Bihar Election Results 2025

ETV Bharat / bharat

'అర్ధరాత్రి క్యాంపస్ బయటికి వైద్య విద్యార్థిని ఎందుకు వెళ్లింది?'- గ్యాంగ్​రేప్​పై మమతా బెనర్జీ

సామూహిక అత్యాచార ఘటనపై బంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు- విద్యార్థులు రాత్రి టైంలో హాస్టళ్ల బయటికి వెళ్లొద్దని హితవు

DURGAPUR MEDICAL STUDENT GANGRAPE
DURGAPUR MEDICAL STUDENT GANGRAPE (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : October 12, 2025 at 3:44 PM IST

|

Updated : October 12, 2025 at 3:52 PM IST

4 Min Read
Choose ETV Bharat

Mamata Banerjee on Gangrape case : ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని(23)పై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై బంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఆ వైద్య విద్యార్థిని కాలేజీ క్యాంపస్ బయటికి ఎలా వెళ్లిందని ఆమె ప్రశ్నించారు. క్యాంపస్‌లో ఉండే విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రైవేటు మెడికల్ కాలేజీలకూ ఉంటుందని దీదీ హితవు పలికారు. అర్ధరాత్రి సమయంలో ప్రత్యేకించి విద్యార్థినులను బయటికి పంపకూడదన్నారు. చదువుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి బంగాల్‌కు వచ్చే విద్యార్థులు రాత్రి సమయంలో క్యాంపస్‌ల బయటికి వెళ్లొద్దని మమత సూచించారు. వారంతా తప్పకుండా కాలేజీ క్యాంపస్‌లు, హాస్టళ్ల రూల్స్‌ను పాటించాలని కోరారు. ఎవరు, ఏ సమయంలో ఇళ్ల బయటికి వెళ్తున్నారో పోలీసులకు తెలియదని, ప్రతీ ఇంటికి పోలీసులు కాపలా కాయలేరని ఆమె స్పష్టం చేశారు. ఒడిశా వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ఏ ఒక్క దోషినీ వదిలేది లేదన్నారు. అత్యాచారం అభియోగాలతో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామని దీదీ వెల్లడించారు. ఇటీవలే ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన ఉత్తర బంగాల్ పర్యటన కోసం ఆదివారం రోజు మమతా బెనర్జీ బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో కోల్‌కతా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"బాధిత వైద్య విద్యార్థిని ఒడిశా వాస్తవ్యురాలు. ఇలాంటి కేసులపై సమగ్ర విచారణ చేయించడంలో, బాధితులకు న్యాయాన్ని అందించడంలో బంగాల్ రాష్ట్ర సర్కారు అస్సలు రాజీపడదు. రెండు నుంచి మూడు నెలల్లోనే మేం ఛార్జ్‌షీట్లను దాఖలు చేస్తాం. మూడు వారాల క్రితం ఒడిశాలోని ఓ బీచ్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిగింది. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఒడిశా సర్కారు చెప్పాలి. బీజేపీ పాలిస్తున్న ఒడిశా, మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. అక్కడ రేపిస్టులు కోర్టు దాకా చేరకముందే, వారిని రోడ్లపై తగలబెడుతున్నారు. బెంగాల్‌లో అలా జరగదు. ఇలాంటి ఘటనలను మేం సపోర్ట్ చేయం. వాటితో ఏకీభవించం"

--మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

స్త్రీత్వానికి మచ్చతెచ్చేలా మమత సిగ్గుమాలిన వ్యాఖ్యలు : బీజేపీ
మరోవైపు సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దోషులపై సత్వర చర్యలు తీసుకోవడానికి బదులుగా, బాధిత యువతినే తప్పుపట్టేలా మమత మాట్లాడారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీత్వానికి మచ్చతెచ్చేలా సిగ్గుమాలిన వ్యాఖ్యలతో బంగాల్ సీఎం నోరు పారేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక మహిళగా సీఎం హోదాలో ఉన్నప్పటికీ, సాటి మహిళల బాధను మమతా బెనర్జీ అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. మహిళలు, యువతులు, విద్యార్థినులకు భద్రత కల్పిస్తానని భరోసా ఇవ్వాల్సిన బెంగాల్ సీఎం, రాత్రయ్యాక బయటికి వెళ్లొద్దని హితవు పలకడం సిగ్గుచేటు అంశమని గౌరవ్ భాటియా అన్నారు. సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు దీదీకి లేదన్నారు. హృదయం లేని, అరాచక స్వభావం కలిగిన మమతను నమ్మి సీఎం చేసినందుకు బంగాల్ ప్రజలకు కనువిప్పు కలిగిందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

అసలేం జరిగింది?
ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన యువతి(23) బంగాల్‌ దుర్గాపూర్‌లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సెకండియర్ చదువుతోంది. శుక్రవారం రాత్రి డిన్నర్ చేయడానికి ఆమె తన స్నేహితుడితో కలిసి కాలేజీ క్యాంపస్ బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే పలువురు దుండగులు వారిద్దరినీ వెంబడించారు. ఆ దుండగులు వైద్య విద్యార్థినిని బెదిరించి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించారు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాలిని గమనించిన కొందరు స్థానికులు సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

కోర్టు ఎదుటకు ముగ్గురు నిందితులు
శనివారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, వైద్య విద్యార్థిని స్నేహితుడు కూడా ఈ నేరంలో పాల్గొన్నాడని పోలీసులు గుర్తించారు. అతడే వైద్య విద్యార్థినిని తప్పుదారిపట్టించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని వెల్లడైంది. ఈమేరకు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. బాధితురాలు అందించిన సమాచారం మేరకు మరింత మందిని పోలీసులు విచారణ చేస్తున్నారు. వైద్య విద్యార్థిని స్నేహితుడితో పాటు అపు బౌరీ(21), ఫిర్దోస్ షేక్(23), షేక్ రియాజుద్దీన్(31) అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రోజు ముగ్గురు నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టామని అసన్‌సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ అభిషేక్ గుప్తా వెల్లడించారు.

'నా కూతురు నడిచే స్థితిలో లేదు'
తన కూతురు ప్రస్తుతం నడిచే స్థితిలో లేదని, ఆమె బెడ్‌రెస్ట్‌పై ఉందని బాధిత వైద్య విద్యార్థిని తండ్రి ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. కూతురిని వీలైనంత త్వరగా సొంత రాష్ట్రం ఒడిశాకు తీసుకెళ్లిపోయేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన బంగాల్ సీఎం మమతా బెనర్జీని కోరారు. తన కూతురిపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత బంగాల్‌పై, అక్కడి విద్యాసంస్థలపై నమ్మకం కోల్పోయానని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు తన కూతురి ఫ్రెండ్ ఒకతను కాల్ చేసి, అత్యాచార ఘటనపై తమకు సమాచారాన్ని అందించాడని తెలిపారు. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య తన కుమార్తెపై అఘాయిత్యం జరిగిందన్నారు. కాలేజీ క్యాంపస్‌లో, హాస్టల్ వద్ద తగినన్ని భద్రతా ఏర్పాట్లు లేవని బాధిత వైద్య విద్యార్థిని తండ్రి ఆరోపించారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తనకు ఫోన్ కాల్ చేశారని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తన కూతురికి ఒడిశాలోనే మెడికల్ సీటును ఇప్పించాలని కోరానని, అందుకు సీఎం మాఝీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. అంతకుముందు ఎక్స్ వేదికగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఒక ట్వీట్ చేశారు. ఆదర్శవంతంగా ఉండేలా ఈ కేసులోని నిందితులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కోరారు.

Last Updated : October 12, 2025 at 3:52 PM IST