ల తయారీ కోసం చైనా, భారత్‌ల వైపే యాపిల్ మొగ్గు చూపింది. ప్రత్యేకించి చైనాలో భారీ పెట్టుబడితో పెద్దతరహా ప్లాంట్లను ఏర్పాటు చేయించింది. చైనా, భారత్‌లలో ఐఫోన్ల తయారీ ఖర్చు చాలా తక్కువ. వాటిని అమెరికాలో తయారు చేయాలంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ వ్యయం అవుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. తయారీ వ్యయం పెరిగితే రేట్లను పెంచాలి. రేట్లను పెంచితే అమ్మకాలు తగ్గుతాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని యాపిల్ కంపెనీ భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన వెడ్ బుష్ సెక్యూరిటీస్ విశ్లేషణ..
యాపిల్ ఉత్పత్తులు ప్రారంభమవుతాయని దేశంలో ప్రారంభంమవుతాయని అమెరికా భావిస్తున్న తరుణంలో ఇప్పట్లో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. "ఒకవేళ అమెరికాలోనే ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్ కంపెనీ భావిస్తే- దాని ప్లాంట్ల ఏర్పాటుకు కొన్నేళ్ల టైమ్ పడుతుంది. 2028 నాటికి ఆ ప్లాంట్లలో ఐఫోన్ల ఉత్పత్తి మొదలవుతుంది. ఉదాహరణకు చైనా లేదా భారత్‌లో తయారయ్యే ఒక ఐఫోన్ ధర 1000 డాలర్లు ఉంటుందని భావిస్తే- అదే ఐఫోన్‌ను అమెరికాలో తయారు చేసేందుకు 3000 డాలర్ల దాకా ఖర్చు చేయాల్సి వస్తుంది" అని అమెరికాకు చెందిన వెడ్ బుష్ సెక్యూరిటీస్ అనలిస్ట్ డేన్ ఐవ్స్ విశ్లేషించారు. వెడ్ బుష్ సెక్యూరిటీస్ అనేది యాపిల్ కంపెనీ నిర్ణయాలు అన్నింటినీ నిశితంగా ట్రాక్ చేస్తుంటుంది. అందుకే దాని విశ్లేషణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే దీనిపై యాపిల్ కంపెనీ ఇంకా స్పందించలేదు.
మే1న యాపిల్ సీఈఓ ఏం చెప్పబోతున్నారు..?
2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ఈ ఏడాది మే 1న యాపిల్ కంపెనీ విడుదల చేయనుంది. ఆ సందర్భంగా తమ ఇన్వెస్టర్లను ఉద్దేశించి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రసంగించనున్నారు. ఇన్వెస్టర్లు, మార్కెట్ అనలిస్టుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వనున్నారు. చైనాపై అమెరికా దిగుమతి సుంకాల అంశం ఆ సమయంలోనే ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. చైనాపై అమెరికా సుంకాల ప్రభావంతో ఏప్రిల్ 2 నుంచి యాపిల్ కంపెనీ షేరు ధర దాదాపు 15 శాతం తగ్గిపోయింది. ఆ కంపెనీ మార్కెట్ విలువ సైతం దాదాపు 500 బిలియన్ డాలర్లు మేర తగ్గింది. యాపిల్ కంపెనీ సప్లై చైన్ అనేది ప్రధానంగా చైనాపై ఆధారపడి ఉంది. అందుకే రానున్న రోజుల్లో ఐఫోన్లు, ఇతరత్రా అనుబంధ ఉత్పత్తుల ధరలను పెంచడంపై యాపిల్ ఫోకస్ చేసే అవకాశం ఉంది.