Amit Shah About Terrorism : దేశంలో ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 మార్చి 21 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పారు. హోంశాఖ పనితీరుపై రాజ్యసభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు.
ఓటు బ్యాంక్ రాజకీయాలు
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అధికరణ తాత్కాలికమని రాజ్యాంగ నిర్మాతలు అందులో పేర్కొన్నప్పటికీ, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అది కొనసాగుతూ వచ్చిందని అమిత్ షా విమర్శించారు. కశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆధారమైన ఆర్టికల్ 370ని రద్దు చేసి రాజ్యాంగ నిర్మాతల కలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు భారత్‌కు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. వాటి వల్ల గత 4 దశాబ్దాల్లో 92 వేల మంది పౌరులు మరణించారని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గతంలో వ్యవస్థీకృత ప్రయత్నం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాద ఘటనల్లో పౌరులు, భద్రతా సిబ్బంది మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఉగ్రదాడులకు పాల్పడిన వారికి సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో గట్టి సమాధానం ఇచ్చినట్టు అమిత్ షా గుర్తు చేశారు.
"అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉంది. గతంలో ఉగ్ర దాడులు జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునేది కాదు. ప్రజలు కూడా వాటిని మర్చిపోయేవారు. మోదీ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఉరి, పుల్వామాలో ఉగ్రదాడులు జరిగాయి. కానీ 10 రోజుల్లోనే మేము పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు నిర్వహించాం. ఇప్పుడు కశ్మీర్‌లో సాయంత్రం పూట కూడా సినిమాహాళ్లు తెరిచే ఉంటున్నాయి. జీ20 సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 వరకు అక్కడి యువతకు 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య, పెట్టుబడులు పెరిగాయి. ఈ సభలో బాధ్యతగా మరో విషయం చెబుతున్నాను. 2026 మార్చి 21 లోగా దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తాం."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
అవినీతిని దాచేందుకే భాషా వివాదం!
రాజకీయ లబ్ధి కోసం, అవినీతిని దాచి పెట్టేందు కోసం కొన్ని పార్టీలు భాష అంశాన్ని వివాదం చేస్తున్నాయని అమిత్ షా దుయ్యబట్టారు. భాష పేరిట ఇప్పటికే దేశంలో చాలా వరకు విభజన వచ్చిందని, ఇకపై ఎంతమాత్రం జరగదని వ్యాఖ్యానించారు. హిందీ ఏ భాషకూ పోటీ కాదని, అది అన్ని భాషలకూ సోదర భాష అని పేర్కొనారు. రాజ్యసభలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జాతీయ విద్యావిధానం, త్రిభాష అంశంపై వివాదం నెలకొన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భాష అంశాన్ని వివాదం చేస్తున్నాయి. వారి అవినీతిని దాచుకునే ప్రయత్నిస్తున్నాయి. భారత్‌లోని అన్ని భాషలూ మన దేశానికి ఓ నిధి లాంటివి. హిందీ కూడా ఇతర భాషలకు సోదర భాషే" అని అమిత్ షా అన్నారు. భాష పేరిట విభజన తీసుకొచ్చేందుకు చేపట్టే చర్యలేవీ ఫలించవన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యభాషా విభాగాన్ని ఏర్పాటు చేసిందని చేశారు. తెలుగు, తమిళం, పంజాబీ, అస్సామీ ఇలా అన్ని భాషలనూ ప్రాచుర్యం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.
దక్షిణాది భాషలకు వ్యతిరేకం కాదు!
దక్షిణాది భాషలకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. అలాగైతే తాను గుజరాత్ నుంచి, నిర్మలా సీతారామన్ తమిళనాడు నుంచి ప్రభుత్వంలో మంత్రులుగా ఎలా వ్యవహరిస్తున్నామని ప్రశ్నించారు. "ఇంజినీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి గత రెండేళ్లుగా కోరుతున్నా. దానివల్ల మీ (డీఎంకేని ఉద్దేశిస్తూ) ఆర్థిక ప్రయోజనాలు నెరవేరవని భయపడుతున్నారు. మేం అధికారంలోకి వస్తే మెడికల్, ఇంజినీరింగ్ విద్యను తమిళ భాషలోనే అందిస్తాం" అని అమిత్‌షా అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో అమిత్‌షా వ్యాఖ్యలు ప్రధాన్యం సంతరించుకున్నాయి.