Vice President Jagdeep Dhankar On Rahul : అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పరోక్షంగా రాహుల్‌పై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.
''రాజ్యాంగం, జాతీయ ప్రయోజనాల గురించి ఆ వ్యక్తికి కనీస ఆలోచన లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి శత్రువులతో చేతులు కలపడంకన్నా జుగుప్సాకరమైన అంశం మరొకటి ఉండదు. దేశానికి వెలుపల ఉన్న ప్రతి భారతీయుడు ఒక రాయబారిగా ఉండాలి. కానీ, ఆయన వ్యవహరించిన తీరు బాధాకరం. దేశ స్వాతంత్య్ర, రక్షణ కోసం ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరో మహిళలు తమ భర్త, పిల్లలను కోల్పోయారు. మన జాతీయవాదాన్ని అపహాస్యం చేయలేము. దేశానికి 5 వేల ఏళ్ల నాగరికత ఉందనే విషయం ఆ వ్యక్తికి అర్థం కావడం లేదు. మహనీయుల కృషి ఫలితంగా పవిత్రమైన రాజ్యాంగం అవతరించింది. కానీ, కొందరు మాత్రం దేశాన్ని విభజించాలనుకుంటున్నారు. ఇది వారి అజ్ఞానాన్ని తెలియజేస్తోంది'' '' అని రాహుల్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు.
కాగా, అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడ ఆయా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెతుతున్నాయి. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్, కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కేంద్రమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆ తర్వాత రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలకు రాహుల్ వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లను 50 శాతానికి మించి తీసుకెళ్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన జగదీప్ ధన్‌ఖడ్ కాంగ్రెస్ నేతపై ఈ వ్యాఖ్యలు చేశారు.