Women Farmers Agro Industry Turnover : మన దేశంలోని వ్యవసాయ కూలీల్లో ఎక్కువ మంది మహిళలే ఉంటారు. వారి ఆదాయాలు అరకొరగా ఉంటాయి. అయితే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న కర్మద్ సహా వివిధ గ్రామాలకు చెందిన 3,500 మందికిపైగా మహిళా వ్యవసాయ కూలీల జీవితాలు మారిపోయాయి. వారు ఇప్పుడు నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల దాకా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సావిత్రీబాయి పూలే ఫౌండేషన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)ల చొరవతో వీరి జీవితాల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఈ మార్పు దిశగా పడిన స్ఫూర్తిదాయక అడుగుల వివరాలను తెలుసుకుందాం.
నాబార్డ్, సావిత్రీ బాయి పూలే సంస్థ చొరవ
భారతదేశ వ్యవసాయ రంగ విప్లవంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నాబార్డ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక మహారాష్ట్రకు చెందిన సావిత్రీ బాయి పూలే సంస్థ రైతులకు అండగా నిలుస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు లభించని రైతులకు వివిధ రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది. ప్రత్యేకించి కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమలోనూ రైతులకు చేదోడును అందిస్తోంది. గత నాలుగేళ్లలో నాబార్డ్, సావిత్రీ బాయి పూలే సంస్థ సంయుక్తంగా చేసిన కృషితో వ్యవసాయ నేపథ్యం కలిగిన వేలాది మంది మహిళలు ఆర్థిక వికాసాన్ని సాధించారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలో ‘వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్’ కంపెనీ ఏర్పాటుతో ఇది సాధ్యమైంది. ఈ కంపెనీ ఏర్పాటుచేసిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఎంతో మంది గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నాయి.
వ్యవసాయ రంగ ప్రాసెసింగ్ పరిశ్రమలకు దన్ను
నాబార్డ్ చొరవ చూపి ఆశావహ, ప్రగతిశీల మహిళా రైతులను ఒకచోట చేర్చి ఈ కంపెనీని ఏర్పాటు చేయించింది. దీని డైరెక్టర్ల బోర్డులోని ఏడుగురు కూడా మహిళలే. వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ వివిధ వ్యవసాయ రంగ ప్రాసెసింగ్ పరిశ్రమలతో కలిసి పనిచేస్తోంది. బ్యాంకు రుణాల మంజూరులో వాటికి సహకారాన్ని అందిస్తోంది. వ్యవసాయ రంగ పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవహారంలోనూ దన్నుగా నిలుస్తోంది. ఇవన్నీ చేయడానికి ఆయా వ్యవసాయ రంగ ప్రాసెసింగ్ పరిశ్రమలతో వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుందని నాబార్డ్ ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా మేనేజర్ సురేశ్ పట్వేకర్ వెల్లడించారు. "గత నాలుగేళ్లలో 300 విభిన్న ప్రాజెక్టుల ద్వారా మూడున్నర వేల మందికిపైగా మహిళలకు ఆర్థిక సాధికారతను అందించడంలో వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ విజయం సాధించింది" అని సావిత్రీ బాయి పూలే సంస్థ సుస్థిర అభివృద్ధి విభాగం అధిపతి కైలాశ్ రాథోడ్ చెప్పారు.

తొలి ఏడాది రూ.35 కోట్లు- మూడో ఏడాదికల్లా రూ.74 కోట్ల టర్నోవర్
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.74 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ కంపెనీని ఏర్పాటు చేసిన మొదటి ఏడాదిలో రూ.35 కోట్ల టర్నోవర్ వచ్చింది. మూడో ఏడాదికల్లా రూ.74 కోట్ల టర్నోవర్ వచ్చిందని కంపెనీ డైరెక్టర్ శకుంతల ఘాయత్ తెలిపారు.
మొక్కజొన్న ప్రాసెసింగ్ పరిశ్రమ, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమల నుంచే ఈ కంపెనీకి భారీ ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న పెద్దపెద్ద కంపెనీలకు ఈ కంపెనీయే ప్రాసెస్ చేసిన మొక్కజొన్నను సరఫరా చేస్తోంది. మొక్కజొన్నను ప్రాసెసింగ్ చేస్తే 6 రకాల భాగాలు లభిస్తాయి. వీటిలో ఒక ముఖ్యమైన పదార్థాన్ని కుర్కురే వంటి ఫుడ్ ఐటమ్స్ తయారీలో ఉపయోగిస్తారు. వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ పరిధిలో రోజుకు సగటున 3 టన్నుల మొక్కజొన్నను ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల ఆకర్షణీయమైన ఆదాయం వస్తుంది.

ఉల్లి, టమాటా రైతులకు బాసట
మహారాష్ట్రలో పెద్దసంఖ్యలో ఉల్లి, టమాటా రైతులు ఉన్నారు. గిట్టుబాటు ధర లభించక ఈ రెండు పంటలను పండించే రైతులు నరకయాతన అనుభవిస్తుంటారు. ఈవిధంగా గిట్టుబాటు ధరకు నోచుకోని పంటలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేయించడానికి వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాసెసింగ్ చేసిన వెంటనే ఆయా పంటలను వివిధ కంపెనీలకు సరఫరా చేస్తారు. కర్మద్‌లో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్‌లో సోలార్ డ్రైయర్‌ల ద్వారా ఉల్లిపాయల ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎండిపోయిన ఉల్లిపాయలను సుగంధ ద్రవ్యాల కంపెనీలకు అందిస్తారు.
నాకు రోజుకు రూ.1,500 దాకా వస్తున్నాయి : పద్మజ వేదపాఠక్
వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ మొక్కజొన్న ప్రాసెసింగ్ పరిశ్రమలో పద్మజ వేదపాఠక్ పనిచేస్తుంటారు. ఆమె ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. "ఈ పరిశ్రమలో పనిచేస్తున్నప్పటి నుంచి నా ఆదాయం పెరిగింది. గతంలో వ్యవసాయ కూలీ పనికి వెళ్లినప్పుడు నాకు రోజుకు రూ.300 మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు నాకు రోజుకు రూ.1,500 దాకా వస్తున్నాయి. దీంతో నేను కూడా జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకం వచ్చింది" అని పద్మజ వేదపాఠక్ వివరించారు.
అప్పులు తీర్చేసి బంగారం కొన్నాం : రేఖ మోకాలే
"ఇప్పుడు మేం బాగానే సంపాదిస్తున్నాం. ప్రతినెలా డబ్బులు పొదుపు చేస్తున్నాం. మా అప్పులు తీర్చేసి బంగారం కూడా కొన్నాం. మా మనవడు ఇంగ్లిష్ మీడియం స్కూలులో చదువుతున్నాడు" అని వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ ఉల్లిపాయ ప్రాసెసింగ్ యూనిట్‌లో పనిచేసే రేఖ మోకాలే చెప్పుకొచ్చారు.