Waqf Amendment Act 2025 : వక్ఫ్ ఆస్తులు, భూములను పాఠశాలలు, ఆసుపత్రులు, సంక్షేమానికి ఉపయోగించేలా కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సమాజంలో అనేక అపోహలు ఏర్పడ్డాయి. ముస్లింలో వెనకబడిన వర్గాలు, మహిళల సాధికారత కల్పించేందుకు చట్టంలో సవరణలు చేయడంపైనా అనుమానాలు నెలకొన్నాయి. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించడంపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అనుమానాల్లో నిజమెంత, అసలు వాస్తవాలేమిటి అనేది ఒకసారి పరిశీలిద్దాం.
అల్లాహ్‌కే అంకితం చేసిన మసీదులు, మదర్‌సాలు, కబ్రస్థాన్‌లను వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా?
వక్ఫ్ సవరణ చట్టంలో అలాంటి నిబంధనలు ఏమీ లేవు. ఇప్పటికే ఉన్న మసీదులు, మదర్‌సాలు, కబ్రస్థాన్‌ల విషయంలో చట్టం ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వ ఆస్తి లేదా వివాదాస్పద ఆస్తి అయితే తప్ప సవరణ చట్టం అమల్లోకి రాకముందే వక్ఫ్ ఆస్తిగా నమోదైనవి అలాగే కొనసాగుతాయి. వాటిల్లో ఎలాంటి మార్పులు ఉండవు.
వక్ఫ్ సవరణ చట్టం ద్వారా కలెక్టర్‌కు ఏకపక్ష అధికారాలు దక్కుతాయా?
సవరణ చట్టం నిబంధనల ప్రకారం సర్వే కమిషనర్ స్థానాన్ని కలెక్టర్‌తో భర్తీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ముస్లిం సమాజం ఎలాంటి ప్రభావానికి గురికాదు. ఒకవేళ వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి కనుక అయితే కలెక్టర్ కంటే సీనియర్ అధికారి దానిపై విచారణ చేపడతారు.
సవరణ చట్టం ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందా?
సవరణ చట్టంలో ఏ భాగమూ ముస్లింల మత స్వేచ్ఛలో జోక్యం చేసుకోదు. చట్ట సవరణ ఉద్దేశం వక్ఫ్‌ను మరింత ప్రయోజనకరంగా మార్చి పేదలు, అణగారినవారికి లబ్ధి చేకూర్చడమే.
వక్ఫ్ సవరణచట్టం రాష్ట్రాల అధికారాలను కూడా లాగేసుకుని కేంద్రానికి కట్టబెడుతుందా?
వక్ఫ్ సవరణ చట్టం నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దానికి కార్యనిర్వాహక అధికారిని కూడా నియమించవచ్చు. వక్ఫ్ బోర్డు నిర్వహణకు నిబంధనల రూపకల్పన, బడ్జెట్ ఆమోదం, వక్ఫ్ ఆస్తులపై నోటిఫికేషన్ విడుదల, వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు అధికారం కూడా రాష్ట్రానికే ఉంటుంది.
సవరణ చట్టంలో ముత్తావలీలకు శిక్ష విధించడం దారుణమా?
పాత చట్టం అమల్లో ఉన్నప్పుడు చాలా మంది ముత్తావలీలు ఆస్తులకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లను సమర్పించడంగానీ, ఎకౌంట్లు ఆడిట్ గానీ చేయించలేదు. గత చట్టంలో కూడా ముత్తావలీలకు జరిమానా, జైలు శిక్ష విధించే నిబంధలు ఉన్నాయి. ఇప్పుడు చేసిన సవరణలో జరిమానాను మాత్రమే పెంచారు. జైలు శిక్ష పరిమితిని మాత్రం పెంచలేదు.
అగాఖానీలు, బొహ్రాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డు ప్రతిపాదించడం ముస్లింలలో విభజన తెస్తుందా?
ముస్లింలో వెనకబడిన తరగతులు, మహిళలు, షియాలు, బొహ్రా,అగాఖానీల ప్రాతినిథ్యం పెంచేందుకే వక్ఫ్ సవరణ చట్టం చేశారు. అవసరమైన పక్షంలోనే బొహ్రాలు, అగాఖానీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సవరణ చట్టం కల్పిస్తుంది.
వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడా?
చట్టం ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంది. ఆస్తికి చట్టబద్ధమైన యజమానులైన ముస్లింలు మాత్రమే తమ ఆస్తిని వక్ఫ్‌గా ఇవ్వడానికి అర్హులు. సదరు ఆస్తిలో మహిళలు, పిల్లలు, కుటుంబ సభ్యుల హక్కునుకాదని ఎవరూ వాటిని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించలేరని చట్టం స్పష్టంచేస్తోంది.
ముస్లిమేతరులను బోర్డులో చేర్చడం అంటే బోర్డును బలహీనపరడమా?
ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం వెనక ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకే. రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లోని 11 మంది సభ్యుల్లో ముగ్గురు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లోని 21 మంది సభ్యుల్లో నలుగురు మాత్రమే ముస్లిమేతరులు ఉంటారు. ఎక్స్ అఫీసియో సభ్యుడు కూడా వారిలో కలిసే ఉంటారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా వంటి కమిటీల మాదిరేగానే అన్ని కమిటీలు ముస్లింలకు సాయంచేయడానికి ఉద్దేశించినవే.
వక్ఫ్ ట్రైబ్యునల్ అధికారాలకు కొత్త చట్టంలో కత్తెర వేశారా?
వ్యక్తుల ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా లాక్కునే సందర్భంలో సివిల్ కోర్టులు, హైకోర్టులకు వెళ్లే అవకాశాన్ని సవరణ చట్టం కల్పిస్తుంది.
వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించి, బలహీన పరిచారా?
ఎలాంటి రుజువు లేకుండా ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడం వివాదాలకు, సామాజిక ఉద్రిక్తతలకు కారణమైంది. అలాగే వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 108Aని తొలిగించడం వల్ల వక్ఫ్ చట్టం ఇతర చట్టాలకు అతీతంగా కాకుండా సమన్వయంగా ఉంటుంది. వివాదాలు తగ్గుతాయి.