AI Farmer Gaurav Orange Farming : సాధారణ రైతులు రోజూ తెల్లవారుజామునే పొలాలకు పరుగులు తీస్తారు. కానీ మహారాష్ట్రలో ఓ యువరైతు మాత్రం ఇంట్లో ఉండి ఫోన్లో పంటలను పరిశీలిస్తారు. అదేలాగు అంటారా? ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ యాప్ ద్వారా 15 నిమిషాల్లో ప్రతి చెట్టు అప్డేట్ను తెలుసుకుంటారు. దేశంలోనే మొదటిసారి నారింజ సాగులో ఏఐను ఉపయోగించి మంచి లాభలను గడిస్తున్నారు ఈ యువ రైతు.
8 ఎకరాల్లో 1,200 నారింజ చెట్లు
మహారాష్ట్రలోని కరువు ప్రాంతం విదర్భలోని అమ్రావతి జిల్లా ఖార్పి గ్రామానికి చెందిన యువ రైతు గౌరవ్ బిజ్వే ఏఐతో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకున్నారు. 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న 1,200 నారింజ చెట్లను ఆయన రోజూ ఉదయాన్నే ఇంటి నుంచే మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. అది కూడా కేవలం 15 నిమిషాల్లో. కట్ చేస్తే నారింజ తోటలో పురుగుమందులు, శిలీంధ్ర సంహారిణులు, క్రిమిసంహారకాల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. పంటసాగు అవసరాలకు నీటి వినియోగం 50 శాతానికిపైగా తగ్గింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గౌరవ్ బిజ్వే నారింజ తోటలోని ప్రతీ చెట్టు 1,000 నుంచి 1,500 పండ్లను కాసింది.

అతి తక్కువ ఖర్చుతోనే
గౌరవ్ బిజ్వే కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తోంది. అయితే పంటసాగుతో లాభాలు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడం వల్ల పంటపొలాల ఏఐ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సేవలను అందించే ఓ కంపెనీని సంప్రదించారు. అగ్రి ఏఐ సర్వీసులకు సంబంధించిన మొబైల్ యాప్, సెన్సర్లు, సోలార్ ప్యానెల్ సహా మొత్తం కిట్ కోసం రూ.60వేల దాకా ఖర్చు చేశారు. వాటిని గౌరవ్ బిజ్వేకు చెందిన నారింజ తోటలో ఇన్‌స్టాల్ చేశారు. సెన్సార్ ఆధారిత ఉపగ్రహ వ్యవస్థ ద్వారా తోటను లేదా పొలాన్ని ఎప్పటికప్పుడు లైవ్‌లో ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. ఈ విధంగా అగ్రి ఏఐ దిశగా గౌరవ్ బిజ్వే తొలి అడుగులు పడ్డాయి.

'ఈసారి నారింజ సాగులో లాభాలు'
నారింజ తోటను ఏఐ యాప్ నుంచి ట్రాక్ చేయడానికి నేను రూ.60వేల దాకా ఖర్చు పెట్టినట్లు గౌరవ్ బిజ్వే ఈటీవీ భారత్‌కు తెలిపారు. ' దీంతో ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. రోజూ చాలా టైం సేవ్ అవుతోంది. నేను పెట్టిన ఈ పెట్టుబడి వల్ల నారింజ సాగు లాభదాయకంగా మారింది. నారింజ చెట్లు, నేల, వాతావరణం, ఉష్ణోగ్రత ఇలా ప్రతీ దాన్ని ఏఐ సెన్సర్లు ట్రాక్ చేస్తున్నాయి. వ్యవసాయంలో నా రిస్క్‌ను తగ్గిస్తున్నాయి. పంటకు చీడపీడల ముప్పు ఉంటే ముందే అలర్ట్ చేస్తున్నాయి. పంటసాగు వ్యయాలూ తగ్గిపోయాయి. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా మేం నారింజ సాగులో లాభాలను అందుకోబోతున్నాం. ఇదంతా ఏఐ చలువే' అని యువ రైతు గౌరవ్ బిజ్వే అంటున్నారు.

గౌరవ్ ఏఐ వినియోగాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి నారింజ తోటలో స్పష్టమైన తేడా కనిపిస్తోందని గౌరవ్ తండ్రి విజయ్ బిజ్వే అంటున్నారు. 'మా తోట సమీపంలోని ఇతర నారింజ తోటల్లో పండ్లే కనిపించడం లేదు. మా చెట్లలో నిండుగా నారింజలు ఉన్నాయి. ఈసారి మాకు మంచి రాబడి రావడం ఖాయం. సంవత్సరాల నష్టాల తర్వాత లాభాలను పొందబోతున్నాం. ఏఐ సాయం వల్లే ఇది సాధ్యమైంది' అని యువ రైతు విజయ్ బిజ్వే వివరించారు.

'నారింజ సాగులో ఇది తొలి ఏఐ ప్రయోగం'
నారింజ సాగులో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ ప్రయోగమని నాసిక్‌కు చెందిన వ్యవసాయ నిపుణులు డాక్టర్ భూషణ్ గోసావి తెలిపారు. ఏఐ టెక్నాలజీ దిశానిర్దేశంతో రైతులు లాభాలను గడించొచ్చని తేలింది. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి వెన్నెముకగా ఏఐ నిలుస్తుంది. గౌరవ్ బిజ్వేకు చెందిన నారింజ తోటను చూడటానికి అమరావతి, అకోలా, వాషిమ్, యావత్మల్ నుంచి రైతులు, వ్యవసాయ నిపుణులు ఖార్పి గ్రామానికి క్యూ కడుతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. రైతులు ఏఐను అందిపుచ్చుకుంటే వ్యవసాయంలో అద్భుతాలు సాధ్యమవుతాయి' భూషణ్ ఈటీవీ భారత్‌కు వివరించారు. ఆయన గత కొన్నేళ్లుగా ఏఐ టెక్నాలజీతో పొలాల నిర్వహణపై పనిచేస్తున్నారు.
