World Largest Container Ship MSC Irina : ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక- MSC IRINA అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న కేరళలోని తిరువనంతపురం విళింజం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకుంది. దీంతో భారత సముద్ర వాణిజ్య రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.
ఫుట్‌బాల్ మైదానం కంటే నాలుగు రెట్లు!
ప్రపంచంలోనే అత్యధిక టీఈయూ (ఇరవై అడుగుల సమానమైన యూనిట్) సామర్థ్యం కలిగిన ఎంఎస్‌సీ ఇరినా, ఏకంగా 24,346 టీఈయూల కంటైనర్లను మోసుకెళ్లగలదు. అది ప్రపంచ షిప్పింగ్ రంగంలోనే ఎంఎస్‌సీ ఇరినాను శక్తిమంతమైనదిగా నిలబెడుతోంది. నౌక పొడవు 399.9 మీటర్లు కాగా, వెడల్పు 61.3 మీటర్లు. ఒక సాధారణ ఫిఫా ఫుట్‌బాల్ మైదానం కంటే దాదాపు నాలుగు రెట్లు పెద్దదనే చెప్పాలి.
ఆసియా, యూరప్ మధ్య పెద్ద మొత్తంలో కంటైనర్ల రవాణాను సులభతరం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఎంఎస్‌సీ ఇరినా, వాణిజ్య మార్గాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంఎస్‌సీ ఇరినా నౌకను మార్చి 2023లో ప్రారంభించగా, అదే ఏడాది ఏప్రిల్‌లో తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. లైబీరియన్ జెండాతో ప్రయాణించే నౌక, కంటైనర్లను 26 అంచెల వరకు పేర్చగలిగేలా రూపొందింది. ముఖ్యంగా ఎంఎస్‌సీ ఇరినా, ఓఓసీఎల్ స్పెయిన్ కంటే 150 టీఈయూల అధిక సామర్థ్యం కలిగి ఉండటం విశేషం.

పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా, ఎంఎస్‌సీ ఇరినాలో ఇంధన ఆదా ఫీచర్లు అమర్చారు. అవి కార్బన్ ఉద్గారాలను 4 శాతం వరకు తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా కార్యాచరణ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే, కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. భవిష్యత్ పరిశ్రమ అభివృద్ధికి ఇది ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది ఎంఎస్‌సీ ఇరినా. అత్యంత భారీ కంటైనర్ నౌకలను నిర్వహించడంలో విళింజం పోర్టుకున్న అపార సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.

మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విళింజం ఓడరేవుకు, ఎంఎస్‌సీ ఇరినా వంటి భారీ నౌక రాక ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆ పోర్టుకు ఇటీవల ఎంఎస్‌సీ తుర్కియే, ఎంఎస్‌సీ మిచెల్ కాపెల్లిని వంటి ఇతర ఐకాన్-క్లాస్ నౌకలు కూడా వచ్చాయి. దీంతో సముద్ర వాణిజ్యంలో విళింజం పోర్టు ఒక కీలక కేంద్రంగా తన ఖ్యాతిని మరింత పటిష్టం చేసుకుంటోంది.
13 అంతస్తులు, 533 గదులు- ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ షిప్
భారత్-శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభం.. 10 రోజులు మాత్రమే అందుబాటులో..