Langur Attended The Funeral : ఎవరైనా చనిపోతే, భౌతిక కాయాన్ని కడసారి చూడటానికి చాలామంది తరలి వస్తారు. ఈ జాబితాలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇరుగుపొరుగు వారు ఉంటారు. అయితే మున్నా సింగ్ అనే వ్యక్తి చనిపోగా, అతడి భౌతిక కాయాన్ని చూడటానికి ఒక లంగూర్ (కొండముచ్చు) కూడా వెళ్లింది. అది గంటల తరబడి మున్నా సింగ్‌ను చూస్తూ అక్కడే మౌనంగా కూర్చుండిపోయింది. తదుపరి జరిగిన అంతిమ యాత్రలోనూ లంగూర్ పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎవరీ మున్నా సింగ్?
మున్నా సింగ్ విషయానికొస్తే, ఈయన జార్ఖండ్ రాష్ట్రం దేవఘర్ జిల్లాలోని బ్రాంసోలి గ్రామానికి చెందినవాడు. స్థానికుల కథనం ప్రకారం, మున్నా సింగ్ బతికి ఉండగా జంతువులు, కోతులు, కొండ ముచ్చులను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. వాటికి రొట్టెలు, అన్నం పెట్టేవారు. మూగ జీవాలపై ఎవరైనా దాడికి యత్నిస్తే మున్నాసింగ్ అడ్డుకునేవారు. అలా చేయొద్దని వారించే వారు. మున్నా సింగ్ హనుమంతుడి భక్తుడని పలువురు గ్రామస్తులు చెప్పారు.
ఒక అనూహ్య పరిణామం
మున్నా సింగ్ చనిపోయాక, ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఇంటి బయటపెట్టారు. ఆ తర్వాత ఊరి ప్రజలంతా ఒకరి తర్వాత ఒకరిగా అక్కడికి చేరుకున్నారు. మున్నా సింగ్ భౌతిక కాయాన్ని చూసి వెళ్లిపోయారు. మాజీ రాష్ట్ర మంత్రి, మాజీ ఎమ్మెల్యే రణధీర్ సింగ్ కూడా మున్నా సింగ్ మృతదేహాన్ని చూడటానికి వచ్చిన వారిలో ఉన్నారు. ఇంతలో ఒక అనూహ్య పరిణామం జరిగింది.
'దేవుడి ఆట'-- "హనుమంతుడి మహిమ"
అకస్మాత్తుగా ఒక కొండముచ్చు వచ్చి మున్నా సింగ్ మృతదేహం వద్ద చేరుకొని, అతడి మొహాన్ని తీక్షణంగా చూడసాగింది. అది ఆ విధంగా చూస్తూ, అక్కడే గంటల తరబడి కూర్చుండిపోయిందని ప్రత్యక్ష సాక్షులు మహేష్ సింగ్, మోహన్ చౌదరి, వరుణ్ సింగ్ తెలిపారు. మున్నా సింగ్ మృతదేహం వద్ద కొండముచ్చు కూర్చోవడాన్ని చూసి గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు. 'ఇది దేవుడి ఆట' అని కొందరు చెప్పగా, 'ఇది హనుమంతుడి మహిమ' అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
అంతిమయాత్రలోనూ కొండముచ్చు
ఆ కొండముచ్చు అంతటితో ఆగకుండా మున్నా సింగ్ అంతిమయాత్రలోనూ పాల్గొంది. అంతిమయాత్ర మార్గంలో అందరితో పాటు కలిసి నడిచి వెళ్లింది. ఈక్రమంలో కొండముచ్చుకు గ్రామస్తులు నమస్కారాలు చేశారు. చివరకు అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనూ లంగూర్ చాలాసేపు కూర్చుండిపోయింది. మనుషులపై జంతువులు చూపే ప్రేమ చాలా లోతైనదని అందరూ చర్చించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
'ఈసారి పూరీ రథయాత్రకు వచ్చే భక్తులకు మాస్కులు తప్పనిసరి'
మూడంతస్తుల ఇంటిపైన కారు- సెల్ఫీ స్పాట్‌గా మెకానిక్ ఇల్లు- ప్రతి అమావాస్య, పౌర్ణమికి ప్రత్యేక పూజలు